విద్యావిధానం ఇలా ఉంటే..

by Ravi |   ( Updated:2024-08-29 23:45:56.0  )
విద్యావిధానం ఇలా ఉంటే..
X

ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే ఉన్నత చదువులు చదువుకున్న నేను గత రెండు దశాబ్దాలుగా వివిధ ప్రయివేటు విద్యాసంస్థల్లో గణిత ఉపాధ్యాయుడిగా, భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా, అప్పుల తాకిడితో విపరీతమైన ఆర్థిక సమస్యలను చూసిన విద్యాసంస్థల నిర్వాహకుల్లో ఒకడిగా ఉంటున్నాను. అన్నింటికీ మించి విద్యారంగ ప్రేమికుడిగా నాకు విద్యతో విడదీయరాని సంబంధం, విడదీయలేని అనుబంధం వుంది. పాఠాలు బోధించిన అనుభవంతో నేటి విద్యావ్యవస్థలోని మార్పులపై నేను కొన్ని నా ఆలోచనలను బాధ్యతతో మీకు విన్నవిస్తున్నాను.

ప్రవేశ పరీక్షలకు అనుగుణంగా..

ఈ రోజు విద్య కొంతమంది స్వార్థం, కొన్ని రాజకీయ కారణాల వల్ల వ్యాపారంగా తన రూపు మార్చుకోవడం ప్రారంభమైంది. ఐఐటీ, నీట్ వంటివి అసామాన్యమైన ప్రతిభ గల గ్రామీణ, తాలుకా స్థాయి పేద విద్యార్థులకు సైతం అందని ద్రాక్ష అయ్యింది. అందుకే పేద ధనిక సామాజిక సాంస్కృతిక సాంఘిక లింగ కుల మతం వంటి తదితర అంతరాలు లేకుండా అందరికీ సమానంగా "అంతర్జాతీయ స్థాయి విద్య"అందాలి. చదువు "కొనడం" పూర్తిగా మాయమై చదువుకునే అవకాశాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరికీ సమానంగా ఉండాలి. అంతరిక్ష ప్రయోగాల కాలంలో మనం రాణించాలంటే మీరన్నట్లు ప్రపంచంతో పోటీపడాల్సిందే.

ప్రైమరీ, హైస్కూల్, ఇంటర్ స్థాయి సిలబస్‌లు ఒకదానికొకటి సంబంధం ఉండాలి. సబ్జెక్ట్ నిపుణుల సాయంతో రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల కనుగుణంగా నూతన సిలబస్, బోధనా పద్ధతులును రూపొందించాలి. మనం అక్కడక్కడ వెలుగులోకి వస్తున్న ఫేక్ సర్టిఫికెట్‌లు కొనుక్కునే స్థాయి కాకుండా వంద ఏళ్ల చరిత్ర కలిగిన మన విశ్వ విద్యాలయాల్లో పి.హెచ్ డి, ఎం.ఎస్సీ, బి.ఎడ్ వంటి తదితర చదువులు చదివి నెట్, సెట్, టెట్ వంటి అర్హత పరీక్షల్లో పాసై, విద్యారంగం, బోధనపై ఆసక్తి వుండి కొన్ని కారణాల వల్ల ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉద్యోగం పొందని వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి విద్యాసంస్థలు నెలకొల్పేలా ప్రోత్సహించాలి.

వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తే..

కేజీ నుంచి పీజీ వరకు బోధన, బోధనేతర ఖాళీలను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ సాయంతో భర్తీ చేయాలి. బడ్జెట్‌లో విద్యకు 15% నిధులు కేటాయించాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కూడా సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేస్తూ ఐఐటీ నీట్ ఫౌండేషన్ విద్యను కూడా ఒత్తిడి లేకుండా అందించగలిగితే విద్యను వ్యాపారం చేస్తున్న వ్యవస్థలను మనం నిర్మూలించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయ, అధ్యాపక పిల్లలు ప్రభుత్వ స్కూల్లో, కళాశాలల్లో చదివిస్తే ఆ తల్లిదండ్రులను గుర్తించి, వారి గురించి ఆదర్శప్రాయంగా మీడియాలో రాస్తున్నారంటే మన ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యావ్యవస్థపై లోతుగా విశ్లేషించాల్సిన అవసరం వుంది. ఆర్థికంగా లేని వాళ్లే ప్రభుత్వ బడిబాట అనే విధానంలో కచ్చితంగా మార్పు రావాలి. విద్య మనందరి ప్రాథమిక హక్కు.

సివిల్స్ అభ్యర్థుల వలె..

శారీరక, మానసిక దృఢత్వం కోసం ఆటలకు ప్రత్యేక సమయం కేటాయించాలి. మీరు తెలంగాణ క్రీడాకారులను ఒలింపిక్స్ పథకాలు తెచ్చేలా ప్రోత్సాహం అందిస్తామన్న తీరును స్వాగతిస్తున్నాం. దానికి పాఠశాలలే పునాది కావాలి. సివిల్స్ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు మీరు అందించిన ఆర్థికసాయం అభినందించదగినది. దానివల్ల భవిష్యత్‌లో మన రాష్ట్రం నుంచి సివిల్స్‌కు పోటీపడే అభ్యర్థుల సంఖ్య పెరుగుతుంది. విశ్వవిద్యాలయాల స్థాయిలో పరిశోధనలు పెరిగేలా రిసెర్చ్ స్కాలర్స్‌కు కూడా స్కాలర్‌షిప్ అందించాలి. రసాయనాల కోసం ఆర్థిక సాయం అందించాలి. ఇంజనీరింగ్, మెడికల్ విద్యా వ్యవస్థలో నూతనత్వం కోసం నిపుణుల సలహాలు తీసుకోవాలి. మన పిల్లలకు నాణ్యతతో కూడిన, ఆందోళన లేని పరిసరాలతో స్నేహం చేసే శాస్త్రీయ విద్యను మనం అందించాలి. వివిధ రంగాల ప్రజల నుంచి, వివిధ రకాల విద్యాసదస్సులు, చర్చల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి విభిన్న ఆలోచనల సారాంశాన్ని సేకరించి ఓ మంచి విద్యావిధానంతో మన పిల్లలకు గొప్ప గొప్ప కలల భవిష్యత్తును నిజం చేయాలి.

ఫిజిక్స్ అరుణ్ కుమార్

తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి

93947 49536

Advertisement

Next Story

Most Viewed