- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వచ్చేది పరీక్షా కాలం!

అక్షరానికి తూకం వేసే కాలం అదే... పరీక్షల కాలం వచ్చేసింది. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణ యించే తరుణం ఇది. మార్చి 5 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు.. మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు కొనసాగుతాయి.. ఆ తర్వాత వచ్చే డిగ్రీ, పీజీ, తదితర పోటీ పరీక్షలు రెండు మూడు నాలుగు నెలల్లో జరుగుతాయి.
మంచి వాతావరణం కల్పిస్తే..
పిల్లలు చదివిన చదువులను పరీక్షలతో కొలుస్తున్నాం. ఏడాదంతా తరగతిలో విని, చదివి, వీటిని మళ్లీ పునఃశ్చరణ చేసుకొని ఏకాగ్రతతో పరీక్షల్లో బాగా రాసి మంచి మార్కులు సాధించుకోవాలని తపన వల్ల విద్యార్థులు ఒత్తిడికి లోనవుతారు. పాలకులు, అధికారులు పరీక్షల నిర్వహణ సౌకర్యాలతో పాటు మంచి వాతావరణం కల్పిస్తేనే ఒత్తిడికి లోను కాకుండా ఉత్సాహంగా పరీక్షలు రాస్తారు. అందుకే పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి కొరత లేకుండా చూడాలి. పరీక్షల నిర్వహణ, ప్రశ్న పత్రాల ముద్రణ, మదింపు నుండి ఫలితాల ప్రకటన వరకు నిర్వాహకులు, అధికారులు ఓ మహాక్రతువులా భావించాలి. విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలి. విద్యార్థులు ఈ పరీక్షలను పండుగలా భావించాలి తప్ప అవి జీవితానికి యమగండంగా పరిణమించకూడదు.
మార్కులు సాధించడమే లక్ష్యమా?
వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులై మార్కులు సాధించడమే లక్ష్యంగా లక్షలాది మంది విద్యార్థులు ఒత్తిడి, మానసిక ఆందోళన, తీవ్ర భావోద్వేగాలతో ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పాఠ శాల విద్యార్థులలో విపరీత ఆందోళనకు పరీక్షలు, ఫలితాలే కారణం అవుతున్నాయని ఎన్‌సీఈఆర్‌టీ అధ్యయనాల్లో తేలింది. వాస్తవంగా చదువుల ప్రాథమిక లక్ష్యం.. విద్యార్థుల మనోవికాసం, సృజనాత్మకంగా పరిష్కార సాధనకు ప్రయత్నించేలా విద్యార్థిని తీర్చిదిద్దితేనే బోధన సార్థకమైనట్లు. ఎటువంటి ఆసక్తులు, నైపుణ్యాలు కలిగిన వారు ఏం చదివితే ఎందులో రాణిస్తారో లాంటి పరిస్థితిలను విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సి ఉంది. పునాది చదువుల నుంచి బలోపేతం చేయాల్సి ఉంది.
25 లక్షల మంది భవిష్యత్ పోరు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు పరీక్షల పోరుకు సిద్ధమవుతున్నారు. వీరికి అండగా నిలిచే తల్లిదండ్రులు, పరీక్షల సమరానికి సిద్ధం చేసే ఉపాధ్యాయులు ఇతరులు కలిసి మరో కోటి మంది ఈ క్రతువులో భాగస్వాములు అవుతారని అంచనా! ఇందుకోసం విద్యాసంస్థలు ప్రత్యేక తరగతులు, మోడల్ టెస్టు లతో ఫలితాల తరాజులో మొగ్గు తమవైపే ఉండేలా విద్యార్థులను సన్నద్ధం చేసే పని ఉన్నారు. వచ్చే నాలుగు నెలల్లో టెన్త్, ఇంటర్‌తో పాటు డిగ్రీ, పీజీ పరీక్షలు ఎన్నో అర్హత పరీక్షలు జరుగుతాయి. ఇలా జూన్ వరకు పరీక్షలే పరీక్షలు జరుగుతాయి. విద్య, వైద్యం, రెవెన్యూ, రవాణా, పోలీస్.. తదితర శాఖలకు ఇది పరీక్షా కాలమనే చెప్పాలి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా పొలిటికల్ హీట్ ఆకాశాన్నితాకుతుంది. దీంతో పరీక్షల దగ్గర నుంచి ఫలితాలు వెల్లడి వరకు టెన్షను తప్పని పరిస్థితి!
రేపటి తరం భవిష్యత్ పరీక్షలు..
విద్యార్థులకు ఇంకో మాట. మార్కులే ప్రతిభకు కొలమానం కానే కాదు. పరీక్షలు రాయబోయే ఏ ఒక్క విద్యార్థి నిరాశ, నిస్పృహలకు లోను కావద్దు. విలువ కట్టలేనిది విశ్వంలో ఏదైనా ఉన్నదంటే.. అది ప్రాణం ఒక్కటే. ఆత్మవిశ్వాసం కన్న గొప్ప ఆస్తి లేదు. ఉన్నది ఒక్కటే జీవితం సంపూర్ణంగా జీవించాలి. చదువులు మనిషికి విలువలద్దాలి, సమగ్రంగా ఉన్నతీకరించాలి. ఈ ఆధునిక సమాజంలో మంచి వ్యక్తుల అవసరం ఎంతో ఉంది. మార్కులే అంతిమ కొలమానం కాదు. పరిపూర్ణ వ్యక్తిత్వంతో మహనీయులు కండి. అభ్యుదయ వైపు నడవాలి... అదే అంతిమ లక్ష్యం కావాలి.
మేకిరి దామోదర్,
95736 66650