ముందు కిరాణం.. లోన మందు పురాణం

by Ravi |   ( Updated:2023-01-21 18:30:33.0  )
ముందు కిరాణం.. లోన మందు పురాణం
X

దేశానికి పల్లెలు పట్టుగొమ్మల వంటివి. దేశ అభివృద్ధిలో వాటి భాగస్వామ్యం ఎనలేనిది. అలాంటి పచ్చని పల్లెల్లో నేడు బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉపాధి పేరిట కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసి అందులో విచ్చలవిడిగా అర్ధరాత్రి దాకా మద్యం విక్రయిస్తూ ముందు కిరాణం.. లోన మందు పురాణం నడిపిస్తున్నారు. ఇలా గ్రామాల్లోనే మందు దొరకడంతో దేశానికి వెన్నెముకైన యువత అత్యధికంగా దానికి బానిసవుతున్నారు. గ్రామంలో మందు ఎప్పుడూ అందుబాటులో ఉండడంతో రాత్రి, పగలు తేడా లేకుండా తాగేసి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. విపరీత సేవనం వలన కొన్ని కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నాయి. తాగి బండి నడపడం వలన ప్రమాదాల్లో గాయపడి, మరణించి తల్లిదండ్రులకు శోకం మిగులుస్తున్నారు.

నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపుతామన్న తెలంగాణ ప్రభుత్వం.. పల్లెల్లో బెల్ట్ షాపులను నిర్మూలించాలి. ఏపీలో వైన్ షాపులను ప్రభుత్వం నడుపుతుండటంతో గ్రామాల్లో బెల్ట్ షాపులు తగ్గినా అక్కడ దొరికే మందు లోకల్ బ్రాండ్లు కావడంతో తొందరగా ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. ఇటీవల ఒక కేంద్రమంత్రి తాగుడుకు బానిసైన తన కొడుకుకి ఆడపిల్లను ఇవ్వొద్దని ఆవేదన వ్యక్తం చేశాడంటే మందు ప్రభావం సమాజంలో ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే రెండు రాష్ట్రాల్లోని ప్రజలు బెల్ట్ షాపుల ఏర్పాటు, నిర్వహణను స్వచ్ఛందంగా విరమించుకోవాలి.

తలారి గణేష్

99480 26058

Advertisement

Next Story