- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు నుంచి రజాకార్ దాకా.. తెలుగు సినిమా పయనం ఎటువైపు?
1948 సెప్టెంబర్ 17న భారత్‌లో విలీనమైన హైదరాబాద్ రాష్ట్ర చరిత్రను, సైనిక చర్యను, సాయుధ తిరుగుబాటును ప్రస్తావించిన కొన్ని సినిమాలు ఉన్నాయి. వీటిలో ప్రముఖమైనది 1979లో విడుదలైన మా భూమి సినిమా.
మా భూమి
గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన ‘మా భూమి’ 1946-1951 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ తిరుగుబాటుని దృశ్య రూపంలో అందించిన మొదటి చిత్రాలలో ఒకటి. దీనికి చలనచిత్ర దర్శకులు బి నర్సింగ్ రావు సహ నిర్మాతగా నిర్మించారు. ఈ చిత్రం 1948లో జరిగిన హైదరాబాద్ రాష్ట్ర విలీనాన్ని తెలంగాణ రైతులు, కార్మికుల కోణం నుండి చిత్రీకరిస్తుంది. తెలంగాణ గ్రామాల్లో దొరలు, ఆధిపత్య కులాల భూస్వాముల దౌర్జన్యాలను, వారికి వ్యతిరేకంగా ‘సంఘాలు’ అంటే గ్రామస్థాయి కమ్యూనిస్టు సంస్థలు రైతులను, వ్యవసాయ కార్మికులను ఎలా సమీకరించాయో మా భూమి చిత్రీకరిస్తుంది. మా భూమిలో ముస్లింలను రైతులు, కూలీల సహచరులుగా చూస్తాం. ముస్లింలతో రజాకార్ల సరళతరమైన అనుబంధం అనే అంశాన్ని ఈ సినిమా పక్కనబెట్టింది. దీనికి బదులుగా, హైదరాబాద్‌ను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసిన తర్వాత కూడా, రైతులు తమ సాయుధ తిరుగుబాటును కొనసాగించడం మనం ఈ సినిమాలో చూస్తాం. నిజానికి భారత సైన్యం చేతిలో రైతులు చనిపోతున్నట్లు దీంట్లో చూపించారు. హైదరాబాద్ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా తెలంగాణలో ఫ్యూడలిజం ఎలా కొనసాగిందో ఈ సినిమా చివరి అంకం వివరిస్తుంది.
వీర తెలంగాణ
మా భూమి విడుదలైన మూడు దశాబ్దాల తర్వాత ఆర్ నారాయణ మూర్తి తీసిన వీర తెలంగాణ సినిమా 2010 సంవత్సరం వచ్చింది. 2000వ దశకంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పుంజుకోవడంతో, 1940లలో జరిగిన తెలంగాణ తిరుగుబాటు ఇతర సంఘటనలపై ఆసక్తి పెంచింది. తన రచనలలో కమ్యూనిస్టు ఇతివృత్తాలను చూపించే ఆర్ నారాయణ మూర్తి ఈ సినిమాని రూపొందించారు. తెలంగాణ రైతాంగ తిరుగుబాటును చూపించిన 'వీర తెలంగాణ' కథనం దాదాపు 'మా భూమి'ని పోలి ఉంటుంది. తెలంగాణ తిరుగుబాటులో కీలక పాత్రలు పోషించిన షేక్ బందగీ (ఆధిపత్య కుల భూస్వామి విస్నూర్ రామచంద్రారెడ్డి అన్యాయాలను సవాలు చేసినందుకు హత్యకు గురైనా ముస్లిం రైతు), మఖ్దూం మొహియుద్దీన్ (ఉర్దూ కవి, ఉద్యమ ప్రముఖ నాయకుడు, మార్క్సిస్ట్) వంటి ప్రముఖ చారిత్రక వ్యక్తుల నిజ జీవిత కథలపై ఈ చిత్రం దృష్టి సారించింది. షోబుల్లాఖాన్ (నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా రాసినందుకు హత్యకు గురైన ఉర్దూ దినపత్రిక సంపాదకుడు), చాకలి ఐలమ్మ (విస్నూర్ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మరొక ఉద్యమ నాయకురాలు), దొడ్డి కొమరయ్య మరియు తనూ నాయక్ (పోరాటంలో అమరులైన రైతులు కూడా). ఇది ఉద్యమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్ర మహాసభ పాత్రను, అలాగే కాంగ్రెస్ పాత్రను కూడా చిత్రీకరించింది. ఏది ఏమైనప్పటికీ, 'మా భూమి' వలె కాకుండా, 'వీర తెలంగాణ' చిత్రం ముస్లిం, రజాకార్ల మధ్య స్పష్టమైన సంబంధాన్ని ఏర్పర్చింది. ఆధిపత్య కుల భూస్వాముల ఆదేశంతో జరిగిన దురాగతాలకు రైతులే బలి అయినప్పటికీ, రజాకార్ల హింసను కేవలం మతపరమైన హింసగా ఈ సినిమా ప్రదర్శించింది.
