హంగులు దిద్దితే సరిపోతుందా?

by Ravi |   ( Updated:2023-07-16 00:15:48.0  )
హంగులు దిద్దితే సరిపోతుందా?
X

తంలో ఏదైనా పాఠశాలలో విద్యార్థి దగ్గరికి వెళ్లి పెద్దయ్యాక నువ్వు ఏమవుతావని అడిగితే, డాక్టర్, ఇంజినీర్, కలెక్టర్ అని సమాధానం చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఈ రోజుల్లో మారుమూల గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి అడిగినా, నేను కంపెనీ పెడతా, ఎథికల్ హ్యాకర్ అవుతా అంటూ ఈ తరానికి తగ్గ సమాధానాలు ఇస్తున్నారు. వారిలో ఇలాంటి మార్పు రావడం నిజంగా హర్షనీయం. కానీ ఈ మార్పుకు కారణం పాఠశాలలో పాఠాలు కాకుండా బయటి నుండి, ఇంటర్నెట్ నుండి వాళ్లు నేర్చుకున్న జ్ఞానం తోడు అవుతుండటం విచారకరం. ఎందుకంటే, బయటి ప్రపంచంలో, ఇంటర్నెట్‌లో అన్ని రకాల సమాచారాలు దొరుకుతాయి. కానీ వాటిలో చెడు ఏది, మంచి ఏది అని గుర్తించే తెలివితేటలు చాలా తక్కువ మందికి ఉంటాయి. మంచిని గ్రహించగలిగితే అది అదృష్టమే, కానీ చెడు దారి పడితే మాత్రం భవిష్యత్తు నాశనమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మరి మంచిని గుర్తించగల తెలివితేటలు నేర్పించే కరిక్యులమ్ మన పాఠశాలల్లో ఉందా?

కరిక్యులమ్‌లో ఇవి ఉంటే.. సాధ్యం!

ముఖ్యమంత్రి కేసీఆర్ మనమడు హిమాన్షు తన పాఠశాలలో అమలు చేస్తోన్న కరిక్యులమ్‌లో భాగంగా వారంలో ఒకరోజున కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలకు వచ్చాడు. అక్కడి అవస్థాపన సౌకర్యాలు చూసి మనసు చలించి, దాదాపు రూ. కోటి విరాళాలు సేకరించి, ఆ పాఠశాల హంగులు మార్చేశాడు. హిమాన్షు పాఠశాలలో కమ్యూనిటీ సర్వీస్ అనే అంశం కరిక్యులమ్‌లో లేకపోయి ఉంటే, ఇదంతా సాధ్యమయ్యేదా? అది కేసీఆర్ మనమడు చేశారా లేదా వేరే సెలబ్రిటీ పిల్లలు చేశారా అనేది వేరే విషయం. ముందు అలాంటి ఆలోచన రావాలంటే, చదువుకునే పాఠశాలలో అలాంటి విషయాలు నేర్పించే కరిక్యులమ్ అమలు చేయాలి కదా? అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే... కేవలం బాహ్యపు హంగులు మార్చితే సరిపోదు, అంతర్గతంగా పిల్లలకు నేర్పించే ధోరణులు, సదుపాయాలు కూడా మార్చాలి. పాఠశాలకు చేసిన హంగులు కొన్నేళ్లకు మారిపోతాయి, కానీ పిల్లలు నేర్చుకున్న విషయాలు ప్రపంచాన్ని ఒక మలుపు తిప్పుతాయి. ఉన్నపళంగా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల హంగులు మార్చడం కష్టమే కానీ కరిక్యులమ్‌లో అంటే నేర్పించే విధానం, ఎక్‌స్ట్రా యాక్టివిటీలు, డిజిటల్ లెర్నింగ్ లాంటి వాటిలో మార్పులు తీసుకురావడం తక్కువ సమయంలోనే సాధ్యమవుతుంది.

జనరేషన్‌కు తగినట్లుగా.. నేర్పాలి

ప్రస్తుతం రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లో కూడా డిజిటల్ డిస్‌ప్లే టీవీల లాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని సమర్థవంతంగా ఉపయోగించే వాళ్ల కొరతే ఎక్కువగా ఉంది. ఉపాధ్యాయులు వాటిని ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ పూర్తి స్థాయి రిసోర్స్‌లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. డిస్‌ప్లే బోర్డుల మీద పాఠాలు చెప్పాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లు సిద్ధం చేయాలి. పుస్తకాల్లో సిలబస్ ఆధారంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లను కూడా నిపుణులతో తయారు చేయించి అందించగలిగితే ఈ డిజిటల్ బోర్డులను బాగా వినియోగించుకోవచ్చు. అలాగే వీలైనన్ని ఎక్కువసార్లు సబ్జెక్ట్‌ను రివిజన్ చేస్తూ, ఒక్కో అంశాన్ని భిన్న కోణంలో చూసే అవకాశం కూడా కలుగుతుంది. తద్వారా తమ చుట్టూ ఉన్న పరిస్థితులను, పుస్తకంలోని పాఠాలతో విద్యార్థులు అన్వయించుకోగలుగుతారు.

ఉన్నతి కార్యక్రమం, నెలలో నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’ లాంటి వాటితో పాటు క్విజ్ ప్రోగ్రామ్‌లు, పోస్టర్ ప్రజెంటేషన్‌లు నిర్వహిస్తున్నా.. వాటిపై ఎక్కువ శాతం పట్టణాల్లో చదివే పిల్లలు మాత్రమే దృష్టి సారించగలుగుతున్నారు. గ్రామాల్లో చదువుతున్న పిల్లల్లో ఒకరిద్దరూ పార్టిసిపేట్ చేస్తున్నప్పటికీ పట్టణాల్లో చదివే పిల్లలతో పోటీ పడలేకపోతున్నారు. ఈ కారణంగా పూర్తి స్థాయిలో అవస్థాపనా సౌకర్యాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు రేటు తగ్గుతూ వస్తోంది. అలా కాకుండా బయటి ప్రపంచాన్ని వాళ్లకు పరిచయం చేయడానికి వీలైనన్ని రకాలుగా కరిక్యులమ్‌లో మార్పు చేస్తే, వారికి మంచీచెడూ తెలుసుకునే తెలివితేటలూ పెరుగుతాయి. అంతేకాకుండా నేటి జనరేషన్‌కు తగినట్లుగా నేర్పించే నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులకు శిక్షణ నివ్వడం, లేదా స్థానికంగా ఉన్న ఇప్పటికే వివిధ రంగాల్లో స్థిరపడిన వ్యక్తులతో గెస్ట్ లెక్చర్‌లు, యాక్టివిటీలు చేయించడం లాంటి పటిష్టమైన మార్పులను కరిక్యులమ్‌లో అమలు చేస్తే ఎంతో కొంత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి అభివృద్ధి అని గుర్తుంచుకోవాలి.

-ప్రగత్ దోమల

63001 05472

Advertisement

Next Story