- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదర్శ ప్రేమ @ ఆర్య సమాజ్
ప్రత్యామ్నాయంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, ఎండోమెంట్ టెంపుల్స్ ఉన్నప్పటికీ ఆక్కడి సంక్లిష్ట నిబంధనలు యువతకు ఇబ్బందికరంగా ఉంటున్నాయి. పాస్ట్ కల్చర్‌లో భాగంగా మ్యారేజ్ కూడా వీలైనంత ఈజీ మెథడ్‌లో, తొందరగా జరిగిపోవాలని కోరుకుంటున్నారు. దీర్ఘకాలం కలిసి బతికే జీవితాలకు లీగల్ చిక్కులు లేకుండా చూసుకోవడమూ అవసరం. ఇందుకు ఆర్యసమాజ్ మాత్రమే ఏకైక వేదిక కాదు. తల్లిదండ్రులలో ఉండే సనాతన, సంప్రదాయ భావాలను, భిన్నాభిప్రాయాలను గౌరవించాలన్న అంశాన్ని యువత పరిగణనలోకి తీసుకోవాలి. నేటి తరం పిల్లల ఆలోచనలను తల్లిదండ్రులూ అర్థం చేసుకోవాలి. పరస్పరం అభిప్రాయాలను షేర్ చేసుకోవడం ద్వారా పెళ్లిపై ఏకాభిప్రాయం నెలకొంటే అంతకు మించిన ఆనందం లేదు. ఆర్యసమాజ్ అవసరమూ ఏర్పడదు.
ఆదర్శ వివాహాలకు కేరాఫ్ అడ్రస్ ఆర్య సమాజ్. వందేళ్లకు పైగా అస్థిత్వం, లక్షలాది వివాహాలకు సజీవ సాక్ష్యం. ఎంతోమందికి పెళ్లి చేసి ఓ ఇంటివారిని చేసిన వేదిక. కులమతాలకు అతీతంగా, పేద-ధనిక తేడాలు లేని ఎన్నో పెళ్లిళ్లకు నిలువెత్తు నిదర్శనం. తల్లిదండ్రుల సమ్మతి లేని యువ జంటలకు నైతికంగా భరోసా ఇచ్చిన కేంద్రం. కానీ, ఇప్పుడు ఇదంతా గతం. మధ్యప్రదేశ్‌కు సంబంధించిన ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పుతో ఆర్య సమాజ్ పెళ్లిళ్లకు ఫుల్‌స్టాప్ పడింది. పెళ్లిళ్లు చేయడం, సర్టిఫికెట్‌లు ఇవ్వడం ఆర్యసమాజ్ పని కాదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. చట్టబద్ధంగా ఈ పని చేయడానికి ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇకపైన ఆర్య సమాజ్‌లో పెళ్లిళ్లు ప్రశ్నార్థకమయ్యాయి.
సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఓ అనూహ్య పరిణామం. సరికొత్త సందేహాలకు తావిచ్చింది. దశాబ్దాలుగా జరిగిన పెళ్లిళ్లపై చర్చకు తెరలేపింది. తీర్పు మంచి చెడులపై చర్చ అవసరం లేదు. కానీ, భారత సమాజంలో ఆర్య సమాజ్‌లో జరిగే పెళ్లిళ్లపై చర్చను లేవనెత్తింది. ఇప్పటివరకు జరిగిన పెళ్లిళ్లను ప్రశ్నార్థకం చేసింది. ఎన్నో ఏళ్లుగా ఆర్య సమాజ్‌లో జరుగుతున్న వివాహాలపై ప్రజలకు ఒక నమ్మకం ఉన్నది. అది జారీ చేసే సర్టిఫికెట్లపైనా విశ్వసనీయత ఉన్నది. ఆ భరోసాతోనే అక్కడ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. చాలామంది నవ దంపతులు మళ్లీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లి సర్టిఫికెట్ తీసుకోవాలని భావించలేదు. ప్రభుత్వం తరఫున సబ్ రిజిస్ట్రార్ ఇచ్చే మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం అనే సెకండ్ థాట్‌కూ వెళ్లలేదు. ఆర్యసమాజ్ ఇచ్చే సర్టిఫికెట్‌కు చట్టబద్ధత ఉన్నదనే భావనే అందుకు కారణం.
