ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతే...

by Ravi |   ( Updated:2024-07-16 01:01:16.0  )
ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతే...
X

అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో మహిళల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తుంది. రానురాను లింగ నిష్పత్తిలో వస్తున్న వ్యత్యాసం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత దశాబ్దకాలం పైగా అనేక దేశాల్లో అమ్మాయిల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో వివాహం కాని బ్రహ్మచారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

అనేక దేశాల్లో అమ్మాయిల సంఖ్య తగ్గడంపై జనాభాలో చైతన్యం రాకపోతే భవిష్యత్‌లో వివాహ వ్యవస్థే కాదు, సామాజిక సమతుల్యత కూడా దెబ్బతినే అవకాశం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఆడపిల్ల పుడితే సహించలేని తత్వంతో భ్రూణ హత్యలకు పాల్పడటం, ఒకే బిడ్డ విధానానికి తల్లిదండ్రులు మొగ్గుచూపడం, కుటుంబ ఆర్ధిక పరిస్ధితులతో బిడ్డలు కనడంపై ఆచితూచి ముందుకు వెళ్లడం లాంటి కారణాలు అమ్మాయిల కొరతకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

అమ్మాయిల కొరతతో..

“ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి “ అని గతంలో పెద్దలు పిల్లలు పెళ్లీడుకు వచ్చిన సమయంలో చెప్పిన మాట. కానీ ప్రస్తుత తరుణంలో అనేక దేశాల్లో పెళ్లి వయస్సు మూడు పదుల నుండి నాలుగు పదులు దాటుతున్నా… అమ్మాయిల కొరతతో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచంలోని అత్యధిక జనాభా గల చైనా లాంటి దేశంలో అమ్మాయిలు లేకపోవడంతో 30 మిలియన్ల మంది బ్రహ్మచారులుగా మిగిలిపోయినట్లు 2021 మే14న ఆ దేశ జనాభా లెక్కలు విడుదల సందర్భంగా పెళ్లికాని ప్రసాదులు వివరాలను ప్రకటించారు. సగటున ఈ దేశంలో 111 మంది పురుషులు ఉంటే కేవలం 100 మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. చైనాలో తల్లిదండ్రులు ఒకే బిడ్డ విధానాన్ని అనుసరించడం, అబ్బాయిలనే ఇష్టపడే తీరు కారణంగా ఆడబిడ్డల సంఖ్య అక్కడ గణనీయంగా తగ్గుతుంది. ఆ దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆడపిల్లల పట్ల విముఖత కారణంగా విపరీత పరిణామాలు జరుగుతున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి.ఆడపిల్లల కొరతతో ఇతర దేశాల నుండి బాలికలను అక్రమ రవాణా చేయడం , పొరుగు దేశాల నుండి అమ్మాయిలను కొనుగోలు చేసి అనైతిక కార్యక్రమాలు చేసే పరిస్థితి దాపురించింది.

ఉత్తరాది సంబంధాలకు వేట

మన దేశంలో కూడా ఆడపిల్లల పట్ల కొన్ని వర్గాల్లో ఉన్న అహేతుకమైన భావనతో నేడు లింగ నిష్పత్తిలో యువతుల సంఖ్య తగ్గిపోవడానికి కారణమవుతుంది. ఈ వ్యత్యాసం కారణంగానే దేశంలోని పలు రాష్ట్రాల్లోని యువకులకు అమ్మాయిలు దొరక్కపోవడంతో వివాహాలు జరగడం లేదు. ఒక అంచనా ప్రకారం 1000 మంది యువకులు ఉంటే కేవలం 928 మంది మాత్రమే యువతులు ఉన్నారు . దీంతో అమ్మాయిలు దొరక్క పెళ్లిళ్లు కాకపోవడంతో బ్రహ్మచారుల సంఖ్య పెరిగిపోతుంది. తమిళనాడులో అగ్రవర్ణ కులమైన బ్రాహ్మణ సామాజికవర్గంలో అమ్మాయిలు దొరక్క 40 వేల మంది యువకులకు ఉత్తరాది రాష్ట్రాల్లో సంబంధాలు వెతుకుతున్నారు . పెళ్లి సంబంధాల కోసం మా తరపున ప్రత్యేక ఉద్యమం చేపట్టామని అక్కడి బ్రాహ్మణ సంఘాలు నాయకులు ప్రకటించిన సందర్భాలను చూసాం. గుజరాత్ లో బలమైన పటేళ్ల సామాజికవర్గంలో ముఖ్యంగా కద్వా పటేళ్ల వర్గంలో స్త్రీ , పురుష నిష్పత్తిలో వ్యత్యాసం అనేక సమస్యలను సృష్టిస్తుంది. పటేళ్లలో కొంతమంది ఇతర ప్రాంతాలకు చెందిన అమ్మాయిలను ఎదురుకట్నం ఇచ్చి మరీ వివాహాలను చేసుకుంటున్నారు.

అమ్మాయి దొరికితే చాలు..

తెలుగు రాష్ట్రాల్లో కూడా అమ్మాయి సంఖ్య తగ్గడంతో చాలామంది యువకులకు వివాహాలు జరగడం లేదు. ముఖ్యంగా బ్రాహ్మణ, వైశ్య , క్షత్రియ , కాపు సామాజివర్గాల్లో యువతుల సంఖ్య తగ్గడంతో బ్రహ్మచారులు పెరిగిపోతున్నారు. గతంలో సామాజిక కట్టుబాట్లు, ఆచారాలు, శాఖలు అంటూ చెప్పుకొచ్చే ఆయా సామాజిక వర్గాల వారు అన్నిటినీ బ్రేక్ చేసి అబ్బాయిలకు అమ్మాయి దొరికితే చాలు పెళ్లిచేద్దాం అనే పరిస్ధితికి వచ్చారు. అమ్మాయిల కొరతతో ఎదురవుతున్న పరిస్థితులపై సమాజంలో మార్పు రావలసిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఆడబిడ్డల ఆవశ్యకతపై ఎంత చైతన్యం తీసుకొస్తున్నా…సమాజంలో మార్పు రాకపోతే ఫలితాలు అందే అవకాశం లేదు . భ్రూణ హత్యలను అరికట్టడంతో పాటు తల్లిదండ్రుల్లో అవగాహన రావల్సిన అవసరం ఉంది. ఒకే బిడ్డ చాలు అనే భావన వీడాల్సిన సమయం ఆసన్నమైంది. దైనందిక జీవితంలో యవతీయువకులకు పెరుగుతున్న ఒత్తిడి పిల్లలు పుట్టకపోవడానికి కారణాలను అన్వేషించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. పరిస్ధితుల్లో మార్పు రాకపోతే ప్రపంచవ్యాఫ్తంగా లింగనిష్పత్తిలో వచ్చే వ్యత్యాసం కారణంగా ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గి దుష్ఫలితాలు తలెత్తే అవకాశాలున్నాయి.

అడపా నాగదుర్గారావు

90007 25566

Advertisement

Next Story

Most Viewed