బడుల్లో ప్రయోగ విద్య మిథ్యేనా!?

by Ravi |   ( Updated:2023-06-26 23:45:56.0  )
బడుల్లో ప్రయోగ విద్య మిథ్యేనా!?
X

సైన్స్ ప్రగతికి మూలం.. మానవ జాతికి విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలే పట్టుగొమ్మలు.. విద్యార్థుల్లో సృజనాత్మకతకు పెద్దపీట వేసేలా ప్రయోగపూర్వక బోధనలు కావాలి.. సామాన్యుడిని సైతం అత్యున్నత స్థానాలకు చేర్చగలిగే సత్తా సైన్స్‌కుంది’. ఇలా ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, వక్తలు తరచూ సైన్స్‌ఫేర్‌లు, ఎగ్జిబిషన్లు, ఇతర వేదికల్లో ప్రయోగ విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రసంగిస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రయోగం ‘కళ’యే గానీ ప్రయోగ విద్య ‘కల’గా మిగిలిపోతున్నది.

ప్రయోగాలతోనే జ్ఞాన సముపార్జన

తరగతి గదిలో ఉపన్యాస పద్ధతి ద్వారా బోధించడం కన్నా, ప్రయోగాలు చేయడం ద్వారా విద్యార్థి త్వరగా నేర్చుకోవడంతో పాటు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటాడని మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు, సైంటిస్టులు సూచిస్తున్నారు అందుకనుగుణంగా, నూతనంగా రూపొందించబడిన పాఠ్యపుస్తకాలు ప్రయోగ విద్యకు పెద్దపీట వేస్తున్నాయి. కానీ చాలా పాఠశాలల్లో విద్యార్ధులు ప్రయోగాలు చేసేందుకు అనుగుణంగా ల్యాబ్‌లు అందుబాటులో లేవు. కొన్ని పాఠశాలల్లో సరిపడా రూములు లేకపోవడంతో సైన్సు సామాగ్రి అటకెక్కింది. అలాగే విజ్ఞానశాస్త్రంలో నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించాలనే ఆశయంతో సైన్స్‌పై ఆసక్తిని పెంచి బాల్యం నుంచే సృజనాత్మకతను వెలికితీసే ప్రయోగాల వైపు ఆకర్షించేందుకు హైస్కూల్ స్థాయిలో ప్రవేశపెట్టిన ‘ఇన్‌స్పైర్’, సైన్సు కాంగ్రెసు వంటి వినూత్న కార్యక్రమాలు కూడా నామమాత్రంగా కొనసాగుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. చాలా పాఠశాలలు ‘ఇన్‌స్పైర్’ నమోదుకు ఆసక్తి చూపడంలేదు. రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థ ఏటేటా రూపొందించే అకడమిక్ క్యాలెండర్‌లో సైతం 6 నుండి 10 తరగతుల విద్యార్థుల ప్రయోగాలకు వారంలో కేవలం ఒకే పీరియడ్ కేటాయించడం చూస్తే, కరికులంలో ప్రయోగ విద్యకున్న ప్రాముఖ్యత ఏమిటో అర్థమవుతుంది. కానీ ఇంటర్నల్ మార్కుల్లో ల్యాబ్ రికార్డులకు 5 మార్కులు కేటాయించడం విడ్డూరం.

ఆ ప్రాముఖ్యతను తెలియజేస్తూ..

ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో ఎప్పుడో 92 ఏళ్లక్రితం విజ్ఞాన శాస్త్రంలో సర్ సి.వి.రామన్ నోబెల్ బహుమతి సాధించారు. మళ్లీ ఇంతవరకు భారతావనిలో ఎవరూ దానిని సాధించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చిన్నచిన్న దేశాలు సైతం, నోబెల్ బహుమతి సాధించిన జాబితాలో ముందుటున్నాయి దీనికి కారణం అయాదేశాలు పాఠశాల స్థాయి నుంచి నాణ్యమైన విద్య, వ్యక్తుల్లోని నైపుణ్యాలను గుర్తించి సానపట్టే వ్యవస్థలు, విశ్వవిద్యాలయాల్లో మేథోమధనానికి సకల సదుపాయాలు ఇతోధిక నిధులతో ఆయా దేశాలు విజ్ఞానశాస్త్రంలో అద్వితీయంగా రాణిస్తున్నాయి. కానీ మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు. ఎంసెట్, నీట్‌ ర్యాంకులే జీవితం.. అనే భ్రమలో పరుగులెడుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు సైన్సు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆ రంగంలో ఉన్న అవకాశాలను వారికి తెలియజెప్పాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎంచుకున్న రంగంవైపు ప్రోత్సహించాలి.. అంతేకాని మార్కులు, ర్యాంకులు అంటూ వారిపై ఒత్తిడి తీసుకురావడంతో పిల్లలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. పరిశోధనలకు నిధులు కేటాయించడంలో భారత్ ప్రపంచం మొత్తం మీద అట్టడుగు స్థానంలో ఉంది. జీడీపీలో పరిశోధనలకు అధిక నిధులు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవో కొన్ని పాఠశాలలలో అటల్ ల్యాబ్‌ల పేరుతో సైన్స్‌కు పెద్దపీట వేస్తున్నా, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే విధమైన సౌకర్యాలు కల్పించిననాడే మరోసారి భారత్ నోబెల్ బహుమతి సాధిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

- సుధాకర్.ఏ.వి

అసోసియేట్ అధ్యక్షులు, STUTS

90006 74747

Advertisement

Next Story