ఆర్థిక స్వావలంబన
భారత సమాజంలో ఇటీవల అనేక సామాజిక, ఆర్థిక మార్పులు చోటుచేసుకున్నాయి. సంస్కరణల కారణంగా యువతలో ఆర్థిక స్వావలంబన నెలకొన్నది. యువతీ యువకుల ఆలోచనలలో, చైతన్యంలో స్పష్టమైన తేడా కనిపిస్తున్నది. తరాల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు, వారి పిల్లల మెచ్యూరిటీలో ఇది ప్రస్ఫుటమవుతున్నది. భవిష్యత్తు జీవితంపై నవతరంలో భరోసా ఏర్పడింది. తల్లిదండ్రుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా స్వంతంగా నిర్ణయం తీసుకునే ఆత్మస్థయిర్యం పెరిగింది. జీవితంలో సెటిల్ కావడం, పెళ్లి చేసుకోవడంపై స్పష్టమైన అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. సామాజిక చైతన్యం వారిని ఆ దిశగా నడిపిస్తున్నది. ఇలాంటి 'కాబోయే జంటల'కు ఆర్య సమాజ్ సరైన వేదిక అనే భావన నెలకొన్నది.
'తల్లిదండ్రులు ఒప్పుకుంటే సరి, లేకుంటే ఆర్య సమాజ్‌కు వెళ్లి పెళ్లి చేసుకుంటాం' అనే ఒక ధీమా వ్యక్తమవుతున్నది. సామాన్యుల మొదలు సమాజంలో పలుకుబడి కలిగిన కుటుంబాల వరకు ఎంతో మంది యువతీ యువకులను ఆర్య సమాజ్ దంపతులను చేసింది. ఆర్య సమాజ్‌లో జరిగిన పెళ్లిళ్లన్నీ సక్సెస్ అయ్యాయనో, మూడునాళ్ల ముచ్చటగా మిగిలిపోయాయనో చర్చ అవసరం లేదు. కానీ, మనస్ఫూర్తిగా ఒకరినొకరు అర్థం చేసుకుని జంటగా స్థిరపడాలనుకునే లక్షలాది మందికి మాత్రం 'ఆర్య సమాజ్ ఉందిగా' అనే ఒక భరోసా నెలకొన్నది. ఇక్కడ పెళ్లి చేసుకుని సర్టిఫికెట్ తీసుకుంటే ఇక కుటుంబ జీవనం గడపడానికి లైసెన్సు వచ్చినట్లే అనేది వారి ధైర్యం. నిజానికి పెళ్లిళ్లు చేయడమే ఆర్య సమాజ్ బాధ్యత కాదు. ఇటీవలి కాలంలో అక్కడా వ్యాపార ధోరణి పెరిగిపోయింది. డబ్బులిస్తే ముందూ వెనకా చూడకుండా పెళ్లిళ్లు చేసేస్తారనే అభిప్రాయమూ ఉన్నది.
చికాకులు లేని పెళ్లిళ్లు
దంపతులు కావాలనుకునే యువతీ యువకులు వీలైనంత తక్కువ చికాకులతో ఒక్కటి కావాలనుకుంటారు. తక్కువ రిస్కుతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఇద్దరూ మేజర్లే అని ధ్రువీకరించే సర్టిఫికెట్లు, లోకల్ రెసిడెంట్ సర్టిఫికెట్లు, ఇద్దరి తరఫున సాక్షులు ఉంటే గంటల వ్యవధిలో ఒక జంట అయిపోవచ్చనే భావనే వారిని ఆర్య సమాజ్‌వైపు నడిపిస్తున్నది. ఇటీవలి కాలంలో వచ్చిన చట్టబద్ధమైన నిబంధనలలో భాగంగా ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు వివరాలు, బయోమెట్రిక్ వేలిముద్రలు తీసుకోవడం లాంటిదీ జనరల్ ప్రాక్టీసుగా మారింది. ఇక పెళ్లి తంతు విషయానికి వస్తే ఇండ్లలో, గుడిలో, కల్యాణ మండపాలలో పురోహితుల సమక్షంలో వేదమంత్రాల నడుమ జరుగుతున్న తరహాలోనే ఆర్య సమాజ్‌లోనూ సంప్రదాయబద్ధంగా పెళ్లి జరుగుతున్నది.
