- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నవ సమాజ మార్గదర్శి గురజాడ
గురజాడ అప్పారావు మహాకవి. సంఘ సంస్కర్త. జాతీయోద్యమానికి అవసరమైన భావజాలాన్ని ప్రబోధించిన సాహితీమూర్తి. 'సాహిత్యము ఏ కొందరికో సొత్తు అనుకున్న కాలములో అది ప్రజల సొమ్ము' అని ఉదాహరముగా పంచిపెట్టిన సౌమ్యశీలి ఆయన. కందుకూరి సాంఘిక విప్లవం, గిడుగు భాషా విప్లవమును తనలో సమన్వయం చేసుకుని సరికొత్త సాహిత్య విప్లవము లేవనెత్తిన నవయుగ వైతాళికుడాయన. ఆయన చేతి చలవతోనే అస్పృశ్యముగా పడియున్న వాడుక భాష అందలమెక్కినది. మెత్తని తెలుగు పలుకు కత్తి ధారవలే మెరిసినది. వీధి మనిషికి వేదిక లభించినది.
ఆంధ్రభారతి అంతకు ముందటి అలంకార భారములను ఊడ్చి వేసి ముచ్చటగా ముత్యాల సరాలు అలంకరించుకున్నది. నాటకము, గేయము, వ్యాసము, కథానిక ఆయన వాంగ్మయముతో ఎన్నడూ లేని జవమును, జీవమును పుంజుకున్నవి. తన చుట్టూ ఉన్న ప్రపంచం ఎటు పోతుందో గమనించి, తెలుగులో తొలిసారిగా కళ్లు తెరిచి ప్రబంధ ధోరణి వదిలిపెట్టి పాతబాటలో కాకుండా కొత్తబాటలో నడవాలి అనుకున్నారు గురజాడ. ఆంగ్ల సాహిత్యం అధ్యయనం చేశారు. ప్రపంచ భాషా సాహిత్య తీరుతెన్నులు గమనించి తెలుగు భాషా సాహిత్యాలకు దిశానిర్దేశం చేశారు.
సంస్కృతికి పెద్ద పీట
భారతీయ సంస్కృతికి పెద్ద పీట వేసిన కవి గురజాడ. సనాతన భారతీయ జీవనంలోని అర్థరహిత ఆచారాలకు అంకితమైపోయిన లక్షణాలను వదులుకొని భారతజాతి ఆధునిక భావ సంపన్నం కావాలని, ఆదర్శ శిఖరంగా నిలవాలని ఆకాంక్షించిన మహోదాత్తుడు గురజాడ. మంచి ఎక్కడున్నా స్వీకరించే ఉదార చరితుడాయన. 'పాత కొత్తల మేలు కలయిక క్రొమ్మెరుంగులు జిమ్మగా' అన్న భావం వెనుక గురజాడ మాతృభాషాభిమానం కనిపిస్తుంది. మాతృదేశాభిమానం, కులాతీత, మతాతీత వ్యవస్థల పట్ల అనురక్తి ఆయన వ్యాసాలలోనే కాక ఇతర సృజనాత్మక వాంగ్మయంలోను కనిపిస్తాయి. మహాత్ముడు జాతీయోద్యమంలో భాగస్వామ్యం కాకముందే గురజాడ 'దేశమంటే మట్టి కాదు- దేశమంటే మనుషులు' అని ప్రబోధించారు.
దేశ విముక్తి కన్నా ముందు దేశంలోని దరిద్ర నారాయణులకు విముక్తి కల్పించాలని మహాత్ముడు కొల్లాయి గట్టి ఉద్యమ శంఖం పూరించారు. 'కత్తి వైరం కాల్చవోయ్' అని గురజాడ ముందుగానే చెప్పారు. అహింసా మార్గంలో మహాత్ముడు బ్రిటిష్‌వారిని పశ్చిమ దేశానికి పరుగులు పెట్టించారు. 'ఎల్ల దేశాల్ క్రమ్మవలెనోయ్-దేశి సరుకులనమ్మవలేనోయ్' అని గురజాడ ముందుగానే చెప్పారు. మహాత్ముడు స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారు. 'పలుకులను విని దేశమందభిమానములు మొలకెత్తవలెనోయ్' అని గురజాడ ముందే ప్రబోధించారు. మహాత్ముడు 'ఆసేతుశీతాచలం' మాటలను మంత్రంగా ప్రయోగించారు. 'ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్' అని గురజాడ అంతకుముందే హెచ్చరించారు.
Also read: అణగారిన వర్గాల గొంతుక
అభ్యుదయవాద రచనలు
'అన్నదమ్ముల వలెను జాతులు, మతములన్నియు మెలగవలెనోయ్' అని తొలిసారిగా తన కవితా లేఖిని ద్వారా గుండె నిబ్బరంగా ప్రకటించారు గురజాడ. తన తర్వాత రాబోయే జాతీయోద్యమానికి ముందుగా ఊపిరిలూదిన దార్శనికుడు గురజాడ. 'దేశమనియెడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్' అంటూ సుందర జాతీయ స్వప్నాన్ని, భవిష్యవాణిని పలికిన బుుషి గురజాడ. 'మతములన్నియు మాసిపోవును- జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును' అని భవిష్యదర్శనం చేసినది ఆయనే. 'మనిషి చేసిన రాతిలో దేవుడిని చూడగలిగినప్పుడు మనిషిలో మాత్రం ఆ దేవున్ని ఎందుకు చూడలేరు' అని మానవాళిని సూటిగా ప్రశ్నించిన తాత్వికుడు గురజాడ.
ఆధునిక మార్గంలో తాను చేపట్టిన ప్రతి అక్షర ప్రక్రియకు మార్గదర్శిగా నిలిచి తెలుగు ఆధునిక సాహిత్య ప్రపంచానికి వెలుగు బాట పరిచిన దీపధారి గురజాడ. గురజాడ భావ నవ్యతకి, శైలీ నవ్యతకీ, రసపోషణ నైపుణ్యానికి నిలువుటద్దం 'పూర్ణమ్మ' ఖండిక. గురజాడ సామాన్యులకి, పేదవారికి కూడా తమ కవిత్వంలో పెద్దపీట వేశారు. సామాజిక మౌఢ్యానికి తలవంచి ఆత్మత్యాగం చేసిన మహిళా మూర్తులు, ముక్తి కాంతగా ముందుకు నడిచే వినయ విద్యా సద్గునాన్వితలైన సబలలు, చదువులోని మర్మాలను విప్పి చెప్పిన ధీమంతులు గురజాడ సాహిత్యంలో దర్శనమిస్తారు. అంతటి మహనీయుడు అనారోగ్య కారణంగా 30 నవంబర్ 1915 న అస్తమించారు.
(నేడు గురజాడ అప్పారావు వర్ధంతి)
నాయకోటి సుజాత
తెలుగు రీసెర్చ్ స్కాలర్
9849830014