- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనరిక్ మందులతోనే జవసత్వాలు
అగ్రరాజ్యమైన అమెరికాలో 10 మంది రోగులలో ఎనిమిది మంది రోగులకు జనరిక్ మందులను అక్కడి వైద్యులు చీటీలో రాస్తారు. కానీ మన దేశంలో పదిమంది రోగులలో 8 మందికి డాక్టర్లు ప్రైవేటు కంపెనీలు తయారు చేస్తున్న బ్రాండెడ్ మందులనే వాస్తున్నారు.
ఏ మాత్రం చిన్నపాటి అనారోగ్యానికి గురైనా వైద్యుల సూచనల ప్రకారం ఔషధాలు(టాబ్లెట్లు, ఇంజక్షన్లు, టానిక్ లు) తీసుకోవడం పరిపాటి. అయితే ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వైద్యుల సూచనలు లేకుండా ఔషధాలు సేవిస్తే కొంతమందికి రియాక్షన్ వచ్చే అవకాశాలుంటాయి. అందుకే నాణ్యమైన ఔషధాలను వైద్యుల సూచనల మేరకు తీసుకోవాలి. అయితే ప్రస్తుత మార్కెట్లో బ్రాండెడ్ ఔషధాల ధరలు ఎక్కువగా ఉండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాటిని కొనలేక ఎంతో సతమతమవుతున్నారు. దీనికి పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం 2008 నుండి (జన ఔషది) జనరిక్ పేరుతో తక్కువ ధరకే నాణ్యమైన మందులను తయారు చేస్తూ దేశవ్యాప్తంగా జనరిక్ ఔషధ దుకాణాలను ప్రారంభించింది. అయితే బ్రాండెడ్ మందుల కంపెనీలు వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తూ జనరిక్ మందులు నాణ్యమైనవి కావని, అవి సరిగా పనిచేయవని, అంతగా ప్రభావం ఉండదని ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు దీనివల్ల అనుమానం కలుగుతుండడంతో జనరిక్ మందుల వినియోగానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
జనరిక్ మందులంటే..
మనం కొనుగోలు చేసే టాబ్లెట్‌లు,ఇంజక్షన్‌లు, టానిక్‌లపై ఉండే పేరును బ్రాండ్ అని, అవి తయారు చేసేందుకు ఏ ఏ రసాయనాలు ఉపయోగించారో, లేదా వ్యాధిని తగ్గించే రసాయనాలను జనరిక్ అని అంటారు. అంతే కాకుండా ఒక బ్రాండెడ్ కంపెనీ తయారు చేసిన మందుపై 20 సంవత్సరాలు, ఆపై పేటెంట్ హక్కులు పూర్తి అయిన తర్వాత ఆ పేటెంట్ ఆధారంగా ప్రభుత్వం లేదా ఏ ఇతర ప్రైవేటు ఫార్మా కంపెనీ అయినా అదే ఫార్ములాతో మందులు తయారు చేస్తే ఆ మందులను కూడా జనరిక్ మందులు అంటారు. ఒక బ్రాండెడ్ కంపెనీ ఒక మందును తయారుచేసి మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. ఉదాహరణకు ఒక మందును వివిధ రకాల బ్రాండ్‌ల, పేర్లతో 5వేల కంపెనీలు తయారు చేస్తుంటే వాటిలో ఐదు మాత్రమే క్లినికల్ ట్రైల్స్ వరకు చేరుకుంటాయి. చివరకు ఒక కంపెనీ మాత్రమే మంచి ఫలితాలను సాధించి మార్కెట్లో నిలుస్తుంది. అయితే ఇంతవరకు మిగిలిన కంపెనీలు పెట్టిన కోట్లాది రూపాయల డబ్బు బూడిదలో పోసిన పన్నీరు మాదిరి అవుతుంది. అలా విజయం సాధించిన ఒక కంపెనీ ఆ మందుపై పెట్టిన ఖర్చులు రాబట్టుకునేందుకు సుమారు 20 సంవత్సరాలు పడుతుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సదరు కంపెనీకి పేటెంట్ హక్కులు 20 సంవత్సరాలకు ఇస్తుంది. 20 సంవత్సరాల పూర్తయిన తర్వాత ఏ ఇతర ఫార్మా కంపెనీ అయినా, ఆమందును తయారు చేయవచ్చు. వీటికి ఖర్చు 30 నుండి 60 శాతం వరకు తగ్గుతుంది. అందుకనే మార్కెట్లో జనరిక్ మందులు, బ్రాండెడ్ మందుల కంటే మూడు నుండి ఐదు రెట్లు తక్కువకు లభిస్తాయి.