రాజన్న.. ఫక్తు కల్పిత గాథ
తెలంగాణా రాష్ట్ర ఆందోళన ఉధృతమైన సమయంలో నాగార్జున నటించిన 'రాజన్న' (2011) సినిమా వచ్చింది, ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్న వి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించారు. ఈ సనిమాలో కథానాయకుడు భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే ‘స్వాతంత్ర్య సమరయోధుడు’. తెలంగాణలోని రైతులు ఆదివాసీలు, ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా నేలకొండపల్లి గ్రామంలో, ఆధిపత్య కులాల భూస్వాములు, భూస్వామ్య దొరలు, దొరసానిల చేతిలో పడుతున్న కష్టాలను చూసి అతను చలించిపోయాడు. అతని గానం రైతులను వారిపై తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించే వ్యక్తి. ఈ చిత్రంలో దొరలు, ‘ముస్లిం’ పాలకుల దౌర్జన్యాలను చిత్రీకరిస్తూనే, రొమ్ము పన్ను వంటివి చూపారు. కానీ హైదరాబాద్ సంస్థానంలో అటువంటి పన్ను విధించినట్లు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఈ సినిమాలో ఆఖరికి రజాకార్ల సహాయంతో రాజన్నను డోరా చంపినట్లు చూపిస్తుంది. కొన్ని సంవత్సరాల తరువాత, ఢిల్లీలో ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను సందర్శించి, దొరల పాలనను రద్దు చేయమని అభ్యర్థించడం ద్వారా దొరసానిల దురాగతాల నుండి గ్రామాన్ని విముక్తి చేయడానికి అతని ఎనిమిదేళ్ల కుమార్తె మల్లమ్మ లాఠీని చేపట్టడం రాజన్న సినిమాలో చూస్తాం. ఈ పూర్తిగా కల్పిత కధ, ఈ సినిమాలో తెలంగాణ తిరుగుబాటు ఒక సామూహిక కథను అయినప్పటికీ ఒక వ్యక్తి కథగా, రాజన్న మార్చింది. తెలంగాణ తిరుగుబాటులో ‘స్వాతంత్ర్య సమరయోధులు’ ఎలాంటి పాత్ర పోషించనప్పటికీ, ఇందులో పోరాడినట్టు చూపించారు. స్వాతంత్ర్య సమర యోధుడిగా ఒక మంచి ముస్లిం పాత్రను తప్పితే, ఈ చిత్రం రజాకార్ల హింసను ప్రధానంగా ముస్లింలు... హిందువులను అణచివేయడాన్ని చూపుతుంది. భారతీయ యూనియన్‌లో చేరాలనేది తెలంగాణ ప్రజల 'సార్వత్రిక' కోరిక అని ఈ చిత్రం నొక్కి చెబుతుంది.
అన్‌హెర్డ్
తెలంగాణ ఏర్పడిన ఏడేళ్ల తర్వాత, డిస్నీ+ హాట్‌స్టార్‌లో 'అన్‌హెర్డ్' అనే చారిత్రిక ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్ విడుదలైంది. ఈ సిరీస్ హైదరాబాద్ రాష్ట్ర చరిత్రను వింతగా వర్గీకరించింది.
ఈ ధారావాహిక 1920లలో ప్రారంభమవుతుంది మొదటి నుండి, ఇది కాంగ్రెస్ వాలంటీర్లను చంపుతున్న అన్వర్ అనే వ్యక్తిని సూచిస్తూనే ఉంటుంది. కానీ రజాకార్ల దళం 1930ల చివరలో మాత్రమే ఉనికిలోకి వచ్చింది. అలాగే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కూడా 1938లో ఏర్పడింది. రాజన్న సినిమాలాగే ఈ చారిత్రాత్మక వెబ్ సీరీస్ కూడా చరిత్రను వక్రీకరిస్తుంది. హైదరాబాద్‌లో విలీనానికి ముందు తరువాత జరిగిన హింస పూర్తిగా రజాకార్లకు ఆపాదిస్తూ ఈ సీరీస్ తీశారు. ఈ ధారావాహిక డ్రైవింగ్ థీమ్ జాతీయవాదం. గాంధీ, నెహ్రూ గురించి విస్తృతంగా చర్చించి, తెలంగాణ తిరుగుబాటును ప్రస్తావించి వదిలిపెట్టారు. భారత సైన్యం కొనసాగించిన మత హింస, వేలాది మంది ముస్లింల హత్యల గురించి ప్రస్తావించలేదు. నిజాం భారత యూనియన్‌లో చేరి ఉంటే పోలీసు చర్య అనంతర హింస నుండి హైదరాబాద్‌ను రక్షించి ఉండవచ్చని ఈ సీరీస్ నొక్కి చెబుతుంది. ఈ చిత్రం రజాకార్లు రూమీటోపీ, షేర్వాణీ ధరించి ఊర్దూలో మాట్లాడుతున్నట్టు చూపుతారు. కానీ అప్పుడు ఉర్దూ రాష్ట్ర భాష కాబట్టి మతాలకు అతీతంగా ప్రజలు దీనిని ఉపయోగించారు. అందుకే దాశరధి రంగాచార్య తన స్మృతులలో భాషపై తనకున్న ప్రేమను గురించి రాసుకొని దానికి మతపరమైన రంగు వేయకూడదని నొక్కి చెప్పారు. సుందర్‌లాల్ నివేదిక ప్రకారం నాటి హింస కారణంగా 27 నుంచి 40 వేల మంది చనిపోతే వారిలో ఎక్కవ ముస్లింలే ఉన్నారని తేల్చింది. అయినా మన తెలుగు చిత్రాలలో ముస్లిం మరణాలకు సంతాపం లేదు.
