ఫిల్మ్ తెలంగాణ మొట్టమొదటి ఉత్సవం

by Ravi |   ( Updated:2023-07-15 04:04:45.0  )
ఫిల్మ్ తెలంగాణ మొట్టమొదటి ఉత్సవం
X

ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా తనదయిన చరిత్ర, సంస్కృతి వుంటాయి. ఆ ప్రాంత ప్రజలకు తనదైన ప్రత్యేక జీవన విధానం, ఉపయోగించే ప్రత్యేక భాష వుంటాయి. ఆ విలక్షణత, వైవిధ్యం ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. అలాంటివన్నీ కాలగమనంలో అనేక మార్పులకు లోనవుతాయి. కనుమరుగవుతాయి. ప్రాచీన కాలంలో ఆ చరిత్ర సంస్కృతులను రాళ్లపైన తామ్రపత్రాలపైనా, ఆకులపైన లిఖించి పెట్టారు. అనంతరకాలంలో లిఖిత చరిత్ర అందుబాటులోకి వచ్చింది. అవే మనకు చారిత్రకాధారాలయ్యాయి. వాటి ఆధారంగానే భిన్నమయిన ప్రపంచ చరిత్ర మూలాల్ని తెలుసుకోగలిగాలిగాం. అదే మన ప్రాంతానికీ తెలంగాణాకి కూడా వర్తిస్తుంది.

ఇక్కడి జన జీవితాలు..చూపించి

ఉమ్మడి రాష్ట్రంలో వున్న కాలంలో తెలంగాణ కళలు, చరిత్ర, సంస్కృతి, భాష మరుగున పడ్డాయి. అణచివేతకు గురయ్యాయి. ఫలితంగా ఉద్యమం పెల్లుబుకడం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అదంతా ఒక ఆధునిక చరిత్ర. అయితే ఫిల్మ్ సొసైటీ 1978 నుంచి నవ్య సినిమా, ప్రపంచ సినిమా దృష్టికోణంలోంచే పనిచేసింది. సినిమాను అర్థవంతమైన దృష్టి కోణంలోంచి చూడడమే ప్రధాన కర్తవ్యంగా పని చేస్తూ వచ్చింది. కానీ ఎప్పుడయితే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలయ్యి ఉధృతమవుతున్న దశలో ‘మేము సైతం’ అంటూ కఫిసో ముందుకొచ్చింది. అప్పటికి మేం జాతీయ స్థాయిలో షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ వున్నాం. ఆ నేపథ్యంలోనే అంది వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తెలంగాణా జన జీవితాలకు చెందిన భిన్న కోణాల్ని ప్రపంచానికి చూపించడం కోసం, భావితరాల కోసం నిక్షిప్తం చేయడం అన్న లక్ష్యంతో ఏదైనా చేయాలనే ఆలోచన బలంగా మొదలైంది. దీంతో పాటు తెలంగాణాలో ఉన్న ఉత్సాహవంతులైన దర్శకులకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలన్నది కూడా నా ఆలోచనగా వుండింది. సరిగ్గా అప్పుడే అమెరికాలో లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా కళా సేవా రంగాల్లో కృషి చేస్తున్న ‘డిస్కవర్ తెలంగాణా’ సంస్థతో పరిచయం ఏర్పడింది. ముఖ్యంగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ జయప్రకాష్ తెలంగాణ ముందుకొచ్చిన తీరు మా అందరిలో ఎంతో ఉత్సాహాన్ని ప్రోదిచేసింది. ఆయన సహకారంతోనే ‘ఫిల్మ్ తెలంగాణా’ ఫెస్టివల్ ఆలోచన మొదలైంది. దాన్ని పోటీ ఉత్సవంగా నిర్వహించాలన్న స్ఫూర్తి కలిగింది. అప్పటికి తెలంగాణ సాంస్కృతిక రంగంలో సినిమా దాదాపు అంతరానిదిగానే వుంది. తెలంగాణ జీవితం చరిత్రల్ని వివిధ కోణాల్నుంచీ దృశ్య మాధ్యమంలో నిక్షిప్తం చేయాల్సి వుంది. అందుకే ఫిల్మ్ తెలంగాణా డిజిటల్ షార్ట్ ఫిల్మ్స్‌కి ప్రాధాన్యత నిస్తూ ఫిల్మ్ తెలంగాణా కాంపిటీటివ్ ఫెస్టివల్‌గా రూపొందించాం.