ప్రభుత్వ నియంత్రణ ఉండాలి..
ముఖ్యంగా డబ్ల్యూ.హెచ్.ఓ నిబంధనల ప్రకారం ఒక డాక్టరు ఒక రోగితో 15 నుంచి 20 నిమిషాల పాటు మాట్లాడాలి. కానీ భారతదేశంలో రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడి వివిధ రకాల టెస్టులు రాసి, ఆ రిపోర్టుల ఆధారంగా బస్తాల కొద్దీ మందులు రాస్తున్నారు. ఈ టెస్టులు, మందుల ఖర్చు భరించలేక పేద ప్రజలు నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి రోగ లక్షణాలు చెప్పి మందులు వాడుతున్నారు. అయితే అమెరికాలో ఇలా మెడికల్ దుకాణాల వద్ద చేతి అమ్మకం ఏమాత్రం ఉండదు. డాక్టర్ చీటీ ఉంటేనే మందులను, అనుభవజ్ఞులైన ఫార్మసిస్ట్ డిగ్రీ, ఉన్న వ్యక్తి మాత్రమే విక్రయిస్తారు.
జనరిక్ మందులు తక్కువ రేటుకు లభ్యమవుతుండడంతో కొంతమంది ప్రైవేటు ఉత్పత్తిదారులు నకిలీ మందులు తయారు చేసే అవకాశం ఉంది. దీనివల్ల కొన్ని సందర్భాలలో ప్రాణహాని కలగవచ్చు. ఇందుకు సాక్ష్యంగా ఇటీవల గాంబియా దేశానికి భారత్ నుండి ఎగుమతి అయిన దగ్గు మందులు అక్కడి ప్రజలు వాడటం వల్ల మరణాలు సంభవించాయి. కరోనా సమయంలో ప్రపంచంలోని వివిధ దేశాలకు భారత్ కరోనా వ్యాక్సిన్లను సరఫరా చేసి ప్రపంచ వ్యాప్తంగా కరోనాను అరికట్టడంలో తన వంతు పాత్ర పోషించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ప్రశంసలు పొందింది. కానీ గాంబియా సంఘటన వల్ల అప్పటి వరకు ప్రపంచంలోనే ఫార్మా హబ్‌గా ఉన్న మన దేశానికి చెడ్డ పేరు లభించింది. దీనివల్ల ప్రభుత్వం సమగ్ర నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసి కచ్చితంగా మందుల ఉత్పత్తులపై నియంత్రణ ఏర్పాటు చేయాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నాణ్యమైన జనరిక్ మందులు లభ్యమయ్యేలా ప్రజలకు తక్కువ ధరకు అందించాలి. దీనివల్ల ప్రజలు బ్రాండెడ్ మందులను కొనుగోలు చేయకుండా జనరిక్ మందులు కొనుగోలు చేస్తారు.
జనరిక్ మందులు నాణ్యమైనవి కావని, వాటిని వాడొద్దని, బ్రాండెడ్ మందుల కంపెనీలు వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో అపనమ్మకం పెంచుతున్నాయి. కానీ రోగులకు జవసత్వాలు ఇచ్చేది జనరిక్ మందులే.
83281 43489