స్వలింగ సంపర్కం...మానసిక వ్యాధా, నేరమా?

by Ravi |   ( Updated:2023-10-24 04:15:51.0  )
స్వలింగ సంపర్కం...మానసిక వ్యాధా, నేరమా?
X

స్వలింగ సంపర్కం అంటే ఒకే లింగానికి చెందిన వారి మధ్య ఉండే లైంగిక సంబంధం. దీన్ని సృష్టి విరుద్ధమని అందరూ భావిస్తారు. కానీ, ఇది సృష్టికి విరుద్ధమేమీ కాదని, ప్రాకృతికమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. వైద్య శాస్త్రం ప్రకారం కూడా స్వలింగ సంపర్కం ఒక మానసిక వ్యాధో, లేక జన్యుపరమైన లోపమో కాదని, లైంగికతలో ఒక భిన్నమైన కోణంగా దీనిని పరిగణించాలని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్, అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్, అమెరికన్ అకాడమీ పీడియాట్రిక్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు నిర్ధారించాయి. ఇటీవల ఇండియన్ సైకియాట్రి సొసైటీ కూడా దీన్ని ఆమోదించింది. స్త్రీ పురుష లైంగికత ఏకైకం కాదని, ఒకానొక పద్ధతి మాత్రమేనని, ఇతర లైంగికతలు కూడా ప్రాకృతిమైనవేననే సృహ క్రమంగా పెరుగుతున్నది.

భారత్‌లో 10-12 కోట్లకు పైగా..

ప్రపంచ జనాభా దాదాపు 800 కోట్లు. ప్రపంచవ్యాప్త LGBTQ జనాభా అంచనా ప్రకారం ప్రపంచంలోని దాదాపు ఎనిమిది నుంచి పది శాతం మంది స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులు లేదా పాన్ సెక్సువల్ గా గుర్తించారు. ఇటీవలి జనాభా గణనలో US లో దాదాపు 5% జనాభాను lgbt గా గుర్తించారు. బ్రిటన్‌లో ఇది 4%కి దగ్గరగా ఉంది. బహుళజాతి పరిశోధనా సంస్థ Ipsos LGBT+ ప్రైడ్ 2021 గ్లోబల్ సర్వేలో భాగంగా స్వలింగ సంపర్కంపై భారతదేశంలో 23 ఏప్రిల్ నుంచి మే 7, 2021 మధ్య ఒక ఆన్‌లైన్ సర్వేను నిర్వహించి ఆ తర్వాత సమగ్ర నివేదికను విడుదల చేసింది. భారతీయ జనాభాలో 3% మంది స్వలింగ సంపర్కులుగా (గే, లెస్బియన్‌లతో సహా ), 9% మంది ద్విలింగ సంపర్కులుగా , 1% మంది పాన్ సెక్సువల్‌గా, 2% మంది అలైంగికులుగా గుర్తించారని నివేదిక చూపుతోంది.

స్వలింగ సంపర్కం - భారతీయ చట్టం

భారతదేశంలో స్వలింగ సంపర్కుల చట్టబద్ధతను గురించి మాట్లాడాలంటే, భారత నేరస్మృతిలోని సెక్షన్ 377 గురించి ముందు చర్చించాలి. ఐపిసీ 377 సెక్షన్‌కి 149 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిటీష్‌ పాలకుడు లార్డ్‌ మెకాలే 1860వ సంవత్సరంలో స్వలింగ సంపర్కానికి సంబంధించిన 377 సెక్షన్‌ను భారత శిక్ష్మా స్మృతిలో ప్రవేశపెట్టగా 1861లో అమలులోకి వచ్చింది. అప్పుడు ఈ సెక్షన్‌ ప్రకారం ‘ఎవరైనా ప్రకృతి ఆదేశాలకు విరుద్ధంగా స్వచ్ఛందంగా ఒక పురుషుడితో కాని, మహిళ లేదా జంతువులతో కానీ భౌతికంగా సంభోగిస్తే జీవిత కాల శిక్షార్హులు. ఈ శిక్షను మరో పదేళ్ల పాటు పొడిగించే అవకాశంతో పాటు జరిమానా విధించవచ్చని పొందుపరిచారు. ‘పురుష మైథున వ్యతిరేక చట్టం’గా వ్యవహరిస్తున్న ఈ 377 సెక్షన్‌ను 1935లో సవరించారు. దాని పరిధిని విస్తరించారు. అంగచూషణ లేదా ఓరల్‌ సెక్స్‌ను కూడ అందులో చేర్చారు. అయితే కాలక్రమంలో వస్తున్న మార్పులకనుగుణంగా 377వ సెక్షన్‌లో స్వలింగ లైంగిక సంపర్కాన్ని కూడా చేర్చారు. 2013లో సుప్రీంకోర్టు ప్రకృతికి విరుద్ధమైన లైంగిక చర్య'ను నేరపూరితంగా పేర్కొంటూ సెక్షన్ 377ను తిరిగి భారతీయ నేరస్మృతిలో చేర్చింది. 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు ఇది గోప్యతకు సంబంధించిన ముఖ్యమైన అంశం అని, లైంగిక ధోరణి ఆధారంగా వివక్షను ప్రదర్శించడం వ్యక్తిగత గౌరవానికి భంగకరమని కూడ తప్పుబట్టింది. గడిచిన మంగళవారం నాడు భారత అత్యున్నత న్యాయస్థానం కూడా స్వలింగసంపర్కంకు, చట్టబద్ధత లేకపోయినా, విభిన్న లైంగికత కలిగినవారు. తాము కోరుకున్న వ్యక్తితో ఉండడానికి, సహజీవనం చేయడానికి ఏ అవరోధమూ ఉండబోదని, వ్యక్తులుగా వారికి ఉండే ప్రాథమిక హక్కులకు చట్టం రక్షణ ఇస్తుందని పేర్కొంది. అయితే జంటలుగా హక్కులు కావాలంటే మాత్రం దానికి శాసన నిర్మాణం కావాలని సూచించింది. పైగా, స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకోవడానికి కూడా ఆమోదం చెప్పలేదు.. విభిన్న లైంగికతలు కలిగిన జంటల సమస్యల మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ విచారణల సందర్భంగా అంగీకరించింది...

