నేటి సామాన్య మహిళ ముఖ చిత్రం

by Ravi |   ( Updated:2024-03-08 00:45:48.0  )
నేటి సామాన్య మహిళ ముఖ చిత్రం
X

అమ్మ గర్భంలో పడినప్పుడు ఆడ శిశువునని దెప్పుతారు. అమ్మాయిగా ఉన్నప్పుడు కామపిశాచులు వెంటాడతాయి. అమ్మగా మారినప్పుడు మగ శిశువును కనలేదని నిందలు. ఇంతేనా, పుట్టింటికి వెళ్లాలంటే పది ప్రశ్నలు, నచ్చింది కొనాలంటే వంద అనుమతులు.. ఇది నేటి సామాన్య మహిళా ముఖ చిత్రం. అందరి పరిస్థితి ఇలా ఉండకపోవచ్చు. కొందరి విషయంలో ఇది నిజం...! .

ఇలా చెప్పుకుంటే చాలా సందర్భాల్లో, రంగాలలో మహిళలు వివక్షతకు గురవుతూనే ఉన్నారు. ఇక అక్కడితోనే ఆగడం లేదు. ఆర్థిక స్వాతంత్రం ఉన్నా ఖర్చు చేయడం మాత్రం మగవారి కనుసన్నల్లోనే. కొందరు మహిళలు రాజకీయ పదవులకు ఎన్నికైనా అధికారం చలాయించేది మాత్రం వారి ప్రతినిధులే..! అధిక శాతం సమాజంలో కనిపిస్తున్న తీరు. ఇది ఇప్పటి సమస్య కాదు. అనాదిగా మహిళలు అనుభవిస్తున్న వ్యధ. వాస్తవం చెప్పాలంటే సమాజం ఈ ఒక్క రోజు మాత్రమే స్త్రీల గురించి ఆలోచిస్తుంది. తర్వాత షరా మామూలే.

సాధికారతే స్వతంత్రత

ఈ రోజు మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలను జరుపుకునే ప్రపంచ దినోత్సవం. మహిళా సాధికారత సాధించాలంటే రాజకీయంగా, విద్యాపరంగా, ఆర్థికంగా , సామాజికంగా, భౌతికంగా రాటుదేరాల్సిందే. సాధికారత అంటే ఒకరి దయా దాక్షిణ్యాల మీద అనుమతుల మీద ఆధారపడాల్సిన అవసరం లేని స్వాతంత్ర వైఖరితో ఇతరులతో సమాన స్థాయిలో వ్యవహరించగలగడం, నిర్ణయాలు తీసుకోగలగడం. భావజాలపరమైన అడ్డుగోడలు లేకుండా సామాజిక వాతావరణం కలిగి ఉండడం. స్త్రీవాదం కేవలం స్త్రీలకు సంబంధించినది కాదు. దీనికి అందరి సహాయ సహకారాలు అవసరం.

స్త్రీ సమానత్వం అందరిదీ..

సమానత్వం కోసం మహిళల పోరాటం ఏ ఒక్కరి లేదా ఏ ఒక్క సంస్థకు చెందినది కాదు. మానవ హక్కుల గురించి పట్టించుకునే వారందరి సమిష్టి కృషికి సంబంధించినది. ప్రతి మహిళ యొక్క విజయం మరొకరికి స్ఫూర్తిగా ఉండాలి. మహిళలు అధికారం సాధించే కొద్దీ అడ్డంకులు తగ్గుతాయి. మహిళల హక్కులు, లింగ సమానత్వం సాధించడానికి మహిళల ఆర్థిక సాధికారత అవసరం. మహిళలు, బాలికల విద్యాసాధనను పెంపొందించడం మహిళల ఆర్థిక సాధికారతకు, మరింత సమగ్రమైన, పర్యావరణపరంగా స్థిరమైన ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది.

ఉయ్యాలలూపే చేతులు ఉట్టిని కూడా...

ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్టసభ సభ్యులలో మహిళలు దాదాపు 26% ఉన్నారు. భారతదేశంలో పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యం 14%. పార్లమెంట్ దిగువ సభ లో పనిచేసే మహిళల శాతం పరంగా 193 దేశాలలో భారతదేశం 149వ స్థానంలో ఉంది . జనాభాలో సగం మంది మహిళలు ఉన్న దేశంలో, భారతదేశానికి లోక్‌సభలో 14% మరియు రాజ్యసభలో 11% ప్రాతినిధ్యం ఉంది. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023లో, భారతదేశం 146 దేశాలలో 127 వ స్థానంలో ఉంది. 1952లో మొదటి లోక్‌సభకు ఎన్నికైనప్పుడు మహిళలు 4.4% మాత్రమే ఉన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ సంఖ్య కేవలం 12.15%కి పెరిగింది. ప్రస్తుత లోక్‌సభలో 543 మంది ఎంపీలలో మహిళలవాటా 14.36 మాత్రమే. ఇది ఇంకా పెరగాలంటే ఆమోదం పొందినా అమలుకు నోచుకోని చట్టసభలలో మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి.

(మహిళా దినోత్సవం సందర్భంగా...)

కింజరాపు అమరావతి

94945 88909

Advertisement

Next Story

Most Viewed