- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జాతీయ రాజకీయాలపై కర్ణాటక ఫలితాల ప్రభావమెలా!?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం. కానీ ఆ ప్రకంపనలు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. పలు రాజకీయ మార్పులకు శ్రీకారం చుట్టాయి. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరించిన సీనియర్ రాజకీయ నేతలు సైతం ఇప్పుడు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గొంతు విప్పారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయంటూనే స్నేహ సంబంధాలకు జై కొట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సైతం కాంగ్రెస్‌కు దగ్గర కావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కర్ణాటకలో కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చిన పలితం జాతీయ రాజకీయాల్లోనే కీలకమైన మార్పుకు దారితీసింది. రానున్న పార్లమెంటు ఎన్నికల కోసం బీజేపీ వ్యతిరేక శక్తులు ఐక్య పోరాటం అవసరాన్ని గుర్తించాయి. ఏడాది పాటు జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు అనివార్యమనే రాజకీయ పరిస్థితి నెలకొన్నది. కర్ణాటక నుంచి పట్నా మీదుగా ఢిల్లీకి పొలిటికల్ జర్నీ ఇప్పటికే ప్రారంభమైంది. రానున్న పార్లమెంటు ఎన్నికల కోసం బీజేపీ వర్సెస్ అపోజిషన్ అనే నినాదం బలపడుతున్నది. యాంటీ-బీజేపీ శక్తుల ఐక్యతపై ఒక్కొక్కరు గొంతు విప్పుతున్నారు. ఇప్పటికే దాదాపు డజను పార్టీలు సిద్ధమయ్యాయి.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చొరవతో వారం పది రోజుల్లో పట్నాలో బీజేపీ వ్యతిరేక పార్టీల సమావేశానికి రంగం సిద్ధమైంది. తెలుగుదేశం, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బిజూ జనతాదళ్, అకాలీదళ్ లాంటి కొన్ని పార్టీలు మాత్రం ఈ సమావేశానికి దూరంగానే ఉంటున్నాయి. బీజేపీని ఢీకొట్టాలంటే దానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్న పార్టీలన్నీ కలిసి బలమైన ఫ్రంట్‌గా ఏర్పడాలనేది ప్రధాన డిమాండ్. కాంగ్రెస్‌తో విభేదాలున్నప్పటికీ ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థికి వ్యతిరేకంగా ఒక్కటి కావాలన్నదే అందులోని ప్రధాన సూత్రం. అందువల్లనే కొన్ని పరిమితులతో సహకారం అందించడానికి సిద్ధమంటూ సంకేతాలు వెలువడుతున్నాయి.
బీజేపీ 'ముక్త్ సౌత్'
అధికారంలో ఉండి కూడా ఎందుకు ఓడిపోయామంటూ బీజేపీలో పోస్టుమార్టం మొదలైంది. ప్రధాని మోడీ రంగంలోకి దిగినా ప్రయోజనం లేదనే కామెంట్లతో పాటు, ఇక్కడ ఓడింది బీజేపీ కాదు.. ప్రధాని మోడీ అంటూ కాంగ్రెస్ కామెంట్ చేసింది. కానీ ఓటింగ్ శాతం తగ్గలేదని, పార్టీ పటిష్టంగానే ఉన్నదని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. మోడీ ప్రచారం చేసిన బెంగుళూరు సిటీలో బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చాయంటూ సమర్ధించుకున్నది. ఏ వాదన ఎలా ఉన్నా ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అని స్లోగన్ ఇచ్చినా చివరకు ‘బీజేపీ ముక్త్ సౌత్ ఇండియా’గా మారిందనేది పాపులర్ అయింది. కర్ణాటక ఎఫెక్ట్ రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై పడకుండా ఆ పార్టీలో ముందు జాగ్రత్త చర్యలు మొదలయ్యాయి.
జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తుల ఓటు బ్యాంకు చీలిపోకుండా ఒక ఫ్రంట్‌గా ఏర్పడాలనే వాదన తెరపైకి వచ్చింది. ప్రాంతీయ పార్టీల మధ్య ఓట్లు చీలితే అది బీజేపీకి లాభిస్తుందని భావిస్తున్నారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నీ పటిష్టంగానే ఉన్నా తటస్థంగా ఉండేవారిని కూటమికి మద్దతు ఇచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. అందులో భాగమే ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల నేతలంతా పట్నాలో జరిగే సమావేశానికి హాజరవ్వాలనే నిర్ణయం. పదేళ్ళుగా అధికారంలో ఉన్న బీజేపీ పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకోవాలన్నది ఆ పార్టీల భావన. కర్నాటకలోని రిజల్ట్ పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ స్థాయిలో సాకారం కావాలన్నది వాటి కోరిక.
అలర్ట్ అయిన బీఆర్ఎస్
జాతీయ స్థాయిలో పార్టీల సమీకరణాలు అలా ఉంటే తెలంగాణలోనూ కర్ణాటక రిజల్ట్ ఎఫెక్ట్ కనిపిస్తున్నది. ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్ టౌన్‌లో హిందూ ఏక్తాయాత్ర జరిగింది. ‘హిందుత్వ’ నినాదమే ఈ ప్రోగ్రామ్ ఏకైక లక్ష్యం. బీఆర్ఎస్ సైతం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నాయకులతో సహా మొత్తం పార్టీ నాయకులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అక్కడి అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఎలాంటి పరిణామాలకు దారితీసిందో తెలంగాణతో పోలుస్తూ వివరించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం తెలంగాణ మీద ఎలా ఉంటుందనే అంశాన్ని వివరించడంతో పాటు ఈ ఏడాది చివర్లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని మెసేజ్ ఇచ్చారు. కర్ణాటకలో బీజేపీకి గత ఎన్నికల్లో పోలైన ఓటింగ్ శాతంలో పెద్దగా తేడా లేదు. పార్టీ మీద వ్యతిరేకత కంటే రాష్ట్ర నాయకుల పనితీరే ఓటర్లను భిన్నమైన నిర్ణయం తీసుకునేలా చేసిందనే అంశాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తించారు. ప్రజల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటున్న లీడర్లకు మరోమారు టికెట్ ఇవ్వడమా.. లేక కొత్త ముఖాలను తెరపైకి తేవడమా అనే చర్చ మొదలైంది. కర్ణాటకలో కనీసం యాభై మందిని మార్చడం ద్వారా బీజేపీ ప్రతికూల ఫలితాలనే ఎదుర్కొన్నది.
బీజేపీలో అంతర్గత సంక్షోభం
కర్ణాటకలో బీజేపీ ఎదుర్కొన్న చేదు అనుభవం తెలంగాణలోని ఆ పార్టీకీ పాకింది. హిందుత్వ నినాదంతో కరీంనగర్‌లో ఏక్తా యాత్రను బండి సంజయ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు. కానీ రాష్ట్ర నాయకులు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్ లాంటి లీడర్లను పిలవకపోవడం పార్టీలో ఇంటెర్నల్‌గా చర్చకు దారితీసింది. ఇప్పటికే బండి సంజయ్‌ను లోలోపల వ్యతిరేకిస్తున్న పలువురు కర్ణాటక రిజల్ట్ తర్వాత మరింత అసహనానికి లోనయ్యారు. హడావిడిగా ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లడం అనేక అనుమానాలకు దారితీసింది. హైకమాండ్ పిలిపించిందా.. లేక ఈయనే వెళ్ళారా అనేది ఆసక్తి రేపింది.
పార్టీలోని చేరికల కమిటీకి చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్ మునుగోడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్తగా చేరికలు లేకపోవడంపై సంస్థాగతంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర పార్టీ ఫంక్షనింగ్‌పై గత కొంతకాలంగా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నాయకత్వ మార్పు మొదలు అసెంబ్లీ ఎన్నికలకు ఎజెండాను ఫిక్స్ చేయడం వరకు పలు అంశాలను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళడమే ఆయన పర్యటన లక్ష్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అసంతృప్తి, అసమ్మతి ఏ సమయంలోనైనా అంతర్గత సంక్షోభానికి దారితీయవచ్చనే మాటలు ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. కొత్తగా చేరికల సంగతేమోగానీ చేజారిపోకుండా చూసుకోవడం ఇప్పుడు పెద్ద టాస్క్ గా మారింది.
