- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దళిత ఉద్యమ స్రష్ట డా. కత్తి పద్మారావు
సామాజిక మార్పుని కోరుకునే సాహిత్యం దళిత సాహిత్యం. డా. అంబేద్కర్ దళిత సమాజంలో కొత్త చైతన్యాన్ని కొత్త చూపుని ప్రసాదించాడు. మా అంటరాని వారి హక్కులకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని, నన్ను దేశద్రోహిగా ఎందుకు చిత్రిస్తున్నారని ఆయన కాంగ్రెస్ పార్టీనే ప్రశ్నించారు. ఒకచోట గాంధీకి సమాధానంగా 'ఈ దేశం నా మాతృభూమి కాదు. ఏ దేశంలో కుక్కలు, పిల్లులు, జంతువుల కంటే మనుషులు హీనంగా చూడబడుతున్నారో ఆ దేశం మాదెట్లా అవుతుంది' అంటాడు అంబేడ్కర్. 'ఊరుమ్మడి చెరువుల్లో జంతువులతో పాటు దోసెడు నీళ్ళు కూడా తాగలేని స్థితిలో దళితులున్న ఈ దేశం మాది ఎట్లా అవుతుంది' అంటాడు.
చరిత్ర ప్రతి మలుపులో ఓ ఉద్యమం. ఉద్యమం ఆగిన ప్రతి మజిలీలో ఒక నాయకుడు పుడతాడు అని ఓ చైనా సామెత. అలాంటి మహోన్నతమైన ఉద్యమాల్ని మనం ప్రపంచ వ్యాప్తంగా చరిత్రలో చదువుకొంటూ ఉన్నాము. కులం, ఆ కులానికి ఆధారమైన మతం, మత విశ్వాసాలు వాటికి పునాదులైన పురాణాలు, స్మృతులు ఈనాడు ఈ దేశాన్ని కీలవేన్మణి, కారంచేడు, చుండూరుల దాకా, నేటి మణిపూర్ మతోన్మాద పోకడల అత్యాచార, అరణ్యరోదనల దాకా కాల్చుకు తింటున్నాయి. అంతర్జాతీయ యవనిక మీద తల దించుకునేలా చేస్తున్నాయి.
అలాంటి అత్యంత దుర్మార్గమైన చరిత్ర మలుపుల్లో బుద్దుడు. ఫూలే, అంబేడ్కర్ అయ్యంకాళిల వరుసలో ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమమే తయారు చేసుకొన్న నాయకుడు డాక్టర్ కత్తిపద్మారావు, మాల మాదిగ అంటరాని పల్లెల వ్యథల్ని, ఆక్రందనల్ని, ఆవేదనలను నిలువెల్లా నింపుకొన్న మహోన్నతమైన సాహితీ ఉద్యమ స్ఫూర్తి డా.కత్తి పద్మారావు.
కారంచేడులో దళితులపై అగ్రవర్ణాల దుర్మార్గపు హత్యాకాండతో చలించిపోయి, ఉద్యోగాన్ని వదిలి ఉద్యమంలోకి దూకి, తానే ఉద్యమమై నిలిచి లక్షల జనాల ముందు గర్జించిన మహోన్నత రూపం డా. కత్తి పద్మారావు. చుండూరులో అమరులైన దళితుల శవాల్ని ఊరి నడిబొడ్డున రక్త క్షేత్రంలో ఖననం చేయించి ఢిల్లీ బోట్ క్లబ్ దాకా ఉద్యమాన్ని నడిపిన ధీశాలి ఆయన..
ప్రజల ఆలోచనల్ని చూపేది..
హిందీ సాహిత్య క్షేత్రాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే జైల్లో ఉండి కవిత్వాన్ని సృష్టించిన అజ్ఞేయ్, యశ్‌పాల్‌ల మార్గంలో పండిట్ నాగార్జున్, ధూమిల్‌ల శైలిలో పద్మారావు కవిత్వం కనిపిస్తుంది. కవిత్వం, ఆయన ఉపన్యాసం, చరిత్ర రచన, ఉద్యమ నిర్మాణం, ఉద్యమ నడక దేనికదే తమదైన ప్రత్యేకతతో కనిపిస్తాయి. మహారాష్ట్ర దళిత పాంథర్స్ ఉద్యమం. కర్ణాటక దళిత సంఘర్ష సమితి (డి.ఎస్.ఎస్.) బెంగాల్ నామ శూద్ర ఉద్యమం, పంజాబ్ అదిధర్మి ఉద్యమం, స్వామి అచుతానంద్ నిర్మించిన అది హిందూ ఉద్యమాల వరుసలో ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఉద్యమాన్ని చూడాలి. ఆంధ్రప్రదేశ్లో స్వామి అనుతానంద్ శిష్యులుగా భాగ్యరెడ్డివర్మ, కుసుమ ధర్మన్నలు నిర్మించిన అది హిందూ ఉద్యమం కొంతమేరకు దళిత మహాసభకి మార్గదర్శకంగా ఉంటోంది. సాహిత్యం ప్రజల ఆలోచనల్ని ప్రతిబింబింపజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమానికి ఒక ప్రత్యేకత ఉంది.సమాజంలో నెలకొన్న విభిన్నమైన విషయాల్ని సంఘటనల్ని సాహిత్యం బహిర్గతం చేస్తుంది. అలాంటి నేపథ్యంలోనే డా. కత్తి పద్మారావు సాహిత్యాన్ని, కవిత్వాన్ని మనం చూడాలి.
