- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్నికల మ్యానిఫెస్టోల్లో..సంక్షేమమేనా? ఉపాధి వద్దా?
తెలంగాణలో ఎన్నికల కోడ్ కూసింది. దీంతో ప్రజలకు ఏం చేస్తామో తెలుపుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలను విడుదల చేశాయి. బీజేపీ ఎన్నికల ప్రణాళిక వీటికి భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. అయితే, ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రణాళికలో పేర్లు వేరైనప్పటికీ సామాన్య అంశాలు చాలా ఉన్నాయి. ఆసరా పథకం, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్, రైతుబంధు, కళ్యాణలక్ష్మి, స్వంత ఇల్లు మొదలైనవి వీటిలోని సామాన్య అంశాలు. వీటిల్లో ఉపాధి కల్పన గురించి ప్రత్యేక శ్రద్ధ, ఆసక్తి ఈ ప్రణాళికల్లో లేవు. ఓటర్లకు ఆకర్షణీయంగా ఓట్లు వేయించుకోవడానికి పరిమితమైన సంక్షేమ పథకాలు బడ్జెట్ కేటాయింపు వీటిలల్లో కనబడుతుంది. పదేళ్ళ క్రితం లక్షలాది మంది విద్యార్థులు, యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూశారు. ఈ పదేళ్ళలో అలా చూసేవాళ్ళు రెట్టింపయ్యారు. అయినా వీరి గురించి ఎన్నికల ప్రణాళికల్లో లేదు. కుల వృత్తులవారీగా చేపడుతున్న పథకాలు విద్యావంతులకు సంబంధించినవి కావు, విద్యావంతులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉపాధి కల్పన కోసం చిన్నకారు పరిశ్రమలు, వ్యాపారాలు, టాక్సీ సర్వీస్ సెక్టార్ లోన్ల గురించి ఊసే లేదు. ఐదారేళ్లుగా వీటికి బడ్జెట్లే లేవు.
వారికెందుకు సాయం!
వ్యవసాయం కోసం సాయం పేరిట లక్షకోట్లకు పైగా ధనం ఇచ్చేసినా, రైతు ఆత్మహత్యలు ఆగుతున్నాయా? చేతివృత్తులు చేసుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వారిని పట్టించుకున్నారా? నిజానికి ఐదెకరాల లోపు రైతులకు రైతుబంధు అవసరమే! కానీ వందల ఎకరాలకు రైతుబంధు ఎందుకు? ఎవరబ్బ సొమ్మని వీరికి ఇస్తున్నారు? ఆ భూమి దున్నే కౌలుదారులకు ఈ సొమ్మని కేటాయించవచ్చు కదా!
ధరణి వల్ల పేదలు వ్యవసాయ భూమి కోల్పోయారు. ఈ పద్ధతి ద్వారా 40 శాతం మంది భూములు కిరికిరిలో పడ్డాయి. దీనివల్ల లక్షలాది ఎకరాలు పేద ప్రజల నుండి తిరిగి భూస్వాముల పరమయ్యాయి. కానీ దీనిపట్ల వామపక్షాలు, మావోయిస్టులు, నక్సలైట్లు మాట్లాడకపోవడం చాలా విషాదకర విషయం. అందుకే దీనిని రద్దు చేసి పాత విధానంలోకి తిరిగి రికార్డులను మార్చాలి.కమ్యూనిస్టులు, నక్సలైట్లు దశాబ్దాలుగా ఎన్నో ఉద్యమాలు చేసి, సాధించిన రాళ్ళు రప్పల భూమిని పేదలు సాగుయోగ్యం చేసుకున్న తర్వాత ఆ భూమిని అప్పనంగా ప్రభుత్వం, భూస్వాములు కైంకర్యం చేసుకోవడానికి రైతుబంధు, ధరణి ఉపయోగపడుతున్నాయి. ఒక్క కలం పోటుతో లక్షలాది రైతాంగం ఉద్యమాల ఫలాలను నీరుగార్చి వమ్ము చేసిన గొప్ప మోసపూరిత పథకం రైతుబంధు, ధరణి..
వీరి సంక్షేమం వద్దా?
ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితం. అయితే, వాటిని కూడా సరిగా నింపడం లేదు. నిరుద్యోగ భృతి లేదు. ఆసరా పథకం కింద మూడు వేలు, ఐదు వేలు ఇచ్చే పథకానికి కూడా నిరుద్యోగులు పనికిరావడం లేదు. విద్యావంతులు అంతా సంఘటితంగా, అసంఘటితంగా ఉండిపోతున్నారు. వారిని పట్టించుకునేవారే లేరు. ముప్పై లక్షలమంది నిరుద్యోగులుగా ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్నారు. ఇందులో చాలామేరకు ఇతర ఉద్యోగాలు చేస్తున్నవారే అని కేటిఆర్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. అది నిజమే. అయితే అర్హతకు తగిన ఉద్యోగం, ఉపాధి కోసం ప్రతి ఒక్కరు తన్లాడతారు. దానికి చేయూతనివ్వడం ప్రభుత్వం, సమాజం బాధ్యత. ఉన్నత విద్యావంతులు పిడకలు చేసుకొని, బజ్జీలు చేసుకొని, ఇడ్లీలు చేసుకొని బతుకవచ్చు అని చెప్పే మాట హాస్యాస్పదమైనది. విద్య అర్హతకు సరియైనటువంటి కల్పనే సమాజం ఎదగడానికి, సంపద పెరగడానికి తోడ్పడుతుంది. కేంద్ర నాయకులకు, రాష్ట్ర నాయకులకు ఈ విషయం తోచకపోవడం విషాదకరం. ప్రభుత్వం ఎన్ని ఆకర్షణీయ పథకాలు పెట్టినా చాలా సెక్షన్లు ప్రభుత్వ పథకాల వెలుపలే ఉండిపోయాయి. ఉదాహరణకు ఆటో డ్రైవర్లు, కారు డ్రైవర్లకు ఓన్ యువర్ ఆటో, ఓన్ యువర్ క్యాబ్ స్కీమ్ పెట్టి తోడ్పడితే పదిహేను లక్షలమంది డ్రైవర్లకు ఆదాయం రెట్టింపవుతుంది. అలాగే ఇండ్లల్లో పనిచేసే మహిళా కార్మికులు రోజుకు మూడు, నాలుగు ఇండ్లల్లో పనిచేస్తారు. అయినా, వారికి ఇచ్చే వేతనం అతి తక్కువ. వీరికి అసరా పథకం ఇవ్వాలని ఎవరికీ తోచడం లేదు. కనీసం వారికొక గుర్తింపు కార్డు, ప్రావిడెంట్ ఫండ్ పెట్టాలని తోచడం లేదు. అలాగే బీడీ ఆకు తెంపే గిరిజనులు, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు రావాల్సిన బోనస్‌లు, చేయూత గురించి చర్చే లేదు. అలాగే గల్ఫ్‌లో 35 లక్షలమంది ఉపాధి పొందారు. పొందుతున్నారు. అనగా సుమారు కోటిమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ వలసలపై ఆధారపడి బతుకుతున్నారు. వీరి సంక్షేమం కోసం ప్రత్యేకమైన ప్రణాళికలేమీ లేవు. వారు తెచ్చే విదేశీ మారక ద్రవ్యం కేంద్రానికి, రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడుతున్నది. అందులో సగమైనా, పావు వంతైనా వీరి సంక్షేమం కోసం, వీరి కుటుంబాల అభ్యున్నతి కోసం, జీవన భద్రత కోసం అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత నూతన ఉపాధి, నైపుణ్యాలు సాధించుకోవడం కోసం ప్రత్యేక శిక్షణ, చేయూత, సబ్సిడీ మొదలైనవి వాటి గురించిన ఆలోచనే లేదు. మొత్తం ఎన్నికల ప్రణాళికలో బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల నిర్లక్ష్యమే కనబడుతుంది.
సంపద పెంపు..ఊసేలేదు
2004 నుంచి గత ఇరవై ఏళ్ళుగా లక్షలాది విద్యార్థులు, యువకులు- తెలంగాణ రాష్ట్రం వస్తే ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయి అని అనుకున్నారు. వారి ఆశలు నెరవేరలేదు. పీహెచ్‌డి చేసినవాళ్ళు పోలీసు ఉద్యోగాలకు అప్లయ్ చేశారు.అన్ని యూనివర్శిటీలలో 75 శాతం దాకా అధ్యాపకులే లేరు. లక్షలాది మంది చదువుకున్న వినియోగించుకోవడం కోసం ప్రణాళికలు చేపట్టి పని కల్పించడం ప్రభుత్వం బాధ్యత. ఈ విషయంలో ఏ పార్టీ మాట్లాడటం లేదు.
అసంఘటిత కార్మికులను ప్రభుత్వాలు అసలుకే పట్టించుకోవడం లేదు. కూలీలకు ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఏర్పాటు చేసి అన్ని సబ్సిడీలను ఆయా పథకాల నగదును ఇందులో జమచేసి అన్నిటికీ ఆధార్ కార్డ్ వలె సమగ్రంగా ఉపయోగపడే విధంగా ఈ స్కీమును ప్రవేశపెడితే ప్రజల పొదుపు పెరుగుతుంది. ప్రజలకు భరోసా పెరుగుతుంది.
2004లో అనేక పార్టీలు ఎన్నికల ప్రణాళికలో ఏం చేర్చాలని విద్యావంతులను, మేధావులను వ్యక్తిగతంగా అడిగేవి. ఇప్పుడు తమకు తామే నిర్ణయించుకుంటున్నారు. అప్పుడు పనికి వచ్చిన మేధావులు ఇప్పుడు పనికిరాకుండా పోయారు. రాజకీయ, ఓటు బ్యాంకు ప్రయోజనాలు తప్ప, సామాజిక ప్రయోజనాలు, సామాజిక అభివృద్ధి, సంపద పెంపు సంబంధించిన అంశాలు ప్రధాన పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోలో లేకుండా పోయాయి. ఇదొక దురదృష్టకర పరిణామం. ఇప్పటికైనా ఆయా పార్టీలు ఆయా రంగాల నిపుణులను సంప్రదించి సంపద పెంపు గురించి, ఉపాధి కల్పన గురించి, అసంఘటిత ప్రజల జీవన భద్రత గురించి ఉన్నత విద్యావంతులకు ఉద్యోగ కల్పన గురించి ఆలోచనలను సేకరించడం ఎంతో అవసరం.
బీఎస్ రాములు
83319 66987