మీ గళం... మా గుండెల్లో పదిలం

by Ravi |   ( Updated:2023-06-30 00:00:19.0  )
మీ గళం... మా గుండెల్లో పదిలం
X

యన స్వరం.. ఎంతో మందిలో ఆత్మ విశ్వాసాన్ని నింపింది. ఆయన పాటల్లోని మాధుర్యం.. అనేక మంది గుండెలకు భరోసా ఇచ్చి, మానసిక స్థైర్యాన్ని నింపేది. అటువంటి త్యాగంతో .. వ్యథలతో నిండిన తన గడ్డకు .. స్వపరిపాలనతోనే తమ బతుకులు బాగుపడతాయని భావించి తన గొంతుతో నాలుగున్నర కోట్ల ప్రజల్లో ఆలోచనలు పెంచేలా చేశాడు. తన విద్యార్థి దశలోనే అభ్యుదయ భావాలతో, నాటి నుంచే నిత్య చైతన్యంతో సమాజం కోసం తన గళంతో కృషి చేసేవారు. ఆయన పాటల గొప్పతనం ఎంతో.. ఆయన మాటలు అంతే.. అందరినీ చనువుతో పలకరించే స్వభావం. వేదికలు ఏవైనా ఆయన పాటతో సభ అంతా సంబురపడేది. అటువంటి నిత్య చైతన్యంతో తెలంగాణ ఉద్యమంలో కృషి చేసిన గాయకుడు, విద్యార్థి ఉద్యమ నాయకుడు, ప్రస్తుత గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ మరణం నిజంగా పాటల ప్రపంచానికి... బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు.

అన్యాయాన్ని కళాకారులతో చెప్పించి..

‘రాతిబొమ్మల్లోనా కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలవది రా’ అంటూ ఆనాటి ఉద్యమంలో ఆయన పాడిన పాట యావత్తు తెలంగాణ సమాజానికి తెలిసిందే. కేసీఆర్ పర్యటన ఎక్కడున్నా అక్కడ సాయిచంద్ ధూంధాం పాటలతో ప్రజలను మైమరిపించేవాడు. అతడు పాట పాడితే సబ్బండవర్ణాలు లయబద్ధంగా ఆడేవి. అతడు గజ్జె కట్టి ఆడితే ముల్లోకాలు ఊగేవి. అతడి గొంతులో ఉన్న మాధుర్యానికి.. ఆబాల గోపాలం తెలంగాణ పదం అందుకుని, ఊరువాడ సయ్యాటలాడేది. ధూంధాం, అలయ్ బలయ్.. ఒకటా రెండా ఎన్ని ఉద్యమ వృత్తాంతాలు ఉంటే.. అందులోనూ తను ఉండేవాడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కళాకారులతో తనదైన శైలిలో జనానికి చాటి చెప్పేవాడు. తెలంగాణ ఎందుకు రావాలో కళాకారులతో తెలంగాణ ఆవశ్యకతను వివరించేవాడు. అలాంటి ఉద్యమానికి ఊపిరిలు ఊదినవాడు, తెలంగాణ సమాజాన్ని జాగృత్తపరిచే బాధ్యతను తలకు ఎత్తుకున్న వాడు అర్ధాంతరంగా తనువు చాలించాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన గొంతు ఓ ఉద్యమంలా సాగింది. ఎక్కడ సభలు, సమావేశాలు జరిగినా.. ఆయన ప్రతీ వేదికపై చైతన్యాన్ని నింపేవారు. ఉద్యమ నాయకునిగా ఆసరాగా నిలవాలని.. ఈ తెలంగాణ కారుచీకట్లను తరమడానికి ఆయన స్వరం.. ఓ గర్జనైంది. నిస్వార్థంగా ఉద్యమం కోసం చేసిన ఆయన కృషి మరవలేనిది. పేద కుటుంబంలో పుట్టిన సాయిచంద్ అభ్యుదయ భావాలు నింపుకొని సమాజ అభ్యున్నతికి పాల్పడేవారు.

మీ పాటలు ఎప్పటికీ మధురమే..

తెలంగాణ ప్రజల ఆకాంక్షే ఆయన లక్ష్యంగా.. ఎక్కడ ఎవరితో భేదాభిప్రాయాలు రాకుండా అందరితో సఖ్యతతో మెదిలేవారు. పార్టీ నాయకత్వ అడుగుజాడల్లో, ఆదేశాలతో తన బాధ్యతలు నిర్వహించే వారు. ఇలా తెలంగాణ ఉద్యమం కోసం నిస్వార్థంగా పనిచేసిన సాయిచంద్‌ను కేసీఆర్ అభినందించి, గత నవంబర్‌లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఆయన పాడితే.. దేవతలే పరవశించిపోయేలా ఉన్న మధురమైన గొంతు.. మూగబోయింది. ఆ శివున్నే ప్రశ్నించినందుకు కోపమేమో.. అర్థరాత్రి.. ఓ గొప్ప బిడ్డను ఈ తెలంగాణ సమాజం నుంచి దూరం చేసింది. అయితే ఆయనను భౌతికంగా దూరం చేసినా... ఆయన పాడిన పాటలు ఎప్పటికీ మధురమే.. ఆయన పాటకు మరణం లేదు.. అంబేద్కర్ ఆశయాలు, మహనీయుల మార్గాన్ని అనుసరిస్తూ... ఈ తెలంగాణ సమాజానికి దోపిడీ కుట్రలపై ఆయన గళం ఓ నిప్పుకణిక లాంటిది. ఏ దిష్టి తగిలేనో.. ఉన్నత భవిష్యత్తుకు అడుగులు పడుతున్న వేళ... విధి ఆయనను విగతజీవిగా చేసింది. సాయిచంద్‌ను భౌతికంగా దూరమైన వేళ... తెలంగాణ నేల నుంచి ఓ గొప్ప కళాకారుడిని, ఉద్యమ నేతను దూరం చేసుకుంది. అన్నా.. మీ పాటల్లో మీ రూపాన్ని చూస్తూ..‌ గుండెల్లో మీ గుర్తులను తెలంగాణ గడ్డ శాశ్వతంగా దాచుకుంటుంది. నీ మధురమైన కంఠం.. మూగపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం.. మీ పాటల స్ఫూర్తిని మరింత గుండెల నిండా నింపుకొని మీరు కలలు గన్న.. ఉద్యమ పార్టీకి అండగా నిలుస్తాం.. మీ పవిత్ర ఆత్మకు జోహార్లు..

సంపత్ గడ్డం,

దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు

78933 03516

Advertisement

Next Story