వారు న్యాయ నిర్ణేతలుగా..

ఈ ఫిల్మ్ తెలంగాణా గురించి దానికి ప్రధాన ఆర్థిక, హార్దిక సహకారి అయిన మిత్రుడు జయప్రకాష్ తెలంగాణ మాటల్లోనే చెప్పుకుంటే.. తాను జయప్రకాశ్ తెలంగాణ అని పేరు పెట్టుకుంటేనే అది మీ పేట పేరా, పెట్టు పేరా అని వెక్కిరించారని దానికి తాను పెట్టుకున్న పేరు అని బదులిచ్చానని అన్నారు. దృశ్య మాధ్యమం మీద ఆయనకున్న అభిమానంతో ఫిల్మ్ తెలంగాణ నిర్వహిద్దామని ఈమేయిల్‌లో ప్రస్తావించారు. అప్పటికే ఆయన ప్రారంభించిన డిస్కవర్ తెలంగాణ సాహిత్యం, చరిత్ర సంస్కృతి చలన చిత్రం మొదలైన అనేక రంగాల్లో కృషి చేస్తూ వచ్చింది. కలర్ తెలంగాణ పేర ఆర్ట్ ఫెస్టివల్ కూడా నిర్వహించింది. కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ, డిస్కవర్ తెలంగాణ సంయుక్తంగా ఫెస్టివల్ ప్రకటన ఇచ్చాం. మేం ఊహించిన దానికంటే ఎక్కువ అనూహ్య స్పందన వచ్చింది.

వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ అన్నింటినీ ఆన్‌లైన్ లో పెట్టడం జయప్రకాష్ పని. ఇక్కడ ఫిల్మ్ భవన్‌లో రియల్ ఫెస్టివల్ ఏర్పాటు చేసే బాధ్యత నాది, కఫిసోది. పోటీలో విజేతలకు మంచి నగదు బహుమతులు కూడా ఇవ్వాలని తలపెట్టాం. ఫిల్మ్ కేటగిరీల కింద వనరులు, సంస్కృతి, సమస్యలు, స్థలాలు, ప్రజలు, పోరాటాలు తదితర అంశాలను ఇచ్చాం. ఫెస్టివల్‌లో నాకు గుర్తున్నంత వరకు శ్రీయుతులు రవి గుల్లపల్లి, రవి పులి, రాకేశ్ లత్తుపల్లి, సిద్దార్థ పాములపర్తి, రవి ధన్నపునేని, ఆరి సీతారామయ్య, అమర్ కర్మిల్ల, గోపాల్ అలంకార్, జె.ప్రవీణ్, రవి మేరెడ్డి, విప్లవ్ పుట్ట, శ్రీరామ్ వేదిరె, రాంచంద్రా రెడ్డి‌లు వివిధ స్థాయిల్లో స్పాన్సర్స్‌గా నిలబడ్డారు. ఇదంతా జయప్రకాష్ తెలంగాణ చొరవ వల్లే సాధ్యమైంది. ఇక ఫెస్టివల్‌కి వచ్చిన షార్ట్ ఫిల్మ్స్‌ని వెబ్సైట్‌లో ఉంచడం ఆరంభించాం. మరో వైపు ఫిల్మ్ భవన్‌లో ఉత్సవ ఏర్పాట్లు మొదలు పెట్టాం. ఫెస్టివల్‌కి జ్యూరీ ఛైర్మన్‌గా ప్రముఖ సినీ విమర్శకుడు జర్నలిస్టు శ్రీ చల్లా శ్రీనివాస్, శుభులుగా రచయిత, విమర్శకుడు శ్రీ కె.పి.అశోక్ కుమార్, ప్రముఖ రచయిత శ్రీ పెద్దింటి అశోక్ కుమార్‌లను వ్యవహరించాల్సిందిగా కోరాను. వారు ముగ్గురూ ఎంతో ఉత్సాహంగా సమయమిచ్చి పోటీకి వచ్చిన అన్ని సినిమాలు చూసి తమ న్యాయ నిర్ణయం చేశారు.

