నీట్‌తో.. ఏపీకి చేటు

by srinivas |
నీట్‌తో.. ఏపీకి చేటు
X

నీట్ ఆల్ ఇండియా కోటాలో ప్రవేశించడానికి ప్రతి రాష్ట్రం తమ ప్రభుత్వ మెడికల్ కాలేజీలల్లోని 15% సీట్లను ఆల్ ఇండియా కోటాకు కేటాయించాలి. 2018లో నీట్ ఆల్ ఇండియా కోటాలో ఆంధ్రప్రదేశ్ ప్రవేశించేటప్పుడు అది మనకు లాభదాయకం అవుతుందని ఇక్కడ ఉన్న విద్యావేత్తలు అందరూ భావించారు. అన్ని పోటీ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తుంటారు కనుక మన విద్యార్థులకు ఇక్కడ సీటు రాకపోయినా వేరే రాష్ట్రాలలో అధిక సంఖ్యలో ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని అనుకున్నారు. కానీ వాస్తవ గణాంకాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించి నీట్ ఆల్ ఇండియా కోటా వల్ల కలుగుతున్న లాభనష్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి మన రాష్ట్ర విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సముచిత నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉంది.

గత సంవత్సరం (2023)లో జరిగిన ఆల్ ఇండియా కోటా మెడికల్ అడ్మిషన్లను విశ్లేషణ చేయగా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. గత సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్ల (2935)లో 15% అనగా 440 సీట్లు ఆల్ ఇండియా కోటాకి కేటాయించారు. అయితే ఆల్ ఇండియా కోటాలో మన విద్యార్థులు పొందిన సీట్లు కేవలం 165. వారిలో 85 మంది మన రాష్ట్రంలోని వివిధ మెడికల్ కాలేజీల్లో చేరారు. ఇతర రాష్ట్రాల్లో చేరిన మన విద్యార్థుల సంఖ్య కేవలం 80 మంది. మన రాష్ట్రం నుండి అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్, జిప్మర్, బి హెచ్ యు లాంటి జాతీయ వైద్య కళాశాలలో చేరుతున్నారు. మనం 15% ఆల్ ఇండియా కోటా పూల్‌లో లేకపోయినా జాతీయ వైద్య కళాశాలలో ప్రవేశించే అర్హత మనకు ఉంటుంది.

ఇక్కడి మెడికల్ కాలేజీలే మెరుగు..

జాతీయ వైద్య కళాశాలలో సీట్లు భర్తీ అయిన తర్వాత మన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చేరడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొద్దిమంది మాత్రం హైదరాబాదు, చెన్నై, బెంగళూరు. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చేరుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, భోధనా విధానాలు మన రాష్ట్రం కన్నా మెరుగుగా లేకపోవడం వలన మిగిలిన విద్యార్థులంతా మన రాష్ట్రంలో ఉన్న ఆంధ్రా మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూల్ మెడికల్ కాలేజ్, తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఆల్ ఇండియా కోటాలో పోటీ తీవ్రం..

ఆల్ ఇండియా కోటాలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని కేవలం 15% సీట్లు మాత్రమే ఉంటాయి కనుక పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. 20 నుండి 25వేల ర్యాంకులకే జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ సీట్లన్నీ భర్తీ అయిపోతున్నాయి. అదే మన రాష్ట్రంలో 60 నుండి 70 వేల ర్యాంక్ వరకు జనరల్ సీటు వచ్చే అవకాశం ఉంది. కనుక ఇక్కడ సీటు రాని వారికి ఆల్ ఇండియా కోటాలో దేశంలోమరెక్కడా సీటు వచ్చే అవకాశం లేదు. ఉత్తరాది రాష్ట్రాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చాలా తక్కువగా ఉండడం, విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం వలన అక్కడ పోటీ తీవ్రత మన కన్నా చాలా ఎక్కువగా ఉంది. కనుక ఆయా రాష్ట్రాల్లో మెడికల్ సీట్లు రాని విద్యార్థులు అందరూ మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలోని 15% ఆల్ ఇండియా కోటా సీట్లలో జాయిన్ అవుతున్నారు. దీని వలన మనం నికరంగా 250 మెడికల్ సీట్లను కోల్పోతున్నాము. గతంలో ఆల్ ఇండియా కోటాలో రెండవ రౌండ్ తర్వాత మిగిలిన సీట్లను ఆయా రాష్ట్రాలకే తిరిగి ఇచ్చేవారు. అప్పుడు మనకు దాదాపు 100 సీట్లు వరకు తిరిగి వచ్చేవి, కానీ ప్రస్తుతం ఆఖరి సీటు వరకు కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేస్తుంది.

నిపుణుల కమిటీ వేయాలి..

ఈ నష్టం పీజీ మెడికల్ సీట్లలో చాలా ఎక్కువగా ఉంది. పీజీ స్థాయిలో మనం ఆలిండియా కోటాకి మన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న 50 శాతం సీట్లను కేటాయిస్తున్నాము. అక్కడ కూడా ఇవే కారణాలవల్ల ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న మన విద్యార్థుల సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఇకనైనా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించి నీట్ ఆల్ ఇండియా కోట వల్ల కలుగుతున్న లాభనష్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి మన రాష్ట్ర విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సముచిత నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉంది.

డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు

రాష్ట్ర అధ్యక్షులు,

ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్.

73373 02256



Next Story