ఇప్పుడేది బీసీ నినాదం?

by Ravi |   ( Updated:2024-03-21 00:46:07.0  )
ఇప్పుడేది బీసీ నినాదం?
X

దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సత్తా అంతంతమాత్రమే! అయితే బీజేపీని నమ్ముకుని క్యాడర్ పని చేస్తోంది. ఎంతో మంది ప్రముఖులు ఆ పార్టీలో భాగమై ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అంటూ బీజేపీ ముందుకు వచ్చింది. దాన్ని స్వాగతించాం. మరి, పార్లమెంట్ స్థానాల కోసం జరగబోయే ఎన్నికల్లో ఎంత మంది బీసీలకు అవకాశం ఇవ్వనుందో ఆ పార్టీ అధిష్టానమే చెప్పాలి.

తాను అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎంగా నియమిస్తామని ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రకటించింది. కులగణన జరగాలని డిమాండ్‌ ఒక వైపు, దేశంలో బీసీ జనాభా సంఖ్య 50 శాతం కంటే ఎక్కువుందని వినిపిస్తున్న మాటల మధ్య బీసీ నినాదం ఎత్తుకుంది బీజేపీ. మరోవైపున దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిరాకరిస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దేశమంతా కులగణన చేపడతామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటున్నారు. బీసీలకు రాజ్యాధికారం దక్కరాదనే ఆలోచనతోనే తెలంగాణలో బీఆర్ఎస్, జాతీయ స్థాయిలో బీజేపీ కులగణనను అడ్డుకుంటోందని కాంగ్రెస్ ఆరోపించింది.

వీరికి కేటాయించే సీట్లు ఎన్ని?

బీసీలకు పెద్దపీట వేసే పార్టీ తమదని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కంటే తామే ఎక్కువ టికెట్లు బీసీలకు కేటాయించామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ గొప్పగా చెప్పింది. బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించడమే ధ్యేయంగా బీజేపీ పనిచేస్తుందని బీజేపీ నేతలు ఆ సమయంలో అన్నారు. ఇప్పుడు మరోసారి బీజేపీకి బీసీ నేతల మీద ప్రేమ చూపించే సమయం వచ్చింది. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణలోని 17 సీట్లలో బీసీలకు ఎన్ని కేటాయిస్తారు? ఎస్సీ, ఎస్టీ 5 సీట్లు కేటాయిస్తే, 12 సీట్లలో పార్టీనే నమ్ముకున్న బీజేపీ బీసీ నేతలకు ఎలాంటి అవకాశం ఇవ్వబోతున్నారో చెప్పాల్సి ఉంటుంది. అనేక సంవత్సరాలుగా బీజేపీనీ ఆ పార్టీ సిద్ధాంతాలనూ నమ్ముకొని పనిచేస్తున్న యాదవులు, పద్మశాలి, ముదిరాజులు, ఇతర కులాల నాయకులకు ఇంతవరకు నేషనల్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా అవకాశం రాలేదు. ఇది చాలా బాధాకరం. దీనిపై బీజేపీ దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకా బీజేపీని నమ్ముకుంటే భవిష్యత్తు ఉంటుందా? అనే అనుమానాలు వారిలో రాకూడదు.

దక్షిణాది నేతలపై శీతకన్నా?

భారతీయ జనతా పార్టీ విధివిధానాలు చూసుకుంటే.. ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలకు చెందిన నాయకులకు ఇచ్చే ప్రాధాన్యత దక్షిణ రాష్ట్రాల నాయకులకు ఎందుకు ఇవ్వరు? సీట్లు గెలిపించనంత మాత్రాన దక్షిణాది రాష్ట్రాల నాయకులకు దక్కాల్సిన మర్యాదను ఇవ్వరా? దక్షిణాదిలో ఓబీసీలు ఇప్పటికే కాషాయ పార్టీకి దూరమయ్యారు. కర్ణాటకలో కాకుండా అధికారాన్ని కోల్పోయింది. పొత్తులతో కాకుండా దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలోనూ నిలదొక్కుకునే అవకాశమే లేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీనే నమ్ముకుని ఉన్న బీసీ నాయకులకు సీట్లు ఇస్తుందా? లేక డబ్బులను ఎరగా వేసే బడా బాబులకు అవకాశం ఇస్తుందా? అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ ఎంతో నమ్మకంగా చెబుతూ ఉంది. అలాంటిది బీసీ నేతలకు సముచిత స్థానం ఇవ్వగలదా? అని ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. త్వరలోనే ఆయా స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించే అవకాశం ఉండడంతో.. ఎంత మంది బీసీ నేతలకు టికెట్లను కేటాయిస్తుందో చూసి బీసీలుగా మా తదుపరి కార్యాచరణను ప్రకటిస్తాం. బీసీ నేతలకు బీజేపీలో అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరికే మాత్రం ఉండే ప్రసక్తే లేదు.

దుండ్ర కుమారస్వామి

జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు

99599 12341

Advertisement

Next Story

Most Viewed