గిరిజన షెడ్యూళ్ల రూపశిల్పి

by Ravi |   ( Updated:2023-01-03 03:05:44.0  )
గిరిజన షెడ్యూళ్ల రూపశిల్పి
X

భారత రాజ్యాంగంలో గిరిజనులకు ఉద్దేశించిన 5,6 షెడ్యూళ్ళ చేరిక వెనుక జైపాల్ సింగ్ ముండా ఉన్నట్టు చాలా తక్కువ మందికే తెలుసు. ఆదివాసీలలో తొలి మేధావిగా పేరుగాంచిన ఆయన జనవరి 3 జార్ఖండ్ లోని కుంతిలో జన్మించారు. ఆయన అసలు పేరు ప్రమోద్ పహాన్. తర్వాత జైపాల్ సింగ్ గా మారింది. ఆయన రాంచీలో ప్రాథమిక విద్య పూర్తి చేసి. ఉన్నత విద్య కోసం క్రిస్టియన్ మిషనరీ సహాయంతో ఇంగ్లాండ్ వెళ్లారు. ఆక్స్‌ఫర్డ్ లోని సెయింట్ జాన్స్ కాలేజీ నుండి మెట్రిక్యులేషన్ లో ఉత్తీర్ణుడయ్యారు. ఈ యూనివర్శిటీలోనే ఆయనలోని హాకీ ప్రతిభ వెలుగు చూసింది. 'ఆక్స్ ఫర్డ్ హాకీ బ్లూ' టైటిల్ ను గెలుచుకున్న మొదటి ఆసియా క్రీడాకారుడిగా నిలిచారు. అలాగే ధ్యాన్‌చంద్ అవార్డును పొందారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలలో చురుకుగా ఉండే అతను కళాశాల సెక్రెటరీగా, ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అనంతరం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ 'స్పోర్ట్స్ జర్నల్' లో రెగ్యులర్ కాలమ్ రాయడం ప్రారంభించారు. ఆయన ఆదివాసీల గురించి పత్రికలకు తరచుగా వ్యాసాలు రాసేవారు. టైమ్స్ లో కూడా ఆయన స్పెషల్ కాలమ్ రాశారు. ఇంగ్లాండ్ లో భారతీయ విద్యార్థుల కోసం 'హాకీ ఫెడరేషన్' స్థాపించారు. ఆమ్ స్టర్ డ్యామ్ ఒలింపియాడ్ లో పాల్గొన్న జట్టుకు కెప్టెన్ గా సైతం వ్యవహరించారు.

విలువైన సూచనలు ఇచ్చి

అక్కడి జాతి వివక్ష కారణంగా కెప్టెన్సీని విడిచిపెట్టి భారతదేశం తరపున హాకీ ఆడాలని కోరుకొని తన జీవితాన్ని హాకీ ఆటకే అంకితం చేశారు. దేశానికి వచ్చాక రాజకీయాలలో చేరి బీహార్ రాష్ట్రానికి మంత్రిగానూ పనిచేశారు. 1937లో రాయ్‌‌పూర్ లోని రాజ్‌కుమార్ కాలేజీకి వైస్ ప్రిన్సిపాల్ గా నియమితులయ్యారు. తర్వాత రాంచీకి తిరిగి వచ్చి ఆదివాసీల హక్కుల గురించి పోరాటం ప్రారంభించారు. 1939 జనవరి 20న ముండా ఆదివాసీ మహాసభకు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఇక ఆరోజు నుండి ఆయన గిరిజన ఉద్యమానికి కూడా కెప్టెన్ అయ్యారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యునిగా నియమింపబడిన జైపాల్ 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్ లో చేర్చాల్సిన అంశాలపై విలువైన సూచనలు అందించారు. అందుకే ఆయనను 'గిరిజన షెడ్యూళ్ల రూపశిల్పి' గా పేర్కొనవచ్చు. ఆయన నిరంతరం ప్రజలతో ఉంటూ ఆదివాసీల సాంస్కృతిక గుర్తింపును చూపించడానికి తపన పడుతూ ఉండేవారు. ప్రతి సమావేశంలో ఆదివాసీ ప్రజలు విల్లంబులు, ఆదివాసీ నృత్యాలను చూపమని సూచించేవారు. తన మొదటి ప్రసంగంలోనే ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడాలని కోరారు. జైపాల్, బిర్సా ముండా సామాజిక ఉద్యమం నుంచి ప్రేరణ పొందారు.

బహుముఖ ప్రజ్ఞాశాలిగా

బిర్సాముండా ప్రేరణతో 'అబువా డిషోమ్ అబువా రాజ్' (మన దేశం , మన పాలన) అనే చరిత్రాత్మక నినాదంతో బిర్సాముండా భారతీయ జమీందారులు, బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా సామాజిక ఉద్యమానికి నాయకత్వం వహించారు. జైపాల్ సింగ్ ముండా ఆదివాసీ మహాసభ కోసం ఆదివాసీ ప్రజలను సమీకరించడం ప్రారంభించారు. జార్ఖండ్ రాష్ట్రం కావాలనే భావన బలపడింది. జైపాల్ సింగ్ ముండా ఉద్యమాన్ని ఆదివాసీలు అంగీకరించి 'మరాంగ్ గోమ్కే' (సుప్రీం లీడర్) బిరుదును ఇచ్చారు. 1948లో ఈశాన్య ప్రాంత గిరిజనులు ఖర్సావాన్ ను ఒడిషాలో విలీనం చేయవద్దని పోరాటం చేసినప్పుడు ఓషా మిలిటరీ బలగాలు కాల్పులు జరపడంతో కొన్ని వేలమంది ఆదివాసీలు మరణించారు.

ఆ దుర్ఘటనపై జైపాల్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. మేధావి, విద్యావేత్త, వక్త, క్రీడాకారుడు, రచయిత, సామాజిక నాయకుడు, రాజకీయ నాయకుడిగా... ఇలా ఎన్నో విభాగాలలో గొప్ప నైపుణ్యాలను కలిగిన ముండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గడించారు. సాంప్రదాయ, వారసత్వ గిరిజన స్వయంపాలన వ్యవస్థతో జాతి రాజ్య స్థాపన ప్రశ్నను బలంగా లేవనెత్తారు. జైపాల్ సింగ్ ముండా 1970 మార్చి 20న ఢిల్లీలోని స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన జీవిత ప్రయాణం అన్ని ఆదివాసీ సమాజాలకు స్ఫూర్తినిస్తుంది.

(నేడు జైపాల్ సింగ్ ముండా జయంతి)

గుమ్మడి లక్ష్మీ నారాయణ

సామాజిక రచయిత

9491318409

Also Read..

తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి ఫూలే


Advertisement

Next Story