యూనిఫాం సివిల్ కోడ్.. ప్లస్సా.. మైనస్సా..?

by Ravi |   ( Updated:2023-06-30 00:15:25.0  )
యూనిఫాం సివిల్ కోడ్.. ప్లస్సా.. మైనస్సా..?
X

యూనిఫాం సివిల్ కోడ్.. దేశానికి దిక్సూచిగా, భిన్నత్వంలో ఏకత్వానికి కేరాఫ్‌గా మారనుంది. ఇకపై ఒకే దేశం ఒకే చట్టం. దారి తప్పిన మత చట్టాల విశృంఖలత్వాన్ని కట్టుముడితో బంధించడానికి యూనిఫాం సివిల్ కోడ్ అందుబాటులోకి రానుంది. భిన్నత్వంలో ఏకత్వం భారత్ కేరాఫ్. ప్రపంచంలో ఏ దేశానికి లేని ఓ ప్రత్యేకత అది. అయితే.. ఇప్పుడు ఇది సన్నగిల్లుతోంది. జనాభా, మతాల ఆధారంగా ఉన్న చట్టాలు దీనికి తూట్లు పొడుస్తున్నాయి. ఇది గమనించిన బీజేపీ సర్కార్ దేశంలో కొత్త నిర్ణయానికి నాంది పలికింది. వన్ నేషన్ వన్ కార్డ్. తీసుకొచ్చినట్టే.. ఇప్పుడు యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురానుంది. దేశంలో మతం, కులం, వర్గం, వర్ణం, ప్రాంతాలకు అతీతంగా ఈ యూనిఫాం సివిల్ కోడ్‌ను ప్రవేశ పెట్టనుంది. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఎప్పటినుంచో ఉంది. అయితే.. గతంలోనే కాంగ్రెస్ ఈ కోడ్‌ను తెద్దామని చూసినా.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం .. దానిని పక్కనపెట్టింది. తాజాగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశ వ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర సర్కార్ యోచిస్తోంది.

దిద్దుకోని తప్పులుగా ఈ చట్టాలు..

ఏ మతానికి తగినట్టు ఆ మతానికి చట్టాలు రూపొందించుకుంటూ పోవడంతో సమాన న్యాయం జరగటం లేదన్నది సమాజం నుంచి ఎదురవుతున్న సమాధానం. ఇది అనేక సార్లు న్యాయవాదుల నుంచి వినిపించిన వాస్తవమే. అయితే అది ఆయా మతాల, జనాభా ఆధారంగానే పట్టాలెక్కడం లేదన్నది కాదనలేని వాస్తవం. సమస్య తలెత్తినప్పుడు న్యాయస్థానాల వరకూ రాకుండా.. వారి మత గ్రంధాల ఆధారంగా.. మత చట్టాలను ఫాలో అవుతున్నారు. ఆ కేసులో పరమతస్తులు ఉంటే.. వారికి అన్యాయమే జరుగుతుంది. ఆ సమయంలో.. యూనిఫాం సివిల్ కోడ్ అమలు ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందన్నది స్పష్టమవుతోంది.

భారతదేశం సెక్యులర్ స్టేట్ అని చెప్పుకున్నప్పుడు అన్ని మతాలకు, అన్ని వర్గాలకు కలపి ఒకే చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి రాజ్యాంగం రూపొందించినప్పుడు సెక్యులర్ అనే పదం లేదు. 42 అమెండ్‌మెట్ ప్రకారం.. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో దాన్ని రాజ్యాంగంలో చేర్చారు. రాజ్యాంగంలో అయితే.. చేర్చారు కానీ సెక్యులర్‌ వ్యవస్థలో పాటించాల్సిన అంశాలను.. చేయాల్సిన న్యాయాన్ని మాత్రం చేయలేదు. సెక్యూలర్ అనే పదం చేర్చినప్పుడు మత ప్రతిపాదికన ఉన్నచట్టాలను కాంగ్రెస్ ఎందుకు రద్దు చేయలేదు? అనే ప్రశ్న బీజేపీ ఎక్కువగా సంధిస్తోంది. ఓట్ల కోసం.. కాంగ్రెస్ స్వార్థపూరితంగా వ్యవహరించింది కాబట్టే.. సమన్యాయానికి ఇంకా దూరమవుతున్నారనే అంశాన్ని బీజేపీ లేవనెత్తింది.

