ఇదీ సంగతి: గుజరాత్ లో ఆ 15 గోడల మధ్య దుఃఖం ఆగేనా?

by Ravi |   ( Updated:2022-12-08 18:31:04.0  )
ఇదీ సంగతి: గుజరాత్ లో ఆ 15 గోడల మధ్య దుఃఖం ఆగేనా?
X

అక్కడ విజయం సాధించిన ఎమ్మెల్యే ఏ పార్టీవారు అయినా గోడలను తొలగించాలి. విద్య, వైద్యం లాంటి సౌకర్యలను కల్పించాలి. బిల్కిస్ బానోకు మరోసారి అన్యాయం జరిగింది. నేరస్తుల విడుదల పై కనీసం మాట్లాడినవారు లేరు. మోర్బీ సంఘటనకు కారణం అయిన కాంట్రాక్టర్ మీద చర్యలు లేవు. ఎన్నికలను మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రమంతా హంగామా చేసినవారికి గోద్రావాసుల సమస్యలు పట్టలేదు. విపక్షాలు, మెయిన్ స్ట్రీమ్ మీడియా అటు దిక్కే చూడలేదు. ఇట్ల అయితే ఎట్ల? పీఎం మోదీజీ 'జరా నజర్ డాలో' పొలిటికల్ పార్టీలు, నేతలు క్రైమ్ ప్రొటెక్టర్లు అయిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిజానికి అధికార పార్టీ పాలసీలు భయం పుట్టిస్తున్నాయి. విద్వేష రాజకీయాలు, విభజన రాజకీయాలు ఆవేదన కల్పిస్తున్నాయి. ఈ రాజకీయాలు ఇంకా ఎంత కాలం?

15 గోడల మధ్యన దూరం ఒక వర్గాన్ని దుఃఖంలో ముంచుతున్నది. హిందూ-ముస్లిం వాడల మధ్యన నివసించే ఈ ప్రజల మధ్యన అవినావభావ సంబంధాలకు ఎలాంటి సమస్య లేదు. సమస్యల్లా గోడలే. పక్కాగా ఇటుకలతో కట్టేసారు. అలా కట్టేసి 20 యేండ్లు దాటింది. ఎక్కడో కాదు మన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, హోమ్ మంత్రి అమిత్ షా పుట్టి పెరిగిన, మోడీ చాలా కాలం సీఎంగా ఉండి వచ్చిన గుజరాత్ రాష్ట్రంలోని గోద్రా నియోజకవర్గంలోని పరిస్థితి ఇది. ఇలాంటి విషయాలు తెలిసినపుడు, చూసినపుడు ఆందోళన కలుగుతుంది. మనసు బాధపడుతుంది. గుండె బరువెక్కి కండ్లలో నీళ్లు తీసుకునే పరిస్థితి వస్తుంది.

గుజరాత్ రాష్ట్రంలో(gujarat) ముస్లింలు పది శాతానికి కొంత తక్కువే ఉన్నా, గోద్రాలో మాత్రం 22 నుంచి 25 శాతం ఉంటారు. ఇక్కడి అభివృద్ధి పట్ల ప్రభుత్వం ఎన్నడూ శ్రద్ధ తీసుకోలేదు. ఎనిమిదవ తరగతి వరకు ఉర్దూ మీడియం పాఠశాల ఉంది. ఆ తర్వాత చదువుకు అహ్మదాబాద్ వెళ్లాల్సిందే. ఆందోళన కరవిషయం ఏమంటే, ఇక్కడ బ్యాంక్ లేదు, ఒక్క ఏటీఎం కూడా లేదు. 70 యేండ్ల కింద నిర్మించిన వంతెన ఉంది. నిరంతరం బ్రిడ్జి కింద నుంచి నీళ్లు పోతూ ఉంటాయి. ఇది అండర్ బ్రిడ్జి మాత్రమే. చెత్తా చెదారంతో నిండి ఉంటుంది. దీని కింది నుంచి పనుల కోసం, ఉపాధి కోసం,ఉద్యోగాల కోసం రోజూ సుమారు ఎనిమిది వేల మంది వచ్చి పోతుంటారు. ఇస్మాయిల్ అనే జర్నలిస్ట్ ఒకరు ఈ బ్రిడ్జ్ గురించి చెబుతూ చాలా విషయాలలో గోద్రాలో ఒక వర్గం ప్రజలు ఎలాంటి తప్పు చేయకున్నా తీవ్ర వివక్షను ఎదురుకుంటున్నారని వాపోయారు. పీఎం నరేంద్ర మోడీ గుజరాత్ లో సీఎం(gujarat cm) గా ఉన్నప్పటికీ నుంచి ఇదే పరిస్థితి ఉందంటారు ఆయన.