బహుమతులు పొందిన చిత్రాలు..

ఇక ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేశాం. అతిథులుగా నందిని సిధారెడ్డి, డాక్టర్ సూరేపల్లి సుజాత, పిట్టల రవీందర్, పెద్దింటి అశోక్ కుమార్‌లు హాజరయ్యారు. ఆ రోజు బతుకమ్మ ఉత్సవాన్ని కూడా ఏర్పాటు చేశాం. అనేక మంది మహిళలు బతుకమ్మలతో ఫిల్మ్ భవన్ ముందు పండుగ వాతావరణాన్ని కలిగించారు. ఇందులో మిత్రుడు కృపాదానం అందించిన సహకారం చాలా గొప్పది. కళాకారుడిగా కళా ఉత్సవ నిర్వాహకుడిగా కృపాదానం ఎంతో కృషి చేశారు. మొదటి రోజు సాయంత్రం గొప్ప ఉత్సవంగా మొదలైంది. ఫిల్మ్ తెలంగాణ సందర్భంగా కఫిసో వెలువరించిన ప్రత్యేక సావనీర్‌ని నారదాసు లక్ష్మణ రావు, నందిని సిద్దారెడ్డి, సోరేపల్లి సుజాత, పెద్దింటి ఆవిష్కరించారు. మరుసటి రోజు ఫిల్మ్ స్క్రీనింగ్స్ కి అతిథులుగా జ్యూరీ మెంబర్స్ చల్లా శ్రీనివాస్, కె.పి.అశోక్ కుమార్, పెద్దింటి అశోక్ కుమార్ లు హాజరయ్యారు. ఈ మొత్తం ఏర్పాట్లలో అప్పటి కఫిసో పక్షాన డాక్టర్ రవికాంత్ మురళి, కోల రాంచంద్రా రెడ్డి, ఏం.ప్రభాకర్, రఘు రామ్, నాగభూషణం, తదితరులు ఎంతో సమయం వెచ్చించి విజయవంతంగా పూర్తి చేశారు. అట్లా మూడు రోజుల తెలంగాణ ఫిల్మ్ ఫెస్టివల్ ఫిల్మ్‌భవన్‌లో విజయవతంగా ముగిసింది.

జ్యూరీ చేసిన ఎంపిక మేరకు డైరెక్టర్ ధన్రాజ్ రూపొందించిన ‘మనోజ్న చిత్రకళా స్రష్ట కొండపల్లి శేషగిరి రావు’ చిత్రానికి ప్రథమ బహుమతి అందచేశాం. బహుమతి కింద 25 వేల రూపాయల నగదు కూడా అందజేశాం కొండపల్లి కోడలు ప్రముఖ కవయిత్రి శ్రీమతి కొండపల్లి నీహారిణి బహుమతిని శ్రీ మాటేటి .లక్ష్మయ్య, చల్లా శ్రీనివాస్ చేతుల మీదుగా అందుకున్నారు. ఇక రెండవ బహుమతిని బెజ్జంకి అనిల్ రావు తన ‘చితికిన బతుకులు’ చిత్రానికి బహుమతిని స్వీకరించారు. జ్యూరీ సభ్యులు కేపీ అశోక్ కుమార్ అందచేశారు. ఇక జ్యూరీ బహుమతుల్ని సిల్వర్ ఫిలిగ్రి చిత్రానికి శ్రీ పోల్సాని వేణుగోపాల్ రావు, వేర్లు చిత్రానికి రమేష్ కుట్టే డాల్ స్వీకరించారు. అట్లా మొత్తం మీద ‘ఫిల్మ్ తెలంగాణ’ ఒక కొత్త ఒరవడిని సృష్టించింది.

- వారాల ఆనంద్

94405 01281

Also Read: గ్రామీణ విద్యార్థిని కలల సాక్షాత్కారం..'కమలి ఫ్రమ్ నడుకావేరి'

Advertisement

Next Story

Most Viewed