- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో ఆర్థిక సంక్షోభం
తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోందా? ఎఫ్ఆర్‌బీఎం పరిధి దాటిపోయారంటూ కొత్త రుణాల మీద కేంద్రం, ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. దీంతో ఉద్యోగులకు నెలా నెలా సమయానికి వేతనాలు చెల్లించలేకపోతున్నారు. సంక్షేమ పథకాలకు సరిపడా డబ్బులు అందడం లేదు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం కూడా క్రమంగా తగ్గిపోతున్నది. ఈ విపత్కర పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా? అని ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతున్నది. రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం అంతకంతకూ పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల మొత్తం ఇంచుమించు రూ. నాలుగు లక్షల కోట్లకు చేరువలో ఉంది. కిస్తీలు, మిత్తీలకే బడ్జెట్‌లో రూ.40 వేల కోట్లు కేటాయించారు. ఎఫ్ఆర్‌బీఎం చట్ట పరిధిలో ప్రభుత్వం చేసిన అప్పులు 2022 మార్చి నాటికి రూ. 2,86,804 కోట్లకు చేరాయి.
ఈ విషయాన్ని రాష్ట్ర బడ్జెట్‌లోనే ప్రభుత్వం అధికారికంగా ప్రస్తావించింది. దీనికి తోడు ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఇతర కార్పొరేషన్ల పేరిట రూ.1,05,006 కోట్ల రుణాలకు గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అప్పులన్నింటినీ కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. వీటిని కూడా కలిపితే రాష్ట్రం చేసిన అప్పులు రూ. 3,91,810 కోట్లు. కార్పొరేషన్ల పేరిట తెచ్చే కొత్త గ్యారంటీలు కలిపితే రూ. నాలుగు లక్షల కోట్లు దాటిపోవటం ఖాయమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రుణ సమీకరణకు అనుమతివ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పలుసార్లు అభ్యర్థించినా కేంద్రం నుంచి స్పందన లేదు. అటునుంచి మొదటి త్రైమాసికంలో రావలసిన రూ. 15 వేల కోట్లకు బదులు రూ. నాలుగు వేల కోట్లు మాత్రమే రావడంతో తెలంగాణలో సాధారణ రెవెన్యూ ఖర్చులు, ఉద్యోగుల జీతాల చెల్లింపులు, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులకు నిధుల సర్దుబాటు కష్టంగా మారింది. జూన్ నెలలో చెల్లించాల్సిన వేతనాలు, పెన్షన్లు, ఇతర పథకాలకూ డబ్బులు నేటి వరకు కూడా అందకపోవడంతో అయోమయం నెలకొంది.
అప్పులు..పరిమితులు.
ఎఫ్‌ఆర్‌బీఎమ్ (ద్రవ్య వినిమయ చట్టం) ప్రకారం రాష్ట్రాలు అప్పులు చేయడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. కేంద్రం అనుమతి కూడా అవసరం. రూల్స్ ప్రకారం రాష్ట్ర మొత్తం అప్పులు జీఎస్‌డీపీలో 25 శాతం మించకూడదు. మించితే ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చేరిపోతుంది. లెక్కలేనన్ని గ్యారంటీలు ఇవ్వటంతోపాటు అప్పులు చేసిన తీరు చూస్తే ఈ హద్దులను ప్రభుత్వం ఎప్పుడో దాటింది. కానీ, బడ్జెట్అంచనాలలో, జీఎస్‌డీపీలో 24.84 శాతం అప్పులున్నట్లు చూపించింది. రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి పంచుకున్న అప్పు రూ.70 వేల కోట్లు. ఏడేండ్లలో ఇది ఐదున్నర రెట్లు పెరిగిపోయింది.
నిబంధనల ప్రకారం GSDPలో మూడు శాతం వరకే రాష్ట్రాలు అప్పు తీసుకోవడానికి వీలవుతుంది. కరోనాతో ఆదాయాలు తగ్గడంతో దీనిని ఐదు శాతానికి పెంచాలని రాష్ట్రాలు కోరడంతో కొన్ని షరతులతో కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. 2022-23 బడ్జెట్‌లో రూ. 53,970 కోట్ల బహిరంగ మార్కెట్ రుణాలను సమీకరించాలని రాష్ట్రం ప్రతిపాదించింది. 2022-23 మొదటి త్రైమాసికంలో, ఆర్‌బీఐ, రాష్ట్ర ప్రభుత్వాల మార్కెట్ రుణాల క్యాలెండర్ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లను సమీకరించాలి. కానీ, జూన్ మూడున కేంద్రం రూ. నాలుగు వేల కోట్లకే అనుమతి ఇవ్వడంతో రాష్ట్రం కాస్తంత ఊపిరి పీల్చుకున్నది. క్యాలెండర్ ప్రకారం ఈ నెల చివరికి రూ. 15.000 వేల కోట్లు మొత్తం రుణాన్ని సేకరించాల్సి ఉంది.
