ప్రైవేటు వ్యక్తిని గెలిపించిన ప్రభుత్వ ఉద్యోగులు

by Ravi |   ( Updated:2023-03-28 00:46:04.0  )
ప్రైవేటు వ్యక్తిని గెలిపించిన ప్రభుత్వ ఉద్యోగులు
X

రాష్ట్రంలో జరిగిన ఉపాధ్యాయ మండలి ఎన్నికల ఫలితం ఉపాధ్యాయుల్లోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫలితమిచ్చిన ఉపాధ్యాయులను ఎలా అర్థం చేసుకోవాలో తెలీక రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఫలితాన్ని ఉపాధ్యాయులు తమ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి హెచ్చరిక పంపారని భావించాలా? లేదా సొంత పైరవీలకు ప్రాధాన్యతనిచ్చే వారికి సరైన గుణపాఠం చెప్పారని అర్థం చేసుకోవాలా? లేదా తమ అసంతృప్తిని ఓటు ద్వారా ఉపయోగించి సమాజానికి ఆదర్శంగా నిలిచారని భావించాలా?

ఓటమికి కారణాలు..

రాజ్యాంగ నిర్మాతలు దూరదృష్టితో ఆలోచించి వారి జ్ఞానాన్ని, అనుభవాల్ని ఉపయోగించుకోవడానికి ఉపాధ్యాయ లోకానికి మండలిలో అవకాశమిచ్చారు. అయితే గతంలో జరిగిన మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎన్నికల్లో మూడుసార్లు ప్రభుత్వ ఉపాధ్యాయుడికే పట్టం కట్టారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికలో ఒక ప్రయివేటు పాఠశాల అధిపతికి పట్టం కట్టారు ఉపాధ్యాయులు. ఇలా ఎందుకు జరిగిందనే కారణాలు విశ్లేషిస్తే స్వయం తప్పిదాల వల్ల ఓ ఉపాధ్యాయ సంఘం వల్ల ఈ ఓటమి మూటగట్టుకుందని చెప్పవచ్చు. ఆ సంఘం మాటలతో కాలయాపన చేయడంతో సొంత సంఘం సభ్యులే చివరి నిమిషంలో చేయిచ్చారు. అదేకాకుండా జీఓ 317 ను వ్యతిరేకించకపోగా, ఆ జీఓ బాగుందని ఆ సంఘం గోడమీద పిల్లి వాటం ప్రదర్శించడం, సీపీఎస్ రద్దుపై నేలవిడిచి సాము చేయడం, ఏకీకృత సర్వీస్ రూల్స్ పత్తా లేకపోవడం, పీఆర్సీ, ఏరియర్స్ విషయంలో, పెండింగ్ డీఏ, సకాలంలో రాని జీతాలపై స్పందించకపోవడం, ఈ- కుబేర్‌లో పెండింగ్ బిల్లులు, జీపీఎఫ్ పెండింగ్ బిల్లులు, మెడికల్ రీయంబర్స్‌మెంట్ బిల్లుల విషయంలో సరిగా స్పందించకపోవడంతో ఉపాధ్యాయులలో అసంత‌‌ృప్తి నెలకొంది. ఈ విషయం గమనించిన సంఘం అభ్యర్థిని మార్చినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సంఘం అందరికన్నా ముందే ప్రచారం ప్రారంభించినప్పటికీ, ఉపాధ్యాయులు అడిగిన ప్రశ్నలకు సంయమనంతో సమాధానాలు ఇవ్వకపోగా, ఎదురుదాడికి దిగిన సందర్భాలు అనేకం. అలాగే ఈ సంఘ అభ్యర్థి గతంలో... ఉపాధ్యాయులకు చివరి నిమిషంలో ఆశ చూపిస్తే వారే ఓటేస్తారులే అన్న వ్యాఖ్యలు వాట్సాప్‌లో వైరల్ కావడం, కేజీబీవీ ఉపాధ్యాయినిలకు, కాంట్రాక్ట్ లెక్చరర్స్‌కు ఆర్థికంగా ఆశ చూపించడం, ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయడం కూడా ఉపాధ్యాయ లోకాన్ని ఆలోచింపజేసింది. అలాగే 54 సోదర ఉపాధ్యాయ సంఘాల మద్దతు చివరి నిమిషంలో కూడగట్టుకోలేక పోవడం, ప్రభుత్వ మద్దతు సంపాదించుకోలేకపోవడం వంటి కారణాల వల్ల ఈ సారి ఆ సంఘ అభ్యర్థి ఓటమి చవి చూడటానికి కారణాలుగా చెప్పవచ్చు.

