- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కష్టాల కడలిలో కర్షకులు..
జై జవాన్ జై కిసాన్ అంటూ నినదిస్తూ దేశ రక్షణ విధులను నిర్వర్తిస్తున్న సైనికుడినీ, మట్టి నుంచి చెమట చుక్కలను చిందించి ఆహారాన్ని అందిస్తున్న రైతునూ కీర్తిస్తూ చెప్పిన లాల్ బహదూర్ శాస్త్రి నినాదం ఎప్పటికీ అజరామరం. కానీ రైతుల పట్ల పాలకుల మాటలు కోతలు దాటుతున్నాయి కానీ, చేతలు గడప దాటడం లేదు. పస్తులు ఉండి వాన, చలి, ఎండ లెక్కచేయక అహర్నిశలు శ్రమిస్తున్న రైతుకు ఆదాయం రెట్టింపు చేసి రైతును రాజు చేస్తామని ఎన్నికలలో ప్రకటించి, గద్దెనెక్కిన తర్వాత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు మూడు చట్టాలను రూపొందించింది. రైతులు దీనిని వ్యతికించడంతో ఏకతాటిపైకి వచ్చి ఏడాది పోరాటం చేయడంతో ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని, రైతుల సంక్షేమం కోసం పాటుపడతామని, మద్దతు ధర అందిస్తామని హామీ ఇచ్చి ఏడాది గడిచినా ఇప్పటికీ అది అమలు పరచడం లేదు.
ప్రభుత్వాలు ఎన్ని మారినా..
ఇప్పటికే వ్యవసాయ రంగానికి ప్రభుత్వ నిధులు, సబ్సిడీలు, బ్యాంకుల ద్వారా అందించే అప్పులు తగ్గిపోయాయి. అలాగే ఎరువుల సబ్సిడీలు ఎత్తివేయడంతో ఎరువుల ధరలలో పెరుగుదల, విద్యుత్ సబ్సిడీలు విత్తనాల, పురుగు మందులతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పాదక ధరలన్ని విపరీతంగా పెరిగిపోయాయి. వ్యవసాయ సాగు ఖర్చులు బాగా పెరిగి రైతుల ఆదాయంపై ప్రభావం చూపడంతో అప్పులపాలైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వరి, గోధుమలకు తప్ప మిగతా ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించడం లేదు. అలాగే వారు పండించిన పంటలో సగమే ప్రభుత్వం కొనుగోలు చేస్తొంది. పాలక ప్రభుత్వాలు ఎన్ని మారినా వ్యవసాయరంగ అభివృద్ధి శూన్యం. రోజురోజుకు పెట్టుబడి వ్యయం పెరగడంతో రైతుల అప్పులు పెరిగిపోతున్నాయి. 2018-19 సంవత్సరంలో దేశంలో సగటున ఒక్కో కుటుంబంపై రూ 74,124 ల రుణభారం ఉందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నా ప్రకటన తర్వాత కూడా దేశంలో 28,572 మంది ఆత్మార్పణ చేసుకున్నారు. మరి ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కట్టుబడి ఉందా లేదా? రైతులపై వారికి అంత చిత్తశుద్ధి ఉంటే 2022-23కు సంబంధించి కిసాన్ సమ్మాన్ నిధులు 10 కోట్ల యాభై లక్షల మందికి పైగా అందిస్తే 12వ విడతలో మాత్రం 8 కోట్ల 42 లక్షల మందికి ఎందుకు తగ్గించారు.
అలాగే కేంద్రం అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయన్న నెపంతో ఎరువుల సబ్సిడీలకు మంగళం పాడితే, ఎరువుల ధరలపై నియంత్రణ కోల్పోయి సుమారు 30 నుంచి 94 శాతం వరకు పెరిగాయి. ఎరువులు అందుబాటులో ఉన్నా కృత్రిమ కొరత సృష్టించినా వ్యవసాయాన్ని వదిలి పెట్టలేక ధరలు పెరిగినా కొంటూ అప్పులపాలవుతున్నారు. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరాలని ఎరువుల సబ్సిడీ వ్యయాన్ని 3.7 కుదించుకోవాలని కేంద్రం ఆలోచించడంతో గత ఏడాదితో పోలిస్తే సబ్సిడీ 26 శాతం తగ్గనుంది.
ఆ రంగాన్ని నిర్మూలించే దిశగా..
కేంద్ర ప్రభుత్వం 'కాకులను కొట్టి గద్దలకు వేస్తున్న చందంగా' అప్పనంగా కార్పొరేట్ల రుణం 19 లక్షల కోట్లు వే ఆఫ్ చేసింది. కానీ రైతు రుణాలు మాఫీ చేయడం లేదు. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం కమ్ముకొస్తున్నాయన్న పరిస్థితులలో ఆహార భద్రతకు ఏర్పాట్లు చేసుకోవాల్సి పోయి, వ్యవసాయ రంగాన్ని నిర్మూలించేదిగా ప్రభుత్వాల పనితీరు ఉండటం విచారకరం. వ్యవసాయ ఆధార జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. పండించిన పంటకు మద్దతు ధర లేక కొంతమంది, కౌలు రైతులకు ఏ ప్రభుత్వ పథక సాయం అందక ఎంతోమంది ఉరికొయ్యను ముద్దాడుతున్నారు. అందుకే వ్యవసాయం చేసే ప్రతి రైతుకు అన్ని రకాల ప్రభుత్వం పథకాలు వర్తింపజేయాలి. వ్యవసాయ రుణాల పరపతి సౌకర్యం ప్రకటించాలి.
వ్యవసాయ రంగ సబ్సిడీలకు కోత విధించవద్దు. స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలి. రైతులు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. అన్నార్తులు అనాధలు లేని ఆ నవయుగమదెంత దూరం..కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలు ఎప్పుడని దాశరథి అన్నట్లు రైతుల ఆత్మహత్యలు లేని రోజే దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది. అంతేకానీ ఓవైపు రైతుల ఆత్మహత్యల ఆర్తనాదాలతో, ఆకలి కేకలతో, ఉపాధి లేక అల్లాడుతుంటే.... దేశం వెలిగిపోతుంది, ప్రగతి పదంలో దూసుకుపోతోందని, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అధిగమిస్తుందని సన్నాయి నొక్కులు నొక్కుకోవడం హాస్యాస్పదం. అన్నదాతల ఆత్మహత్యలు, ఆక్రందనలు నిలువరించబడినప్పుడే దేశాభివృద్ధి సాధ్యం. ఆ దిశగా పాలకులు చర్యలు చేపట్టాలి.
తండ సదానందం
టిఫిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్
99895 84665.