కారంచేడు ఉద్యమ రణక్షేత్రంలోంచి పొడుచుకొచ్చిన కన్నమదాసు కరవాలం డా. కత్తి పద్మారావు, ఆయన కవిత్వంలో హెూచిమెన్లు, పాబ్లో నెరూదాలు, ఫైజ్ అహ్మద్ ఫైజ్‌లు, ముఖ్దుం మొహియుద్దీన్లు, శివసాగర్, కలేకూరి ప్రసాద్, పైడితెరేశ్ బాబు, మద్దూరి నగేష్ బాబు, నాగప్పగారి సుందరరాజులు కనిపించి ఏడిపిస్తారు. కదనరంగానికి పరుగులు తీయిస్తారు.
ఆత్మగౌరవ స్వరంతో…
నేడు దళిత చైతన్యం సామాజిక అవలక్షణాల నుంచి సాంస్కృతిక బానిసత్వం నుంచి విముక్తిని పొందే దిశలో ముందుకు కదులుతోంది. ఆ చైతన్య స్థాయిని మనం కవి పద్మారావు కవిత్వంలో చూడాల్సి ఉంటుంది. సాహిత్య చరిత్రలో కవిత ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమించింది. దళిత సాహిత్యంలో కూడా దళిత కవిత్వం. ముఖ్యమైన స్థానంలో ఉంది. తెలుగు దళిత కవిత్వంలో ఆయన కవిత్వానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.
తెలుగు దళిత సాహిత్యంలో 'జైలు గంటలు' మోగించుకుంటూ అగ్రహారపు గుండెల్లో నల్ల కలువలు. పూయించి మాల మాదిగ పల్లెల్లో నీలి కేకలు సృష్టిస్తూ అంటరాని అణగారిన కులాల అవమానాగ్నుల్ని 'ముళ్ళ కిరీటంగా ధరించి అంటరాని వారి, 'భూమి భాష'నే మాట్లాడుతూ 'కట్టెల మోపుని' నెత్తికెత్తుకుని 'ఆత్మ ''గౌరవస్వరం'తో ఉద్యమ స్ఫూర్తితో ఈ యుగకవిగా 'ఈ దేశం మాది' అంటూ ఈ యుగం కవిత్వాన్ని వినిపిస్తూ. మన ముందుకు కవి పద్మారావు దూసుకు వచ్చారు.
ప్రాచీన భారతీయ సాహిత్యంలో చార్వాకులు, లోకాయతులు, శంభూకుడు, త్రిశంకుడు లాంటి పాత్రల్లో అంటరాని మనుషులు అనేకమంది కనిపిస్తారు. మానవ సమాజం క్షేమం కోరి ప్రజ్ఞ, సమత, కరుణ అనే త్రికరణాలను బోధించిన బుద్దుడు నడయాడిన నేల ఇది. భక్తి కాలంలో వచ్చిన సంత్ సాహిత్యంలో నిర్గుణధారకు చెందిన జ్ఞానాశ్రయ శాఖలో సంత్ కబీర్, సంత్ రవిదాస్, గురునానక్ విప్లవాత్మకమైన సాహిత్యాన్ని సృష్టించారు.
అంబేడ్కర్ గొంతుతో..
'బానిసత్వాన్ని మించిన దుర్మార్గం ప్రపంచంలో ఎక్కడైనా ఉంది అంటే అది కులమే'నని బాబా సాహెబ్ అంబేద్కర్ నినదించారు. అదే గొంతుతో 'ఈ దేశం మాది' అంటూ నినదిస్తూ కవిత్వం వినిపిస్తున్నారు. కత్తి పద్మారావు. ఈ కవితలో ఆకాశ నక్షత్రాలు / సముద్రంలో అద్దం చూసుకుంటున్నాయి./ సూర్యుడు సముద్రంలో/ స్నానం చేసి తన బాల్యత్వాన్ని నిరూపించుకొంటున్నారు. బౌద్ధ సాంస్కృతీ వికాసానికి ఆ కవి కరణాలు పతాకలెత్తుతున్నాయి. ఈ యుగం మాది, ఈ దేశ నిర్మాతలం మేమే అని చాటి చెబుతున్నాయి.. అంటారు.