మనో శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్...

మనోవైజ్ఞానిక శాస్త్ర పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ 1935 లోనే ‘స్వలింగ సంపర్కం ఒక దుర్వ్యసనం కాదు. అదేదో తప్పుడుపని అయినట్లు దాని గురించి సిగ్గుపడాల్సింది ఏమీలేదని. స్వలింగ సంపర్కాన్ని శిక్షించడం మహా అన్యాయం, క్రూరత్వం అని కూడా అన్నాడు. స్వలింగ సంపర్కం మానవ హక్కులకు భంగం కలిగించేదేమీ కాదు. అలాంటప్పుడు అది చట్టవిరుద్ధం ఎందుకవుతుంది మానవ హక్కులకు పాశ్చాత్యం లేదా ప్రాచ్యం అప్రాచ్యం అంటూ తేడా ఏమీ ఉండదు. మానవ హక్కులకు విఘాతం కలిగించే ఏ చట్టమైనా అన్యాయమైనదే. వాత్సాయనుడి కాలం నాటికే మనదేశంలో ఈ స్వలింగ సంపర్కం ఉంది. పూర్వం ఏనాడో దేవాలయాల గోడల మీద చెక్కిన అసంఖ్యాక స్త్రీ పురుష సంభోగ శిల్పాలు స్వలింగ సంపర్కం నేరంకాదని చెబుతున్నాయి. హిందూ దేశం చాలా స్వేచ్ఛాయుత దేశం. పుత్రకామేష్ఠి, పుండరీక లాంటి యజ్ఞాలూ, యాగాలూ కూడా జరిగాయి. హిజ్రాల దేవత ముర్గీ మాత ఆలయం గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని బెచర్జీ పట్టణంలో ఉంది. భారతీయ మానసిక వైద్యుల సంఘం కూడా స్వలింగ సంపర్కాన్ని ఒక వ్యాధిగా పరిగణించలేదు. స్వలింగ సంపర్కులుగా ఉండడం అనేది వ్యాధి కాదని చాలా మంది సైకియాట్రిస్టులు విశ్వసిస్తున్నారు. అయితే అలా అంగీకరించని సైకియాట్రిస్ట్‌లు కూడ కొంత మంది ఉన్నారు. దానిని అంగీకరించడానికి వాళ్ళకి కొంత సమయం పడుతుందని గతంలో ఐపీఎస్‌కు నేతృత్వం వహించిన డాక్టర్ అజిత్ భిడే తెలిపారు. మెజారిటీ సైకియాట్రిస్టులు స్వలింగ సంపర్కాన్ని అంగీకరిస్తుండగా, ఇతర విభాగాల వైద్యసమాజం కూడ ఈ విషయంపై అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది...

కట్టుబాట్లు ఎందుకు?

