- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామ నామాలు... గత చరిత్రకు ఆనవాళ్లు
గ్రామనామ విజ్ఞానానికి ఇప్పుడు ఎంతో ప్రాధాన్యత ఉంది. 'టొపోనమి' అని దీనిని ఆంగ్లంలో పిలుస్తారు. నామవిజ్ఞానశాస్త్రం (ఓనమాస్టిక్సు)లో ప్రధాన భాగమైన గ్రామనామ విజ్ఞానంపై నామవిజ్ఞానవేత్త వాండ్రంగి కొండలరావు రాసిన గ్రామనామాలు (ఆంధ్రప్రదేశ్) అన్న పుస్తకం ఎన్నో ఆసక్తికరమైన చారిత్రక, సాంస్కృతిక, సామాజిక జీవన అంశాలను వెల్లడించింది. ఒక రాష్ట్రాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఊరి పేర్ల నేపథ్యం గురించి లోతైన విశ్లేషణను ఇందులో అందించారు.
శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలంలో కామధేనువు అనే గ్రామం ఉంది. కామధేనువు అంటే కోరికలను తీర్చే పవిత్రమైన ఆవు అని అర్థం. ఆవుల పెంపకానికే అగ్ర ప్రాధాన్యతను ఇచ్చిన గ్రామం కనుక అక్కడి పురోహితుల సూచన మేరకు గ్రామానికి కామధేనువు అని పేరు పెట్టగా ఇప్పుడది గోమాతలకు నిలయమైన గ్రామంగా ప్రసిద్ధి పొందిందని రచయిత చక్కని వివరణ ఇచ్చారు.అనంతపురం జిల్లాలోని కాకి గ్రామానికి తొలుత కాంచన కిరీటం అని పెట్టారు. రత్నగిరి రాజులు తమ రాజ్యంలో పనిచేసే సైన్యానికి ప్రతిభా పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి కాంచన కిరీటాన్ని బహుమతిగా ఇచ్చేవారు. అలా ఆ గ్రామం పేరు జన వ్యవహారంలో సంక్షిప్తీకరించబడి కాకిగా స్థిరపడిపోయిందని తెలిపారు. నంద్యాల జిల్లాలోని మరొక గ్రామం భోజనం. ఆ ప్రాంతంలోని సంస్థానాధీశులు ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే సంప్రదాయాన్ని పాటించడం వల్ల ఆ గ్రామానికి భోజనం అనే పేరు వచ్చింది. కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామం తొలిపేరు సిరిమల్లె. ఆంగ్లేయుల హయాంలో ఇక్కడ రైతుల నుండి కప్పం (శిస్తు) వసూలు చేసేవారు. వసూలైన మానాలు రాళ్ళ కుప్పల మాదిరిగా పోసి బహిరంగంగా ఉంచడం వల్ల ఈ గ్రామానికి కప్పట్రాళ్ల అనే పేరు స్థిరపడిపోయిందని చెప్పారు.
ఊర్ల చరిత్ర ప్రాంత చరిత్రలో భాగం
కడప జిల్లా పొద్దుటూరు మండలం దొరసాని వారిపల్లె పేరు 1880 - 89 కాలంలో ఒక బ్రిటీషు మహిళాధికారిణి అందించిన ప్రజాసేవకు గుర్తింపుగా వచ్చింది. అన్నమయ్య జిల్లా పి.టి సముద్రం మండలంలోని మల్లెల పల్లె పేరు, ఆ గ్రామంలో ప్రతి ఇంటి పెరటిలో ప్రజలు మల్లెలు పండించడం వల్ల వచ్చింది.చిత్తూరు జిల్లాలోని మండల కేంద్రం పాల సముద్రం. ఆ గ్రామంలో పాడి పరిశ్రమ తులతూగడం వల్ల ఆ పేరు వచ్చింది. బాపట్ల జిల్లాలోని స్టువర్టుపురంలో చోరీలను కట్టడి చేసి సంస్కరణలను తెచ్చేందుకు కృషి చేసిన ఆంగ్లేయ దొర స్టువర్ట్ పేరుని ఆ గ్రామానికి పెట్టారు. అనంతపురం జిల్లా గలగల గ్రామంలో గాజుల తయారీ దారులు ఎక్కువగా ఉండేవారు. గాజుల గలగల శబ్దమే ఆ గ్రామం పేరుగా నిలబడింది. తిరుపతి జిల్లాలో కుక్కలపల్లి అనే గ్రామం ఉంది. ఆ బ్రిటీషు పాలనలో తెల్లదొరలు ఈ గ్రామానికి రావడంతో సామూహికంగా కుక్కలు వారిని వెంబడించాయని ఆ తరువాత జన వ్యవహారంలో అది కుక్కలపల్లిగా మారిపోయిందని వివరించారు. కృష్ణా జిల్లా వానపాముల గ్రామం పేరు వానమాను అని ఇంటి పేరు గల నాయీబ్రాహ్మణుడు కుటుంబంతో వచ్చి గ్రామాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టినందున అతనికి గుర్తింపుగా ఉండేలా గ్రామానికి వానపాముల అని నామకరణం చేశారు.
యజ్ఞంలా నామ విజ్ఞాన శోధన
ఒకే పదంతో ఉన్న గ్రామాలు, రెండు, మూడు, నాలుగు, ఆరు పదాలతో ఉన్న గ్రామాల చరిత్రను లోతుగా విశదీకరించారు. వ్యక్తులు, వృక్షాలు, జంతువులు, మృగాలు, వృత్తులు, సామాజిక వర్గాలు, గ్రామ దేవతలు, పండుగలు, పబ్బాలు, కొండలు, కోటలు, కొలనులు, పంటలు, కాలువలు, ఇంటి పేర్లు కలిసొచ్చే విధంగా ఉన్న గ్రామాలను కూడా సోదాహరణంగా తెలిపారు. వివిధ గ్రామాల పేర్లతో ఉత్తరపదంగా ఊరు, వాడ, వరాలు, పాడు, ఖండ్రీగలు, పుట్టుగ, పల్లి, వీడు, నగరం, పాలెం, పర్రు, పర్తి, పట్నం మొదలైనవన్నీ చేరుతాయని చెప్పారు. వ్యక్తి పుట్టినప్పటి నుండి అంతిమ శ్వాస వదిలే వరకు ఊరితో విడదీయరాని గొప్ప అనుబంధం ఉంటుంది. నామ విజ్ఞానాన్ని యజ్ఞంగా భావించి ఎంతో శ్రమతో సమాచారాన్ని జాగ్రత్తగా సేకరించి, ప్రామాణికంగా సరిదిద్ది, సరైన అనుక్రమణికతో కూడిన ఈ పరిశోధనాత్మక గ్రంథాన్ని రచయిత అందరూ చదివి అర్థం చేసుకొనే విధంగా సరళమైన, స్పష్టతతో కూడిన భాషతో రచయిత రూపొందించారు.
ప్రతులకు
గ్రామ నామాలు (ఆంధ్రప్రదేశ్)
వాండ్రంగి కొండలరావు
పుటలు: 216 – వెల: రూ. 200
ప్రతులకు : 9490528730
సమీక్షకులు
డా. తిరునగరి శ్రీనివాస్,
94414 64764
- Tags
- Grama Namalu