ఎన్నికల హామీ పత్రం చట్టబద్ధం చేయాలి!

by Ravi |   ( Updated:2023-10-17 23:45:25.0  )
ఎన్నికల హామీ పత్రం చట్టబద్ధం చేయాలి!
X

న్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల పత్రం కీలకమైనది.అది చట్టబద్ధం కావాలి.హామీలు ఇచ్చే పార్టీలు గెలుపు కోసం ఇస్తున్నాయా లేక ప్రజల సంక్షేమం కోసం ఇస్తున్నాయా అనేది ప్రజల దృష్టిలో ప్రధానం. అందుకే అవి చట్టబద్ధంగా ఉండాలి. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర ఒక సాధనం. రాజకీయనాయకులకు ఇటీవల పాదయాత్రలు చేయడం పరిపాటి అయింది. పాదయాత్ర లక్ష్యం ప్రజలతో మమేకం అవడం, వారి పరిష్కారం కాని దీర్ఘకాల సమస్యలు తెలుసుకోవడం. గాంధీ మహాత్ముని స్ఫూర్తిగా వైఎస్ రాజశేఖరరెడ్డి 2003లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి సంచలనం సృష్టించారు.

అధికారంలోకి రాగానే..

ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రజల సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని వాటిని ఆధికారంలోకి రావడంలోనే ఆచరణలో చూపారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, విద్యా కానుక (ఉన్నత విద్య చదివే బీద పిల్లలకు ఫీజు మొత్తం చెల్లింపు), ఆసరా పింఛన్లు వంటివి బడుగు, బలహీన వర్గాలకు భారీ ఊరట కలిగించాయి. మధ్యతరగతి, బడుగు వర్గాల పిల్లలు ఉన్నత విద్య చదవడం ద్వారా భవిష్యత్‌లో వారి కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలిగింది. విద్య,వైద్యం ఈ వర్గాలకు అందించడం ద్వారా నిజమైన సంక్షేమం జరిగింది. కానీ నేడు నాయకులు పాదయాత్ర పేరుతో ఊరేగింపులు చేస్తున్నారు. కొంతమంది బస్సు యాత్ర చేస్తున్నారు. కేవలం వారు ప్రచారమే ప్రధానంగా యాత్రలు చేస్తున్నారు తప్ప ప్రజలను కలవడానికి,వారి సమస్యలు తెలుసుకోవడానికి కాదు. వైఎస్‌ఆర్ తరువాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జగన్,షర్మిల ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రల వల్ల ప్రజలు పాలకుల నుంచి ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోవచ్చు. కానీ నేడు పాదయాత్రలో నాయకుల దరికి సామాన్యుడు చేరి తమ సమస్యలు చెప్పే పరిస్థితి ఉందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. నాయకుల చుట్టూ బౌన్సర్లు ఉంటున్నారు మరి. వారు గ్రహించిన సమస్యలను క్రోడీకరించి ఎన్నికల హామీ పత్రం రూపకల్పన చేయాలి. కానీ నేటి నాయకులు ప్రజల అసలు సమస్యలు వదిలి ఓట్ల కోసం అడిగింది, అడగనివి హామీ పత్రంలో పెడుతున్నారు. కానీ తీరా అధికారంలోకి రాగానే నిధులు కేటాయించలేక చతికిలపడుతున్నారు. ఏవేవో నిబంధనలు పెట్టి లబ్ధిదారుల సంఖ్య నామమాత్రం చేసి, అందరికీ ఇస్తున్నట్లు గొప్పగా ప్రకటనలు ఇస్తున్నారు. దీంతో అవి అందని ప్రజలు నిరాశ పడుతున్నారు.

ప్రజల సొమ్మును వితరణ చేస్తూ..

అందుకే హామీ పత్రంలో మొదటే నిబంధనలతో కూడిన హామీలు చేర్చాలి. హమీ పత్రానికి చట్టబద్ధత కల్పించాలి. అప్పుడే ప్రజలకు నమ్మకం కలిగి ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయించుకుంటారు. అప్పుడే సాధ్యమైన, నిజమైన హామీలు ఆయా రాజకీయ పార్టీలు ఇస్తాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చుతాయి. ప్రజలకు సంక్షేమం అందుతుంది. హామీలు ఇచ్చేవారు గెలుపు కోసం కాకుండా ప్రజల కోసం ఇస్తారు. నిజమైన బాధితులకు సహాయం అందుతుంది. ప్రజల సొమ్ము నాయకులు తమ సొంత సొమ్ములాగా విచక్షణ లేకుండా పంచడం న్యాయం, అభిలషణీయం కాదు. అధికారంలో ఉన్న నేతలు ప్రజల సొమ్ము ప్రతి పైసాకు లెక్క చెప్పాలి. అధికారంలోకి రాకముందు ఒకలాగా, వచ్చిన తరువాత మరో రకంగా చేస్తున్నారు. ప్రజల సొమ్ము సంతర్పణలాగా వితరణ చేస్తున్నారు. అలా కాకుండా ఉండాలంటే తప్పక ఎన్నికల హామీ పత్రాన్ని చట్టబద్ధం చేయాలి. అందుకు రాజకీయ పార్టీలు,నాయకులు సహకరించి ప్రజల సంక్షేమం కోసం కలిసి రావాలి. అప్పుడే వారు ప్రజల హృదయాల్లో కలకాలం ఉంటారు. ఓటర్లు కూడా కొన్ని పార్టీలు ఇచ్చే ఉచితాలు కేవలం తాత్కాలికం గా గుర్తించి నిజమైన సంక్షేమం ఇచ్చే పార్టీలకు పట్టం కట్టాలి. అప్పుడే ప్రజలు కలలు కనే రామరాజ్యం వస్తుంది.

యం.వి. రామారావు

సీనియర్ జర్నలిస్టు

72869 64554

Advertisement

Next Story

Most Viewed