బలాత్కారం లేని స్వచ్ఛంద స్వలింగ సంపర్కం కూడా సహజీవనం లాగానే నేరం కాదు, పాపమూ కాదు. ఇది కీలకమైన సామాజికాంశం అని అభ్యుదయ వాదులు ప్రభుత్వాలను, కోర్టులను ప్రశ్నిస్తున్నారు, మనుషులు జంతువులకు భిన్నంగా ఇలా వుండాలి అనే కట్టుబాటు ఉంది. స్వలింగ సంపర్కాన్నే నేరంగా భావించాలా లేక స్వలింగ వివాహాన్ని కూడానా? బహుభార్యత్వం, సహజీవనం, వ్యభిచారం, ఐచ్చిక శృంగారం పేరేదైతేనేం జరిగేది సంభోగమే. అయితే ఆ సంభోగమైనా, సహజీవనమైనా పరపీడనలేని పద్ధతిలో మాత్రమే జరగాలి.

నవీన కాలపు వైద్యులు వ్యభిచారం, అత్యాచారాలకు పాల్పడే దానికంటే హస్తప్రయోగమే మంచిదని సలహాలిస్తున్నారు. అత్యాచారాలను ఆపటం కోసం హస్తప్రయోగాలను ప్రోత్సహిస్తున్నారు. వాత్సాయన కాలం నుండి నేటి వరకు ఏ సమాజం కానీ, చట్టాలు కానీ, శృంగారం దంపతుల మధ్యనే వుండాలని పరిమితులు విధించలేదు. పరపరాగ సంపర్కాన్ని అరికట్టనూ లేదు. శృంగారం ఇరువురు వ్యక్తుల మధ్య అభీష్టానుసారం జరిగితే అభ్యంతరకరం కానవసరం లేదు. సామాజిక కట్టుబాట్లు ఎన్నోపెట్టినా వ్యభిచారం ఆగలేదు. వ్యభిచారం వేరు, అత్యాచారం వేరు. ఐచ్చిక శృంగారం వేరు. పురాణ ఇతిహాస కాలం నుండి నేటి చట్టాల వరకు వాటిలో ఐచ్ఛిక శృంగారానికి అభ్యంతరాలు లేవు. ఎన్నో ప్రాచీన చట్టాలను మారుతున్న కాలానికనుగుణంగా ఎన్నోసార్లు మార్చుకున్నాం. కాలంతో పాటు చట్టాలను మార్చకపోవడంతో కొన్ని ప్రాచీన చట్టాలు అలాగే ఉండిపోయాయి. వాటిని సవరించాలి, సంస్కరించాలి. ఇద్దరు మగవాళ్ళుగానీ, ఇద్దరు మహిళలు గానీ కలిసి కాపురం చేస్తే అది కేవలం శారీరక సంభోగం కోసమే కానక్కరలేదు. పెళ్ళి చేసుకునో, చేసుకోకుండానో ఒక స్త్రీ పురుషుడు కలిసి కాపురం చేస్తే దానిని సక్రమ సహజీవనం అంటున్నారు. పెళ్ళి కాకుండా చేసే సహజీవనం అసహజమైనది కాదు, అది నేరమూ, పాపమూ కానప్పుడు స్వలింగ సంపర్కం లేదా స్వలింగ వివాహం నేరమెలా అవుతుంది? స్వలింగ సంపర్కం రోగమైతే వైద్యం చేసి నయం చేయాలి. నేరమైతే కోర్టుద్వారా శిక్షించాలి. రోగికైనా, ఖైదీకైనా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్ని మాత్రం ప్రసాదించాలి. వాటిని కాలరాయకూడదని అభ్యుదయ వాదులు కోరుతున్నారు.

మేమూ మనుషులమే....

మేమూ మనుషులమే....మాకూ మనోభావాలుంటాయి. మమ్మల్ని తక్కువగాఎందుకు చూస్తారు' అంటూ స్వలింగ సంపర్కులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అశోక్ రావు కవి, విక్రమ్ సేఠ్ లాంటి వాళ్లు తాము 'గే' అనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించుకున్నారు. ఇద్దరు మగవాళ్లు లేదా ఇద్దరు ఆడవాళ్లు ఇష్టపూర్వకంగా శృంగార సంబంధంలో ఉంటే దాన్ని నేరం కాదని .వాస్తవానికి స్వలింగ సంపర్కం అనేది మానసికపరమైన వైరుధ్యమే తప్ప అదో వ్యాధి గానీ, నేరం గానీ కాదని, మనిషి లైంగిక ప్రక్రియలో అది మరో కోణం మాత్రమేనని మానసిక వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. పరస్పరం అంగీకారంతో వయోజనులు పాల్గొనే స్వలింగ సంపర్కం చాలా దేశాల్లో చట్టబద్ధమే. కాని మన దేశంలో మాత్రం స్వలింగ సంపర్కాన్ని నేరమని భారతీయ శిక్షా స్మృతిలోని ఐపిసి 377వ సెక్షన్‌ పేర్కొనడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుంది. మనుషులంతా సమానమే అన్న భావనకు ఇది వ్యతిరేకం. స్వలింగ సంపర్కం నైతిక విరుద్ధమని, రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులకు విరుద్ధమని పేర్కొంటూ నేరస్థులుగా చిత్రీకరించడం అన్యాయమని, తమ గుర్తింపు కోసం తాము పోరాడుతున్నామే తప్ప, తమ మధ్య వివాహాలు తమకు అంతిమ లక్ష్యం కానే కాదని ఎల్‌జీబీటీక్యూఐ కార్యకర్తలు చెబుతున్నారు. కేవలం భిన్నంగా ఉన్నంత మాత్రాన మేము ఎవరికి చెందిన వారు కాదనడం ఎంత మాత్రం భావ్యం కాదని ఎల్‌జీబీటీక్యూఐ వాదిస్తోంది.