ఎండోమెంట్ డిపార్టుమెంటు అనుమతి ఉన్న ఆలయాలలో పెళ్లి చేసుకునే వెసులుబాటు దీర్ఘకాలంగానే ఉన్నది. కానీ ఆర్యసమాజ్‌లో అవలంబిస్తున్న విధానాలు సింపుల్‌గా ఉంటాయి. అందుకే ఆర్యసమాజ్‌పై ఒక ప్రత్యేక నమ్మకం. తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలకు భిన్నంగా పెళ్లి చేసుకోవాలనుకున్నా చాలా మందికి ధైర్యం ఉండదు. ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న పరువు హత్యల భయం ఉండనే ఉంది. ధైర్యంగా ఉన్నవారికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికో లేక ఏదైనా ఎండోమెంట్ రిజిస్టర్డ్ టెంపుల్‌కో వెళ్లి పెళ్లి చేసుకోడానికి ఎలాంటి జంకూ ఉండదు. నిర్దిష్ట గడువు, పబ్లిక్ నోటీసు, ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు.. ఇలాంటి టైమ్ పట్టే వ్యవహారంతో చాలా మంది ఆర్య సమాజ్‌వైపు చూడడానికి కారణమవుతున్నది.
పాత పెళ్లిళ్లు చెల్లవా?
సుప్రీంకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆర్య సమాజ్‌లో జరిగిన పెళ్లిళ్ళపై సరికొత్త సందేహాలను లేవనెత్తాయి. ఇప్పటికే జారీచేసిన సర్టిఫికెట్‌లు చెల్లుతాయా లేవా అనే అనుమానాలు పుట్టాయి. వాటికి చట్టబద్ధత ఉంటుందా లేదా అనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు, వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇక నుంచి జరిగే పెళ్లిళ్లకు (ప్రాస్పెక్టివ్) మాత్రమే వర్తిస్తుందా? లేక గతంలో జరిగినవాటికీ (రిట్రోస్పెక్టివ్) వర్తిస్తుందా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. న్యాయవాదులలోనూ దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గతంలో పెళ్లి చేసుకున్నవారూ ఇప్పుడు మ్యారేజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిందేననే వాదన వినిపిస్తున్నది. మనుమలు, మనుమరాళ్లు కూడా వచ్చేసిన తర్వాత ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం ఆర్య సమాజ్‌లో జరిగిన పెళ్లికి చట్టబద్ధత కోసం ఇప్పుడు ప్రభుత్వం నుంచి మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవడమా అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. ఎండోమెంట్ ఆలయాలలో జరుగుతున్న తీరులోనే ఆర్యసమాజ్‌లోనూ హిందు సంప్రదాయబద్ధంగా పెళ్లి జరుగుతున్నప్పుడు అక్కడ లేని అభ్యంతరం ఇక్కడ ఎందుకు అనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. కులాల, మతాల పట్టింపులు లేకుండా ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకోవాలనుకునేవారికి సుప్రీంకోర్టు తాజా తీర్పు ఒకింత నిరుత్సాహాన్ని కలిగిస్తున్నది. ఆ పెళ్ళిళ్ళకు చట్టబద్ధత ఉండదనేది మింగుడు పడడం లేదు.
ఇలా అయితే ఆ అవసరమూ ఉండదు
ప్రత్యామ్నాయంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, ఎండోమెంట్ టెంపుల్స్ ఉన్నప్పటికీ ఆక్కడి సంక్లిష్ట నిబంధనలు యువతకు ఇబ్బందికరంగా ఉంటున్నాయి. పాస్ట్ కల్చర్‌లో భాగంగా మ్యారేజ్ కూడా వీలైనంత ఈజీ మెథడ్‌లో, తొందరగా జరిగిపోవాలని కోరుకుంటున్నారు. దీర్ఘకాలం కలిసి బతికే జీవితాలకు లీగల్ చిక్కులు లేకుండా చూసుకోవడమూ అవసరం. ఇందుకు ఆర్యసమాజ్ మాత్రమే ఏకైక వేదిక కాదు. తల్లిదండ్రులలో ఉండే సనాతన, సంప్రదాయ భావాలను, భిన్నాభిప్రాయాలను గౌరవించాలన్న అంశాన్ని యువత పరిగణనలోకి తీసుకోవాలి. నేటి తరం పిల్లల ఆలోచనలను తల్లిదండ్రులూ అర్థం చేసుకోవాలి. పరస్పరం అభిప్రాయాలను షేర్ చేసుకోవడం ద్వారా పెళ్లిపై ఏకాభిప్రాయం నెలకొంటే అంతకు మించిన ఆనందం లేదు. ఆర్యసమాజ్ అవసరమూ ఏర్పడదు.
ఎన్. విశ్వనాథ్
99714 82403