ప్రజాస్వామ్యం పరిహాసం!

by Ravi |   ( Updated:2023-07-28 00:01:06.0  )
ప్రజాస్వామ్యం పరిహాసం!
X

కండ బలానికి కలం గజగజ వణుకుతున్నది. నోటును చూసి ఓటు తలవంచుతుంది. ఎన్నికల్లో రక్తపాతం అనివార్యం అవుతుంది. బ్యాలెట్‌ బాక్సులు అసాంఘిక శక్తుల చేతిలో విలవిల్లాడుతూ విచ్ఛిన్నం అవుతున్నాయి. ధనస్వామ్యం ముందు ప్రజాస్వామ్యం వెలవెలబోతున్నది. రాజ్యాంగం పుస్తకాలకు మాత్రమే పరిమితం అవుతున్నది. బాంబులు క్యూలైన్లను కూలదోస్తున్నాయి. రిగ్గింగులు సర్వసాధారణం అవుతున్నాయి.

అసాంఘిక శక్తులు రెచ్చిపోవడంతో...

ప్రస్తుతం దేశంలో రాజకీయం రాక్షస రంగును పులుముకుంటున్నది. రాజకీయ నాయకులు రావణాసురులను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ధన, కండ బలాలే ఎన్నికలను శాసిస్తున్నాయి. రాజకీయ హింసాత్మక కత్తులు దినదినం పదునెక్కుతున్నాయి. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలు ఈ విషమ విషయాలను రుజువు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తృణముల్‌ కాంగ్రెస్‌ విజయభేరి మోగించిన విషయం మనకు తెలుసు. ఈ ఎన్నికలు ప్రకటించిన రోజు నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు సుమారు 45 మంది రాజకీయ హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. అంటే ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం పరిహాసం పాలయ్యింది. బూత్‌ ఆక్రమణలు, రిగ్గింగ్‌, బ్యాలెట్‌ బాక్సుల అపహరణ, విధ్వంసం, బాంబుల మోతలు, అసాంఘిక శక్తులు రెచ్చిపోవడం లాంటి అనేక ఘటనలు నమోదు అయ్యాయి. రాజకీయ నాయకులు ప్రోత్సహించిన హింసాత్మక ఘటనల్లో వేలల్లో గాయపడడం, చివరికి కనీసం 45 మంది చనిపోవడం అత్యంత విచారకరం. గతంలో మిలటరీ డేగ కన్ను వ్యాపించిన అస్థిర జమ్ము కాశ్మీర్‌ ప్రాంతాల్లో ఎన్నికల హింసాత్మక ఘటనలు అధికంగా నమోదు అయ్యేవి. కానీ పశ్చిమ బెంగాల్‌లో 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో 365 హింసాత్మక ఘటనలు, 2018 పంచాయతీ ఎన్నికల సందర్భంగా 44 మరణాలు జరిగినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లోనూ సుమారు 44 మంది చనిపోవడం విచారకరం.

వివిధ రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు

2016 నుంచి నేటి వరకు వివిధ రాష్ట్రాల్లో నమోదైన అసాంఘిక సాయుధ శక్తుల దాడులు, ప్రదర్శనలను అదుపు చేసే దుర్ఘటనలు, ఆస్తుల ధ్వంసం, అల్లరి మూకల భయానక దుశ్చర్యలు, అరెస్టులు లాంటి పలు రాజకీయ హింసాత్మక ఘటనలను పరిశీలించినపుడు దేశంలో ప్రజాస్వామ్యం పతన స్థాయికి చేరుతున్నదనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి. 2016 - 2023 మధ్య కాలంలో, ముఖ్యంగా జనరల్‌ ఎలక్షన్లలో జమ్మూ కాశ్మిర్, పశ్చిమ బెంగాల్‌, యూపీ, పంజాబ్, బీహార్‌, అస్సాం, త్రిపుర, చత్తీస్‌ఘడ్‌, కేరళ‌ లాంటి రాష్ట్రాల్లో అత్యధిక రాజకీయ హింసాత్మక ఘటనలు జరిగాయని వివరాలు వెల్లడిస్తున్నాయి. 2016 నుంచి నేటి వరకు జరిగిన పార్లమెంట్‌, అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో జమ్ము-కశ్మీర్‌లో 8,301, పశ్చిమ బెంగాల్‌లో 3,338, యూపీలో 2,618, పంజాబ్‌లో 2,040 రాజకీయ హింసాత్మక ఘటనలు నమోదు కావడం గమనార్హం. అతి తక్కువ హింసాత్మక ఘటనలు నమోదైన రాష్ట్రాల జాబితాలో హిమాచల్‌, ఉత్తరాఖండ్‌, తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, గోవా, అరుణాచల్‌, సిక్కిం, మేఘాలయా, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలు 2016 నుంచి నేటి వరకు 700 కన్న తక్కువ ఘటనలను నమోదు చేశాయి.

ప్రజాస్వామ్యానికి ఎన్నికలే పునాది. రాజ్యాంగ విలువలకు పట్టం కట్టడం మన కనీస కర్తవ్యం కావాలి. ప్రశాంత వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేయగలిగితేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. రాక్షస రాజకీయ నాయకులను మట్టు పెట్టి నైతిక రాజకీయాలకు మందిరం కట్టాలి. మనం కలలు కనే హింస కానరాని భవ్య భారతం మన కళ్ల ముందుండాలి. రాజకీయ హింసకు మంగళం పాడుతూ జనస్వామ్యం జెండా ఎగురవేయాలి. జై హింద్‍ అంటూ ప్రతి గళం సగర్వంగా నిలబడాలి.

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి

99497 00037

Advertisement

Next Story

Most Viewed