మరో చోట 'ఆమె పాదాల నెర్రలు ఒక పునఃస్పష్టి సంకేతాలు' అనే కవితలో మీరు మానవ సంస్కృతి నుండి శిల్ప సంస్కృతికి/ పరిణమిస్తున్నారు. అందుకే మీలో మానవత అందుకే మళ్ళీ ఆ దళిత తల్లి మానవతా పాఠశాల అందులో విద్యార్థులం అవుదాం రండి అప్పుడే భారత దేశానికి పునరుజ్జీవం అంటారు.
నేడు సమాజంలో వ్యాపిస్తున్న విష సంస్కృతిని, కుల హత్యలు, ప్రేమికుల పరువు హత్యల్ని ధిక్కరిస్తూ నిరసనగా 'ప్రేమదే విశ్వజనీన సూత్రం' కవితలో కవి పద్మారావు... వివాహానికి కులం అడ్డుందని ఏ దేవుడు చెప్పాడు సంపద కోసం ప్రేమను చంపడమెందుకు ఇక రాబోయేది సంకెళ్ళు తెంచే కాలం గోడలు కూల్చే కాలం ప్రేమదే విజయం ప్రేమదే విశ్వజనీన సూత్రం... అంటారు.
ఈ కాలపు యుగకవి
భారతీయ దళిత కవిత్వంలో డా. కత్తి పద్మారావు కవిత్వం ప్రత్యేక శైలిలో కనిపిస్తుంది. అది దళితుల సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల దుర్మార్గాన్ని ఎండగట్టింది. తమ స్వార్థం కోసం ఆధిపత్య కులాలు ఆడుతున్న కపట నాటకాలు, దొంగ ప్రేలాపనలపై వ్యంగ్యాస్త్రాలు ఇందులో వున్నాయి. దళిత జీవన కోణాల్ని కవి పద్మారావు స్పృశించారు. 'అంటరాని కులాల'పై అమానుష పరిస్థితుల్ని, మూఢనమ్మకాల్ని, విలువలు లేని తనాన్ని ఆయన కవిత్వం ఖండించింది. వర్ణాశ్రమ ధర్మాన్ని, అంటరానితనాన్ని తూర్పారపడుతూ తరాలుగా ఊరి బైట వెలిలో బతుకుతున్న దళితుల మానవ హక్కుల కోసం ఆయన కవిత్వం నినదించింది. ఈ కవిత్వం దళిత జీవన విషాదాన్నే కాక భవిష్యత్ కలను కూడా కోరింది. 'లేరా లేరా దళితుల యుగమిదెరా' అన్నటువంటి పద్మారావు పాటలాగానే ఇది దళిత సాహితీయుగం. ఈ దేశం మాది అంటూ ఈ నేలపై తమకున్న హక్కుని, అనురాగాన్ని ఆధిపత్యాన్ని ప్రకటిస్తున్న కత్తి పద్మారావు ఈ యుగకవి. ఈ కవిత్వం అత్యంత జనాదరణ పొందింది.
నా చిన్నప్పటినుండి మా ఒంగోలు ప్రాంతంలో వినిపించిన ఓ ధిక్కార స్వరం, ఉపన్యాసకారుడు, ఉపన్యాస సామ్రాట్, ఉపాధ్యాయుడు, మహా మహోపాధ్యాయుడు... దళిత పదాన్ని, అంబేద్కర్ వాదాన్ని కథలా వినిపించిన దళిత మహాసభ వ్యవస్థాపక నేత కత్తి పద్మారావు. సెంట్రల్ యూనివర్సిటీ చదువుతో పాటు పద్మారావుగారి నాయకత్వాన్ని, ఆయన రచనలని చదువుకుంటూ ఆయన అనుభవాల్ని, నేతృత్వాన్ని యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమంతో పోల్చి చూసుకుంటూ నడిచిన వాడిని నేను. విద్యతో పాటు డాక్టరేట్ పొంది మరో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగాను కానీ, పద్మారావు గారి తపన పట్టుదల, నాయకత్వం ఎప్పటికీ నాకు ఓ మహోన్నత శిఖరం లానే కనిపిస్తుంది.
(నేడు డా.కత్తి పద్మారావు 70వ జన్మదినోత్సవం)
- డా జి.వి.రత్నాకర్
హిందీ విభాగాధిపతి
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ
70135 07228