గ్రూపులతో ‘హస్త’వ్యస్తం
కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే అని ఆ పార్టీ నేతలు గొప్పగానే చెప్పుకుంటారు. ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉందంటారు. నేతలు గ్రూపులు, వర్గాలుగా విడిపోయారు. కర్ణాటకలోనూ ఇలాంటి జాడ్యం ఉన్నా విభేదాలను పక్కన పెట్టి ఎన్నికల్లో ఐక్యంగా పనిచేశారు. తెలంగాణలో ఇలాంటి ఐక్యత సాధ్యమేనా అనే మాటలు రాష్ట్ర నేతల నుంచి వినిపిస్తున్నాయి. కర్ణాటక రిజల్ట్ తెలంగాణ పార్టీలో జోష్ పెంచింది. బీజేపీ, బీఆర్ఎస్‌లోని అసంతృప్త నేతలు భారీగా చేరుతారనే ఆశాజనకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగడం, ఈటల రాజేందర్ హడావిడిగా ఢిల్లీ వెళ్లడం గమనార్హం.
మరోవైపు షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారమూ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం బీఆర్ఎస్‌తో పొత్తులో ఉన్న సీపీఐ సైతం కాంగ్రెస్‌తో జత కట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఆ పార్టీ నేత నారాయణ మాటల్లో వ్యక్తమవుతున్నది. జాతీయ స్థాయి సమీకరణాల్లో మార్పులు వస్తున్నట్లే తెలంగాణలోనూ వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో గెలుపుతో తెలంగాణలోనూ ఆ పార్టీలో ఒకింత జోష్ పెరిగింది. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని ఆ పార్టీ నేతలు గొప్పగా ఫీల్ అవుతున్నారు. రాష్ట్రంలో అధికారం తథ్యమనే ధీమాతో ఉన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయం అని విశ్వసిస్తున్నారు.
తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. అలా చీలే ఓటు బీజేపీ, కాంగ్రెస్ వాటి బలానికి తగినట్లు పంచుకోగలిగినా బీఆర్ఎస్‌కు వచ్చే నష్టమేమీ లేదనే ధీమా గులాబీ నేతల్లో వ్యక్తమవుతున్నది. ఎంత ఎక్కువగా చీలిపోతే అంతగా బీఆర్ఎస్ పటిష్టంగా ఉంటుందని అనుకుంటున్నారు. అదే సమయంలో చీలికను నివారించడానికి వైఎస్సార్టీపీ, సీపీఐ లాంటి పార్టీల సహకారంపై కసరత్తు మొదలైంది. మున్ముందు పార్టీలు, నేతలు ఈక్వేషన్లు మారడం అనివార్యం. ఎన్నికలు, టికెట్లు, ఓట్లు, సీట్లు, అధికారమే పార్టీలకు, నేతలకు కావాల్సింది.
కొసమెరుపు
సిద్ధాంతం, నీతి, నిజాయితీ, నైతికత.. ఇవన్నీ వారి దృష్టిలో వేస్ట్. ఎక్కడ పొలిటికల్ ఫ్యూచర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడమే వారికి తెలిసిన సూత్రం. ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతను తమవైపు తిప్పుకోడానికి, వారిని సంతృప్తిపరచడానికి దేన్ని ప్రయోగించాలో వారికి వెన్నతో పెట్టిన విద్య. రానున్న రోజుల్లో మద్యం ఏరులై పారక తప్పదు. బిర్యానీ పొట్లాలకు భారీ డిమాండ్ తథ్యం. పరుపుల కింద, మాళిగల్లో దాక్కున్న కరెన్సీ నోట్లు చేతులు మారడం సహజం. పార్టీల, నేతల ఎత్తుగడలు, ఆలోచనలు, అంతుచిక్కని కార్యాచరణదే పైచేయి.
-ఎన్. విశ్వనాథ్
99714 82403
Also Read: బిగ్ న్యూస్: డైలామాలో KCR.. కర్ణాటక రిజల్ట్స్‌తో టికెట్ల కేటాయింపుపై గులాబీ బాస్ మల్లగుల్లాలు!