మరాఠీ 'రజాకార్'
ప్రస్తుతం తెలుగులో రజాకార్ సినిమా నిర్మాణం అవుతున్న కాలానికి ఎనిమిదేళ్లకు ముందే మరాఠీలో రజాకార్ పేరిట ఒక సినిమా విడుదలైంది. రాజ్ దుర్గే రచన, దర్శకత్వం వహించిన భారతీయ మరాఠీ భాషా చిత్రం 'రజాకార్'. ఈ చిత్రంలో సిద్ధార్థ జాదవ్, జ్యోతి సుభాష్, శశాంక్ షెండే, జాకీర్ హుస్సేన్ నటించారు. ఈ చిత్రం 2015 ఫిబ్రవరి 27న విడుదలైంది. 1948 నాటి హైదరాబాద్ 'విముక్తి' ఉద్యమం గురించిన వాస్తవ గాధ ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఒక సామాన్యుడు స్వాతంత్ర్య సమరయోధుడిగా పరివర్తన చెందిన కథానాయకుడి ప్రయాణాన్ని మరాఠీ రజాకార్ చిత్రం చూపించింది. మొదట మరాఠీలో 2015 ప్రారంభంలో విడుదలైన ఈ సినిమా తర్వాత తెలుగులో డబ్ అయి రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది.
చరిత్రను చరిత్ర హీనంగా మలిచి..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో, 1940ల నాటి తెలంగాణ చరిత్ర రాజకీయవాదుల గుర్తింపునకు ముఖ్యమైనదిగా మారింది. ప్రధానంగా రాజకీయ మైలేజీని పొందేందుకు, అన్ని పార్టీలు తమ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా, 1940 లలో తమ ఉనికితో సంబంధం లేకుండా, తెలంగాణ రైతాంగ తిరుగుబాటు తమదేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణలో ఏ విధమైన తిరుగుబాటుతో, భూస్వామ్య వ్యతిరేక ఉద్యమంతో సంబంధం లేని బీజేపీ కూడా నేడు ఆ చరిత్రను తన ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. తెలంగాణ సాయుధ తిరుగుబాటును చరిత్రహీనంగా మల్చి, పురాణగాథలను రూపొందించే రాజన్న వంటి కొన్ని సినిమాలు అలాంటి వాదనలకు బాటలు వేస్తున్నాయి. ఈ విధంగా ఒక ఉద్యమం నుంచి నిజమైన చరిత్రను తొలగించిన తర్వాత, దానిని రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా సులభంగా తారుమారు చేయవచ్చు.
'తెలంగాణ వాసులకు చరిత్ర తెలుసు. రజాకార్ లాంటి తాజా సినిమాలను అనవసరంగా మనమే పట్టించుకొని పబ్లిసిటీ ఇస్తున్నామేమో. అలా ఇచ్చి దీన్ని మళ్ళీ ఒక కాశ్మీర్ ఫైల్స్‌లా హిట్ చేయొద్దని మనవి' అయితే ఈ సినిమా గురించి పక్కనపెడితే, అలనాటి చరిత్రలోని వాస్తవ కోణాన్ని మరుగున పెట్టి కొత్త చరిత్రను రాయడానికి లేదా రుద్దడానికి ప్రతీప శక్తులు ఎంత శక్తిమంతంగా ముందుకు వస్తున్నాయో చూస్తున్నప్పుడు అసలైన చరిత్రను పదిలపర్చుకునే పనిలో ప్రగతిశీల శక్తులు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు మరింత స్పష్టంగా బోధపడుతుంది.
(ముగింపు వ్యాసం)
కె.రాజశేఖర రాజు
73964 94557