దేశంలో పౌరుల వ్యక్తిగత చట్టాలను మతం, కులం, లింగం, వర్గంతో సంబంధం లేకుండా.. పౌరులందరికీ సమానంగా వర్తించే ప్రతిపాదనను బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. ఒకే దేశం ఒకే చట్టం.. అనే నినాదానికి పిలుపునిచ్చింది. ఇప్పటికే వ్యక్తిగత చట్టాలు పబ్లిక్ నుండి వేరయ్యాయి. దాదాపు ఐదారు వ్యక్తిగత.. మత సంబంధ చట్టాలను దేశంలోని ప్రజలు పాటిస్తున్నారు. ముస్లిం లా.. హిందూ లా.. క్రిస్టియన్ లా.. పర్షియన్ లా.. నేషనల్ లా.. ఇలా ఏ మతానికి చెందిన వారు ఆ మతానికి చెందిన చట్టాలనే పాటిస్తున్నారు. ఇది చెప్పటానికి చూడటానికి మతపరమైనదే అయినా.. సమాజం దృష్టిలోకి వచ్చేసరికి అవి దిద్దుకోలేని పెద్దపెద్ద తప్పులుగా కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్ లాగే.. వెనకడుగు వేస్తారా?

బీజేపీ ప్రతిపాదించిన ఈ యూనిఫాం సివిల్ కోడ్.. ముస్లిం జనాభాకు చెక్ పెట్టడానికి అన్న విమర్శలు లేకపోలేదు. అయితే, ఆ విమర్శల్లో అంగీకరించాల్సిన వాస్తవం కూడా దాగి ఉంది. ముస్లిం మహిళలకు లబ్ధి చేకూర్చేందుకే బీజేపీ దీనిని తీసుకొస్తుంది. గతంలోనూ ట్రిపుల్ తలాక్ రద్దు చేసి అనేక మంది ముస్లిం మహిళలకు స్వేచ్ఛనిచ్చారు. ఇప్పుడు దీనితో బహుభార్యత్వం కూడా రద్దు చేస్తే.. వారికి మరింత లబ్ది చేకూరనుంది. ఇప్పటికే బహుభార్యత్వాన్ని అంతం చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించుటకు నలుగురు సభ్యుల కమిటీని అస్సాంలో సీఎం హిమంత బిశ్వశర్మ ఏర్పాటు చేశారు. ఇప్పటికే అస్సాంలో లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నామని.. దాదాపు 600 మదర్సాలను మూసేశామని.. మరో 300 మదర్సాలను బంద్ చేస్తామన్నారు. అయితే దీనిపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ అస్సాంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయగలరా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు బీజేపీ చట్టాల విషయంలో చెప్పి మరీ చేసింది. ఇప్పుడు కూడా ట్రిపుల్ తలాక్ మాదిరే యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తే, ముందు ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం రద్దు కానుంది. ఇది ముస్లిం సామాజికవర్గంలో చాలా పెద్ద మార్పులకు నాంది అవుతుంది.

కానీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు అతీతంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం లాగా బీజేపీ దీనిని అమలు చేయగలదా? అంటూ ఓ వర్గం వాదిస్తోంది. ఈ అంశం ఇప్పుడు మతం రంగు పులుముకున్న జాతీయ అంశంగా మారింది. ఇప్పటికే మత పార్టీగా పేరు తెచ్చుకున్న బీజేపీకి ఇది సాధ్యమా..? అనేది ప్రశ్నగానే ఉంది. ఒక వేళ నిజంగానే యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయగలిగితే.. ఆ వర్గం ఓట్లను బీజేపీ ఎప్పటికీ తిరిగి పొందలేదనడంలో.. కావాలనే ముస్లిం ఓట్లను టార్గెట్ చేసినట్టే అవుతుందనడంలో సందేహం లేదు. ఈ ప్రశ్నలకు బీజేపీ అతి త్వరలోనే సమాధానం చెప్పనుంది.

కడారి మణికుమార్,

జర్నలిస్ట్

90004 42257

Advertisement

Next Story