ప్రజల సొమ్ము సలహాదారుల పాలు!

by Ravi |   ( Updated:2024-01-02 00:45:10.0  )
ప్రజల సొమ్ము సలహాదారుల పాలు!
X

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సొమ్ము సలహాదారుల పాలు అవుతుంది. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజాధనంతో 50 మందికి పైగా సలహాదారులను నియమించి ప్రజాధనాన్ని సలహాదారులకు సంతర్పణ చేస్తుంది జగన్ ప్రభుత్వం. వీరిచ్చే సలహాలేమిటో, వాటి ఆధారంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో దేవుడికే తెలియాలి. సలహాదారుల నియామకాలపై హైకోర్టు ఎన్ని చివాట్లు పెట్టిన జగన్ ప్రభుత్వం మారడం లేదు. ఈ సలహాదారుల్లో ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డే ప్రభుత్వ పెత్తనం వెలగబెడుతున్నారు.

తన వాళ్లు అయితే చాలు సలహాదారులుగా నియమించుకొని ప్రజాధనం దోచి పెడుతున్నారు. కానీ జీతాలు పెంచమని గత 20 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలకు జీతాలు పెంచేందుకు అంగీకరించడం లేదు ప్రభుత్వం. సలహాదారులకైతే మాత్రం ప్రతినెలా రూ. 2లక్షల జీతంతోపాటు ఇతర అలవెన్సులు ఇస్తున్నారు. ఇలా ప్రభుత్వం

ఒకరిని, ఇద్దరిని కాదు ఏకంగా 50 మందికి పైగా సలహాదారులను నియమించుకొన్నది. కానీ వీరందరిలో ముగ్గురు, నలుగురు తప్ప మిగిలిన వారు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. వీరందరిని కూర్చోబెట్టి లక్షల్లో వేతనాలు, సకల సదుపాయాలు, రాజభోగాలు కల్పిస్తున్నారు. గత నాలుగున్నరేళ్లలో వీరికి జగన్‌ ప్రభుత్వం దోచిపెట్టిన ఖర్చు దాదాపు రూ. 400 కోట్లు. రహదారులు నరక ప్రాయంగా మారి ప్రజల ప్రాణాలు హరిస్తున్న రోడ్లపై గుంతలు పూడ్చడానికి తట్టెడు మట్టివేయడానికి డబ్బులు ఉండవు. కానీ సలహాదారుల నియామకాలకు, వారికిచ్చే రాచమర్యాదలకు అడ్డూ అదుపూ లేకుండా ప్రజాధనం దోచిపెడుతున్నది జగన్ రెడ్డి ప్రభుత్వం.

చట్టసభల్లోకి రాలేనివారు..

రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా పనిచేసే పరిపాలనా వ్యవస్థ ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులున్నారు. వీరంతా ప్రజలకు జవాబుదారీ. మరి సలహాదారులు ఎవరికి జవాబు దారి? అసలు వారి అవసరం ఏమిటి? వారికి వున్న చట్టబద్ధత ఏమిటి? వారికున్న అర్హతలు ఏమిటి? గతంలో పాలనాపరంగా సముచిత నిర్ణయాలు తీసుకునేందుకు ఆయా రంగాల్లో నిపుణులు, నిష్ణాతులు, అనుభవజ్ఞులను సలహాదారులుగా నియమించుకునేవారు వారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ అధికారులతో సమన్వయం చేసుకునేవారు. వారి సలహాలకు విలువ కూడా ఉండేది. కానీ ఇప్పుడు అర్హత, అనుభవం లేకపోయినా రాజకీయ ప్రాధాన్యత ప్రాతిపదికనే సలహాదారులను నియమించుకొంటున్నారు. ప్రజామోదంతో చట్టసభల్లోకి రాలేకపోతున్నవారు ఇలా సలహాదారుల రూపంలో వచ్చి తిష్ట వేస్తున్నారు. పైగా వీరికి గవర్నర్‌, ముఖ్యమంత్రితో సరితూగే వేతనాలు, అలవెన్సులు, హోదాలు, సకల గౌరవ మర్యాదలూ పొందుతున్నారు. ప్రతి శాఖకు మంత్రి, ముఖ్య కార్యదర్శి, విభాగాధిపతి, అధికార యంత్రాంగం ఉన్నా, జగన్ ప్రభుత్వం ప్రతి శాఖకూ సగటున ఇద్దరు సలహాదారులను నియమించింది. అయితే, వీరు చేస్తున్న పనులు, ఇస్తున్న సలహాలేమిటి వారు ఇస్తున్న సలహాలు ఆధారంగా ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలేంటి అన్న ప్రశ్నలకు జవాబుల్లేవు.

పనేలేదు కానీ జీతం లక్షల్లో

50 మంది సలహాదారుల్లో సీఎం సమక్షంలో జరిగే సమావేశాలకు ముఖ్య సలహాదారు, సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే హాజరవుతుంటారు. మిగిలిన వారు ఎప్పుడైనా ఆ సమావేశాలకు హాజరయిన పరిస్థితి లేదు. కనీసం వారికి పిలుపు కూడా ఉండదు. స్వయంగా సలహాదారులే సమావేశం పెట్టె అవకాశమే లేదు. మరి వీరు చేస్తున్నది ఏమిటి? సలహాదారులు సలహాలిచ్చే అవకాశమే లేనప్పుడు వీరికి కోట్లాది రూపాయల ప్రజాధనం రూపాయలు దోచి పెట్టడం అవసరమా? ఇక వారు ఏం చేయాలో నిర్దేశించే జాబ్‌ చార్ట్‌ కూడా లేదు. ప్రభుత్వం ఇచ్చే కారు, వ్యక్తిగత సిబ్బంది, ప్రొటోకాల్‌తో రాచ మర్యాదలు పొందుతూ వెలిగిపోతున్నారు.

ఆ 50 మంది సలహాదారుల్లో 8 మందికి కేబినెట్ ర్యాంకు, మరో 12 మందికి కేటగిరి-1 కింద సగటున రూ. 3.82 లక్షల వేతనం చెల్లిస్తున్నారు. వీరికి అధికారిక నివాసం, ప్రభుత్వ కారు, పీఏ, పీఎస్, ఆఫీస్ సిబ్బంది, వారికి జీతం అదనం. ఇలా వీరికి నెలకు రూ. 5.82 లక్షలు ఖర్చుచేస్తున్నారు. రెండో కేటగిరి వారికి నెలకు 4.79 లక్షలు, మూడో కేటగిరి వారికి నెలకు 4 లక్షలు వ్యయం చెల్లిస్తున్నారు. ఇలా మొత్తం సలహాదారులకే రూ. 500 కోట్లు ఖర్చుచేస్తున్నారు.

ఫర్నిచర్‌ వంటివాటి కోసం రూ. 10 లక్షలు ప్రత్యేకంగా ఇచ్చారు. ఇవన్నీ వారి నియామక ఉత్తర్వుల్లోనే పొందుపరచారు. అయితే. సలహాదారుల సూచనలతో ప్రభుత్వం చేసిన మంచి పనేమిటో సలహాదారులు ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు ఏమిటో ప్రభుత్వంలో సలహాదారులు నిర్వహించిన పాత్ర ఏమిటో సలహాదారులకు ప్రభుత్వం అయిదేళ్లలో ఎంత ఖర్చు చేసిందో జగన్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగలదా?

- నీరుకొండ ప్రసాద్

98496 25610

Advertisement

Next Story