గుణపాఠం చెప్పేందుకేనా?

అయితే, గతంలో ఈ సంఘం తరఫున ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తికి నమ్మకంతో రెండుసార్లు అవకాశం ఇచ్చినప్పటికి ఆయన ఉపాధ్యాయుల ఆకాంక్షలను పట్టించుకోకపోవడం, ఉపాధ్యాయుల ప్రతినిధిగా కాకుండా రాజకీయ ప్రతినిధిగా వ్యవహరించడం వంటి కారణాలతో అభ్యర్థిని సంఘం మార్చింది. కానీ ఆ అభ్యర్థి మరో సంఘం తరఫున పోటీ చేసినా చిత్తుగా ఓడించారు. అయితే ఈ పోటీలో ఆ పోరాట సంఘం ఉన్నప్పటికీ, ఆ వ్యక్తి ప్రభావంతో అభ్యర్థిని మార్చినా, ఆ సంఘంపై ఉన్న అసంతృప్తిని ఉపాధ్యాయులు ఓటుతో సమాధానం చెప్పారని భావించవచ్చు. ఈ ఎన్నికలలో గెలిచిన అభ్యర్థికి సంఘం తక్కువ అయినప్పటికీ ఆర్థికంగా పరిపుష్టి కలిగి ఉండటంతో కొంత వరకు నెట్టుకొచ్చారని చెప్పవచ్చు. పైగా ఉపాధ్యాయుల అసంతృప్తి తోడై వారిని గెలుపు తీరాలకు చేర్చింది. అయితే ఈ అభ్యర్థికి మెజార్టీతో పాటు కౌంటింగ్ ప్రతి రౌండ్‌లోను అధిక్యత ప్రదర్శించడం ఆశ్చర్యకరం.

అయితే, ఉపాధ్యాయ లోకం ఇచ్చిన తీర్పుపై సమాజంలో, విశ్లేషకుల్లో, ఉపాధ్యాయ లోకంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగానే ఉపాధ్యాయ లోకం సరైన వ్యక్తిని గెలిపించిందా? ఉపాధ్యాయ సమస్యల పట్ల ఒక్కనాడంటే ఒక్కనాడు, ఒక్క మాటంటే ఒక్క మాట మాట్లాడని వ్యక్తిని ఎలా గెలిపించారు? ఈ ఫలితాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఉపాధ్యాయ లోకం ఆ అభ్యర్థి ఇచ్చే ఆర్థిక ప్రలోభాలకు ఆశపడి ఓట్లు వేశారా? లేక రాజీలేని పోరాటం చేస్తారని భావించారా? లేక ప్రభుత్వాన్ని ఎదిరించగల సరైన వ్యక్తిని గెలిపించారని భావించారా? లేక ఇప్పటివరకు ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి, ఆ సంఘానికి గుణపాఠం చెప్పాలని భావించారా? అలా భావిస్తే, ఉపాధ్యాయులుగా పనిచేసిన వ్యక్తులు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులను గెలిపించుకోవాల్సింది కానీ ఒక ప్రైవేట్ స్కూల్ అధిపతిని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు గెలిపించుకోవడం ఆశ్చర్యంగా ఉంది. అయితే ఈ ఎన్నికల ద్వారా, పైరవీలకే ప్రాధాన్యత ఇస్తున్న సంఘాలకు సరైన గుణపాఠం చెప్పాల్సిందే. ప్రస్తుతం గెలుపొందిన అభ్యర్థి ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీల అమలుకు కృషి చేయాలి. తనపై ఉన్న కార్పొరేట్ అధిపతి ముద్రను చెరిపివేస్తూ ఉపాధ్యాయుల పక్షపాతిగా గుర్తింపు పొందాలి. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది.

జుర్రు నారాయణ యాదవ్,

తెలంగాణ టీచర్స్ యూనియన్, జిల్లా అధ్యక్షులు,

94940 19270.

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story

Most Viewed