లోతైన శాస్త్రీయ చర్చ జరగాల్సిందే...

స్త్రీ పురుషుల మధ్య మాత్రమే దాంపత్య లైంగిక సంబంధాలను సహజమైనవిగా, ఆమోదనీయమైనవిగా పరిగణించడం ప్రపంచ వ్యాప్తంగా అనేక సమాజాలలో సంస్కృతులలో ఉన్నది. స్త్రీ పురుష ద్వంద్వం చుట్టూనే మన సామాజిక విలువలు అనాదిగా పరిభ్రమిస్తున్నాయి. స్వలింగ సంపర్కం అనేది మన దేశంలోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలకు విరుద్ధమని వివిధ సంస్థలు కోర్టులో వాదించాయి. భాగస్వాములుగా కలిసి జీవించడం, స్వలింగ వ్యక్తులతో లైంగిక సంబంధం కలిగి ఉండటం నేరంగా పరిగణించాలని ఇది భారతీయ కుటుంబ యూనిట్ -- భర్త, భార్య, పిల్లలతో పోల్చదగినది కాదని, స్వలింగ వివాహం సామాజిక నైతికతకు, భారతీయ తత్వానికి అనుగుణంగా లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది. వివాహం అనే భావన తప్పనిసరిగా, అనివార్యంగా వ్యతిరేకలింగానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య కలయికను సూచిస్తుంది. ఈ నిర్వచనం సామాజికంగా, సాంస్కృతికంగా, చట్టబద్ధంగా వివాహ సంబంధిత ఆలోచనలో భావనలో పాతుకుపోయింది.

సృష్టి మనుగడ కోసం, మానవ మనుగడ, పురోగతి కోసం కచ్చితంగా మానవ పునరుత్పత్తి జరిగి తీరాల్సిందే, స్వలింగ సంపర్కం, స్వలింగ వివాహాల వల్ల పునరుత్పత్తి, మానవజాతి మనుగడకై పునరుత్పత్తి జరిగే అవకాశం లేనప్పుడు, అలాంటి స్వలింగ సంపర్కాలు- స్వలింగ వివాహాలు సృష్టిలో ఎంతవరకు అవసరమో ప్రభుత్వాలు, అభ్యుదయవాదులు కూడ ఆలోచించాలి. వ్యక్తిగత పరిధిలో స్వలింగ సంపర్కులుగా ఉండడం వరకు ఫర్వాలేదు. కానీ అలాంటి లైంగిక భావాలను బయట ప్రదర్శించడానికి ప్రయత్నించినపుడు చట్టం దాన్ని కచ్చితంగా నేరపూరితంగా భావించాల్సిందే. లైంగిక సంపర్కం కోసం పశువులా బలాత్కరించడాన్ని నేరంగా పరిగణించాలి. బలాత్కరించడమంటే వ్యక్తి స్వేఛ్చకు భంగం కలిగించడమే. సామాజిక జీవన వ్యవస్థలో మార్పులకు అనుగుణంగానే చట్టాలలో కూడా నైతికతను పటిష్ఠపరుచుకోవాలి. స్వలింగ వివాహం అనేది అన్ని మత సమూహాల విశ్వాసాలు, పవిత్ర గ్రంథాలు, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్న ఈ వేళ మరింత లోతైన శాస్త్రీయ చర్చ జరిగేంతవరకు యధాతథ స్థితిని కొనసాగించడమే శ్రేయస్కరం.

డా. బి. కేశవులు నేత. ఎండీ. సైకియాట్రీ,

విశ్రాంత సహాయ ఆచార్యులు, ఎర్రగడ్డ

85010 61659

Advertisement

Next Story