తెలంగాణ అప్పుల మతలబు
తెలంగాణ రెండు విధాలుగా అప్పులు తీసుకుంటుంది. మొదటి పద్దతిలో బ్యాంకుల నుంచి ప్రత్యక్షంగా తీసుకునే అప్పులనే రాష్ట్ర బడ్జెట్‌లో చూపిస్తోంది. రెండవ పద్దతిలో కార్పొరేషన్ల ద్వారా తీసుకుంటుంది. వీటిని బడ్జెట్‌లో చూపించదు. అవి ప్రభుత్వ లెక్కలోకి రాకపోవడంతో ప్రజలకు తెలియడం లేదు. అప్పులను ఉత్పాదక రంగంలో ఖర్చు చేస్తే ఉపాధి అవకాశాలు పెరిగి పేదలకు మేలు జరుగుతుంది. వాటిని తీర్చడమూ సులువవుతుంది. నియంత్రణ పద్ధతులు లేని పథకాలు, వార్షికాదాయ నిమిత్తం లేకుండ ప్రకటించడం, జీతభత్యాలు పోటీపడి పెంచటం, మద్యం అమ్మకాలతో ఆదాయం సమకూర్చుకోవాలని అనుకోవడం నైతికత అనిపించుకోదు. తెలుగు రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణను పాటించడం లేదు.
ఎన్నికలలో గెలవడానికి ప్రజాకర్షక పథకాలతో ప్రజలను మోసపుచ్చుతున్నారని కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు పీఎం వద్ద ఆందోళన వ్యక్తంచేశారట. ఇదే పరిస్థితి కొనసాగితే శ్రీలంక తరహా సంక్షోభం తలెత్తడం తథ్యమని హెచ్చరించారని కూడా చెబుతున్నారు. రుణాల సేకరణకు కేంద్రం సహాయ నిరాకరణ మునుముందు కూడా కొనసాగితే తెలంగాణకు రూ.45 వేల కోట్ల రుణ ఆదాయానికి నష్టం వాటిల్లుతుంది. 2022-23 లో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్-ఇన్-ఎయిడ్ కింద రూ. 41 వేల కోట్ల మేరకు అందుకోవాలని రాష్ట్రం భావించింది. 2021-22 లో కేంద్రం నుంచి రూ. పది వేల కోట్ల వరకే అందాయి. కేంద్రం సహాయ నిరాకరణ ఇలాగే కొనసాగితే బడ్జెట్‌లో దాదాపు రూ.70 వేల కోట్ల మేరకు లోటు ఏర్పడుతుంది. 2022-23 బడ్జెట్ పరిమాణం రూ. 2.56 లక్షల కోట్లు అయితే, రూ. 1.80 లక్షల కోట్లకు అటూ ఇటుగా తగ్గవచ్చు.
ఇలా అయితే మేలు
విద్య, వైద్యం, రోడ్లు వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పేదలు చదువుకొని అభివృద్ధి చెందుతారు. ఉచిత వైద్యం మూలంగా ఆరోగ్యవంతులుగా జీవిస్తారు. ఓటరును దృష్టిలో పెట్టుకొని మాత్రమే అమలు చేసే సంక్షేమ పథకాలతో లబ్ధిదారులకు మాత్రమే నేరుగా లాభం చేకూరుతోంది. ఇలా ఖర్చు చేసిన దేశాలు కొద్ది కాలంలోనే దివాళా తీసిన సందర్భాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా చమురు నిల్వలు ఉన్న వెనిజులా దేశం సంక్షేమ పథకాల పేరిట లెక్కకు మించి ఖర్చు చేసి దివాళా తీయడం మనం చూసిందే.
గ్రీసు కూడా మితిమీరిన సంక్షేమ పథకాలతో తీవ్ర కష్టాలలో చిక్కుకుంది. మన పొరుగు దేశం శ్రీలంక పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితులు మనకు రావచ్చునని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వము రాజకీయ ప్రయోజనాలు మానుకుని. ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేయాలి. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని మర్చిపోవద్దు. అలా ఎవ్వరుచేసినా రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే సుమా! కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం కాకుండా, ఉత్పాదన రంగాల అభివృద్ధికి నిజాయితీగా ఖర్చులు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించాలి. లేకపోతే జరిగే నష్టానికి బాధ్యత వహించాల్సి వస్తుంది.
డా. బి కేశవులు ఎండీ
చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం
85010 61659