- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగ పర్వం:సర్కారు బడి మారేదెలా?
సమస్యలను పట్టించుకునే నాథుడు లేక ప్రభుత్వ పాఠశాలలు గాడి తప్పుతున్నాయి. ఉన్న సమస్యలు చాలవన్నట్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నుంచి కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. ఉపాధ్యాయుల, పాఠశాల విద్యారంగ సమస్యల పరిష్కారానికి సంఘాలు ఉమ్మడిగా, విడివిడిగా అనేకసార్లు ప్రాతినిధ్యాలు చేసినా, ఆందోళనలు నిర్వహించినా ప్రభుత్వం నుంచి స్పందనే లేదు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరించాలన్న ధ్యాస విద్యాశాఖ అధికారులలో లేకపోవడం పాఠశాలలకు శాపంగా మారింది.
ఖాళీలు ఉన్నా ప్రమోషన్లు సున్నా
2001 నుంచి టీచర్లకు జూనియర్ లెక్చరర్, 2005 నుంచి ఎంఈఓ, డైట్ లెక్చరర్ ప్రమోషన్స్ కల్పించలేదు. 2015 నుంచి స్కూల్ అసిస్టెంట్, హైస్కూల్ హెడ్మాస్టర్ పదోన్నతులు కూడా లేవు. 2018 నుంచి ఉపాధ్యాయులకు కనీసం బదిలీలు లేవు, దీంతో ఉపాధ్యాయులలో తీవ్ర నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. పక్కనున్న ఏపీలో ఉపాధ్యాయులకు ప్రతి నెలా పదోన్నతులు, యేటేటా బదిలీలు చేస్తున్నప్పుడు, తెలంగాణలో ఎందుకు సాధ్యం కావడం లేదో అర్థం కావడం లేదు.
విద్యా ప్రణాళికలు రూపొంచాల్సిన ఎస్‌సీఈఆర్‌టీ ప్రొఫెసర్లు, ఛాత్రోపాధ్యాయులకు, విద్యనందించాల్సిన డైట్ కళాశాలల లెక్చరర్లకు డీఈఓలుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. మరి, ఎస్‌సీఈఆర్‌టీ, డైట్ కళాశాలలు ఎలా నడవాలి? జీహెచ్ఎం గ్రేడ్-2లకు పాఠశాల విధులతోపాటు ఆరేడు మండలాలకు ఇన్‌చార్జి ఎంఈఓలుగా నియమిస్తున్నారు. వీరు పనిభారం పెరిగి దేనికీ న్యాయం చేయలేకపోతున్నారు. తూతూ మంత్రం పాఠశాలల తనిఖీలతో విద్యారంగం పూర్తిగా గాడి తప్పింది.
సీఎం ప్రకటించినా
సుమారు రెండు వేల జీహెచ్ఎం గ్రేడ్-2 పోస్టులు, సీఎం అసెంబ్లీలో ప్రకటించిన పదివేల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు, పండిట్, పీఈటీల అప్‌గ్రేడేషన్‌తో ఏర్పడిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు దాదాపు 20 వేల వరకు పదోన్నతులతో భర్తీ చేయాల్సి ఉంది. ఏడేండ్లుగా ప్రమోషన్లు లేవు. ప్రమోషన్లను విద్యాశాఖ అధికారులు కేవలం టీచర్లకు ప్రయోజనం చేకూర్చే అంశంగానే చూస్తున్నారు. పోస్టులు భర్తీ అయితే విద్యాబోధన మెరుగుపడుతుందనే కోణంలో చూడడం లేదు, కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులు, 'మన ఊరు-మన బడి' వంటి ఆకర్షణీయ పథకం, 1 నుండి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం తదితర కారణాలతో ప్రభుత్వ పాఠశాలలలో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
పాఠశాలల అవసరాలకనుగుణంగా రెగ్యులర్ ఉపాధ్యాయుల నియామకం కోసం టీఆర్‌టీ ప్రకటిస్తే బాగుండేది. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల దాటినా వలంటీర్లను, ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లను నియమించలేదు. తరగతికో టీచర్ లేకపోతే, విద్యాబోధన జరిగేదెలా? ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల విశ్వాసం పెరిగేదెలా? కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలు చేస్తామంటూ పదేపదే చెప్పడమే తప్ప ఆచరణలో చూపింది లేదు. రెగ్యులర్ టీచర్లతో సమానంగా వారికి వేతనాలు ఇవ్వరు. ఆకస్మిక సెలవులు సైతం 27 ఇవ్వడం లేదు. సర్వీస్ రెగ్యులరైజ్ చేయడం లేదు. ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు జూలై 21 వరకూ జూన్ నెల జీతాలు మంజూరు చేయలేదు.
