- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ విద్యలో ప్రైవేట్ పెత్తనం!
దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకొంటుంది' అన్నారు కొఠారీ. ఈ వ్యాఖ్య విద్యారంగ ప్రాధాన్యతను తెలపడమే కాక, భావి సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వాధీనంలోనే కొనసాగాలి. అప్పుడే దేశంలో ధనిక, పేద వ్యత్యాసం లేకుండా నాణ్యమైన విద్య అందుతుంది. ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం సైతం ఇదే చెబుతుంది. అయితే, దశాబ్దాలుగా పాలకులు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాల వలన విద్యా రంగం ప్రైవేటీకరణ బాట పట్టింది. ఎంతలా అంటే, నాడు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమించినవారు సైతం అధికారం చేపట్టగానే విద్యా సంస్కరణల పేరుతో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం అదే పరంపర కొనసాగుతోంది.
వ్యవస్థను అస్థిరపరచడానికే
ఉద్యమ ఆశయాలకు అనుగుణంగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బలోపేతమవుతుందని అందరూ భావించారు. అందుకు తగ్గట్టుగానే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామనే ప్రకటనతో పాటు విద్యారంగ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో ఆశలు చిగురించాయి. అధికారం చేపట్టి ఎనిమిదేళ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కరింపబడలేదు. విద్యాసంస్థలు బలపడలేదు. 'మన ఊరు-మన బడి' కార్యక్రమం నిధుల లేమితో మందకొడిగా సాగుతోంది. కొన్ని గురుకులాల స్థాపనతోనే విద్యా వ్యవస్థకు మేలు జరిగిందనే భావిస్తున్న ప్రభుత్వం పాఠశాలల పరిరక్షణ మీద శీతకన్ను వేసింది. యేటా బడ్జెట్‌లో విద్యారంగానికి తరుగుతున్న నిధులే అందుకు నిదర్శనం. దీనికి తోడు కరోనా కారణంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరింత కుదేలైంది.
ఖాళీగా ఉన్న వేలాది ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయడం లేదు. వారి స్థానాలలో విద్యా వాలంటీర్లను, ఒప్పంద అద్యాపకులను నియమిస్తున్నారు. పర్యవేక్షణాధికారుల పోస్టులలోనూ ఇతరులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రమోషన్లు ఇవ్వకుండా ఉన్న టీచర్‌లనే బలవంతంగా సర్దుబాటు చేయడం, రేషనలైజేషన్ పేరుతో బడుల మూసివేతకు సిద్ధపడటం వంటివన్నీ ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యావ్యవస్థను అస్తవ్యస్తపరచడంలో చేస్తున్న పనులే. మొదటి నుంచి పాలకుల అండదండలతో సమాంతర వ్యవస్థను నడుపుతున్న ప్రైవేటు రంగం ప్రభుత్వ చర్యలతో మరింత విజృభిస్తోంది. ప్రభుత్వ నిర్లిప్తత, ఉదాసీన వైఖరి అవకాశంగా తీసుకుని ఎన్‌జీఓలు ప్రభుత్వ విద్యాసంస్థలుగా ప్రవేశించాయి. టీచర్‌ల కొరతను ఆసరాగా చేసుకొని తమ వాలంటీర్‌లను పాఠశాలలో నియమించి బోధన చేస్తున్నాయి. దీనికి అధికారులు సైతం యథేచ్చగా అనుమతిస్తున్నారు.
వారి ప్రాబల్యం పెరుగుతోంది
బీఈడీ, ఎంఈడీ అర్హతలు గల టీచర్‌ల కన్నా వాలంటీర్‌లే బాగా చదువు చెబుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. సేవ్ ద చిల్డ్రన్, సాధన సమితి, టీచ్ ఫర్ ఇండియా, మైండ్ స్పార్క్, బ్రిటిష్ కౌన్సిల్, వందేమాతరం ఫౌండేషన్ మొదలగు సంస్థలు ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించాయి. ఇటీవల ప్రాథమిక పాఠశాలలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ' కార్యక్రమాన్ని కూడా 'సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్' 'రూమ్ టు రీడ్' అనే ఎన్‌జీఓలు నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలు ప్రభుత్వ టీచర్‌లకు చదువు ఎలా చెప్పాలో శిక్షణ కూడా ఇస్తున్నాయి. రానున్న రోజులలో ప్రభుత్వేతర సంస్థలు ప్రభుత్వ విద్యారంగంలోకి రావచ్చనే సంకేతాలు ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వం వారికి సహకరించి క్రమంగా బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు తోస్తున్నది.
విద్యను ప్రైవేటీకరించాలని ప్రభుత్వాలు ఆలోచించడం బాధాకరం. ఇప్పటికే విద్యా వ్యవస్థ చాలా వరకు పెట్టుబడివర్గాల చేతులలోకి చేరింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ముమ్మరంగా ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్వమైపోతున్నది. మేధావులు, నిపుణులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు గొంతెత్తకపోతే ప్రైవేటు ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేము. ఇప్పటికే విద్య ఖరీదుగా మారిపోయింది. ప్రైవేటు చొరబాటును నియంత్రించి, డీఎస్‌సీ ద్వారా శాశ్వత నియామకాలు జరపాలి. ప్రభుత్వేతర సంస్థలు మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పాటునందించేలా ఉండాలి. కానీ, బోధనకు అనుమతి ఇవ్వరాదు.
ఏవీ సుధాకర్
STUTS అసోసియేట్ అధ్యక్షులు
90006 74747