మహనీయులు పుట్టిన నేల

మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ లాంటి మహానుభావులు పుట్టిన గుజరాత్‌లో ఇలా మనుషుల మధ్యన మతాల పేరిట గోడలు, గేట్‌లు నిర్మించడం, ఈ పరిస్థితిని పాలకులు చోద్యం చూడడం, మరీ దారుణం. అమానవీయం. పైగా ఆ ప్రాంతం అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేయడం కూడా మంచి పద్ధతి కాదు. ఏదో విదేశీ బోర్డర్ సరిహద్దులా, వాటిని తలపించే ఈ అడ్డు గోడలను తొలగించాలి, 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లు, విధ్వంసం, మారణహోమం తెలియంది కాదు. ఇంకా వాటిని ప్రతీ ఎన్నికలలో గుర్తు చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. అలా కూడా ప్రయోజనం పొందే పరిస్థితిని కల్పించుకుంటూ ఉంటారు. ఈసారి అదికూడా జరిగింది.

నిరుద్యోగం, ఆకలి, అధిక ధరలు, అసమానతలు దేశంలోని ఇతర రాష్ట్రాలలో మాదిరి గుజరాత్‌లోనూ ఉన్నాయి. నిషేధం ఉన్నా మద్యం ఏరులై పారుతుంది. ఎంతో మంది కల్తీ మద్యం సేవించి మరణించారు. ఈ దృశ్యాలు ఇక్కడ సజీవం అంటే అతిశయోక్తి కాదు. ఇంతే కాదు, ఇక్కడ అదానీ పోర్ట్‌లో(adani port) డ్రగ్స్ లభించాయి. దేశంలో ఇప్పుడు గుజరాత్ డ్రగ్స్‌కు పెద్ద అడ్డాగా మారింది. ఇక్కడ డ్రగ్స్ శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేసారనే ఆరోపణలూ ఉన్నాయి. దేశానికీ గుజరాత్ మోడల్‌ను పరిచయం చేస్తూ, అభివృద్ధిని తెలుపుతూ నరేంద్ర మోడీ(narendra modi) పీఎం అయ్యారు. అమిత్ షా(amit shah) దేశానికి హోమ్ మంత్రి అయ్యారు. గోద్రాలో ఇంకో ప్రత్యేకత ఉంది. ఆ విషయం చదివేవారికి నవ్వు తెప్పిస్తుంది. ఆశ్చర్యం కలుగుతుంది. అదేమంటే, అక్కడి పోలీస్ స్టేషన్ పేరు 'ఏక్తా పోలీస్ చౌకీ'. దానిని అదే పేరుతో పిలుస్తారు. సోషల్ డెవలప్‌మెంట్ అసలు లేదు.

వారికీ తప్పని నిరసన

గోద్రాలోని గ్రామీణ ప్రాంతమైతే చాలా నిర్లక్ష్యానికి గురయ్యింది. నియోజకవర్గం మొత్తం తిరిగి చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎప్పుడో 25 యేళ్ల క్రితం తప్పితే కాంగ్రెస్ కూడా మైనారిటీకి టికెట్ ఇవ్వలేదు. ఇక బీజేపీకి టోటల్ రాష్ట్రంలోనే ఎవరికీ ఇచ్చే పరిస్థితి లేదు. ఎంఐఎం(MIM) మాత్రం ఒక ముల్లా కు ఇచ్చింది. అయితే, ఇక్కడ ఇటీవల ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీకి(asaduddin owaisi) మైనారిటీలు 'గో బ్యాక్' అంటూ నల్ల జెండాలు చూపారు. బీజేపీకి బీటీమ్ అంటూ నిరసన తెలిపారు. ఇక్కడ ఎన్నికలలో ఎవరు గెల్చినా, ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా మనుషుల మనసులను విడదీయకండి. గోద్రాలోని మనుషుల మధ్యన ఏర్పాటు చేసిన అడ్డు గోడలను తొలగించండి. ఆ దిశన అక్కడ విజయం సాధించిన ఎమ్మెల్యే ఏ పార్టీవారు అయినా గోడలను తొలగించాలి. విద్య, వైద్యం లాంటి సౌకర్యలను కల్పించాలి.

బిల్కిస్ బానోకు మరోసారి అన్యాయం జరిగింది. నేరస్తుల విడుదల పై కనీసం మాట్లాడినవారు లేరు. మోర్బీ సంఘటనకు కారణం అయిన కాంట్రాక్టర్ మీద చర్యలు లేవు. ఎన్నికలను మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రమంతా హంగామా చేసినవారికి గోద్రావాసుల సమస్యలు పట్టలేదు. విపక్షాలు, మెయిన్ స్ట్రీమ్ మీడియా అటు దిక్కే చూడలేదు. ఇట్ల అయితే ఎట్ల? పీఎం మోదీజీ 'జరా నజర్ డాలో' పొలిటికల్ పార్టీలు, నేతలు క్రైమ్ ప్రొటెక్టర్లు అయిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిజానికి అధికార పార్టీ పాలసీలు భయం పుట్టిస్తున్నాయి. విద్వేష రాజకీయాలు, విభజన రాజకీయాలు ఆవేదన కల్పిస్తున్నాయి. ఈ రాజకీయాలు ఇంకా ఎంత కాలం? బుద్ధిజీవులరా కదలండి, నేలమీది నిజాన్ని చూసి స్పందించండి.


ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

98518 65223

Advertisement

Next Story

Most Viewed