317 జీఓ బాధితుల గోడు వినరా?
ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలతో మాట మాత్రంగా కూడా చర్చించకుండా అసంబద్ధంగా 317 జీఓను జారీ చేసి వేలాది మంది ఉపాధ్యాయుల స్థానికతను పాతరేశారు. పుట్టి, పెరిగి, చదువుకున్న జిల్లా నుంచి ఇతర జిల్లాలకు నిర్బంధంగా శాశ్వత బదిలీలు చేశారు. తప్పుల తడకగా సీనియారిటీ జాబితాలు రూపొందించి, అభ్యంతరాలను పరిష్కరించకుండానే ఆగమేఘాల మీద జిల్లాలు కేటాయించి అప్రజాస్వామికంగా వ్యవహరించారు. స్పౌజ్ కేటగిరీలో భార్యను ఒక జిల్లాకు, భర్తను మరో జిల్లాకు పంపి కుటుంబాలను కకావికలం చేశారు. అలొకేషన్ తర్వాత స్పౌజ్ కేటగిరీకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి 13 జిల్లాలను బ్లాక్ చేసి వారికి తీరని వ్యథని మిగిల్చారు. ఎవరికీ చెప్పాపెట్టకుండా రివర్స్ స్పౌజ్ బదిలీలు చేయడంతో మెజారిటీ టీచర్లకు న్యాయం జరగలేదు. మెడికల్ గ్రౌండ్స్, వితంతువులు పెట్టుకున్న అప్పీళ్లను కోర్టుకు వెళ్తే తప్ప పట్టించుకోవడం లేదు. ఆరు నెలలు దాటినా అప్పీళ్లను పరిష్కరించే పరిస్థితి లేదు. పరస్పర బదిలీల కోసం 21 నంబర్ జీఓ జారీ చేసినా, ఇరువురిలో ఒకరు తప్పకుండా 317 జీఓ పరిధిలో బదిలీ అయి ఉండాలన్న కండిషన్ పెట్టారు. పూర్వ జిల్లా / జోన్ సీనియారిటీ ఇవ్వనప్పుడు ఈ కండిషన్ ఎందుకు? దీంతో చాలా మంది పరస్పర బదిలీ పరిధిలోకి రాకుండా పోయారు.
సీపీఎస్ తో అభద్రతాభావం
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంతో రాష్ట్రంలో లక్షా యాభై వేలకు పైగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు అభద్రతా భావంతో ఉన్నారు. హక్కుగా పొందాల్సిన పెన్షన్, సీపీఎస్ పుణ్యమాని లక్కుగా, దైవాధీనంగా మారిపోయింది. సామాజిక భద్రత ఏ మాత్రం లేదు. తన డబ్బుతో పెన్షన్ కొనుక్కునే దుస్థితి దాపురించింది. రాజస్థాన్ తదితర రాష్ట్రాలు రద్దు చేసినట్లుగా సీపీఎస్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. 2003 డీఎస్‌సీ వారు పాత పెన్షన్ పథకానికి పూర్తిగా అర్హులు అయినా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం అన్యాయం.
పాఠశాలలు ప్రారంభమైన వెంటనే రావాల్సిన పాఠ్య పుస్తకాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. అకడమిక్ ఇయర్ ప్రారంభంలోనే మంజూరు చేయాల్సిన స్కూల్ గ్రాంట్స్, ఎమ్మార్సీ, కాంప్లెక్స్ గ్రాంట్స్, విద్యా సంవత్సరం ముగిసే ముందు ఇస్తే ఏం ప్రయోజనం? స్కూల్ కాంప్లెక్స్‌లకు అదనపు బాధ్యతలు అప్పగించారు తప్ప, ఆ మేరకు గ్రాంట్స్ పెరుగుదల లేదు. గతంలో ఉన్న సర్వీస్ పర్సన్స్‌ని తొలగించడంతో పాఠశాలలలో పారిశుద్ధ్యం అడుగంటింది. సీఎం సత్వరం జోక్యం చేసుకోవాలి. ఉన్నతస్థాయి సమీక్ష చేసి, దిద్దుబాటు చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపడితేనే సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయి. సర్కారీ బడి నిలబడుతుంది.
మానేటి ప్రతాపరెడ్డి
టీఆర్‌టీఎఫ్ గౌరవాధ్యక్షుడు
98484 81028