మానవాళికి మహోపదేశం భగవద్గీత

by Ravi |   ( Updated:2022-12-02 18:46:03.0  )
మానవాళికి మహోపదేశం భగవద్గీత
X

కురుక్షేత్ర సంగ్రామంలో కర్తవ్య నిర్వహణ ఎట్లా చేయాలో తెలియక తపన చెందుతున్న అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఉపశమనంగా అనుగ్రహించిన మహోపదేశమే భగవద్గీత. ప్రపంచవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతిని జరుపుకొంటారు. 3 డిసెంబర్ 2022 శనివారం అంతర్జాతీయ గీతోత్సవం, గీతకు 5159వ వార్షికోత్సవం. 'సందేహములు నన్ను చుట్టుముట్టినప్పుడు, నిరాశ నన్నెదుర్కొన్నపుడు, ఆశా కిరణము దూరముగా నైన గోచరించనపుడు, నేను భగవద్గీత తెరుస్తాను. అపుడు నన్ను ఓదార్చు ఒక శ్లోకము కనిపించును. అప్పుడు భరింపరాని దుఃఖములో కూడా నా మోములో చిరునవ్వు కదలాడుతుంది' అన్నారు మహాత్మాగాంధీ.

భగవద్గీతను మననము చేయువారు ప్రతి దినము దాని నుండి నూతనార్థములను గ్రహించి పరమానందమును పొందుదురు. 'జాతిపిత మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ రాజకీయ రంగంలో సత్యశోధనలో అనేక ప్రయోగాలు చేశారు. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు. అనేక పరిశోధనలు చేశారు. అవి నాటికి, నేటికి, ఏనాటికి ఆచరణీయమైనవేనన్నది జగమెరిగిన సత్యం. 'గీ' అనే అక్షరం త్యాగాన్ని 'త' అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మ స్వరూపాన్ని ఉపదేశిస్తోంది. త్యాగ శబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫల త్యాగం సర్వసంగ పరిత్యాగం అని అర్థాలు. అలాగే తత్వబోధన అంటే ఆత్మక్షాత్కరం. బంధ విముక్తి అనే అర్థాలున్నాయి.

కర్మానుసారే

గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టిన రోజు. మానవ జీవితం 'కర్మ' మీద ఆధారపడి ఉన్నది. 'కర్మ' అంటే పని మన పనిని బట్టి లభించే ఫలితం అన్నమాట. నిన్నటి పనికి ఇవ్వాళ ఫలితం ఉన్నట్లే గత జన్మలోని కర్మకు ఈ జన్మలో ఫలితం ఉంటుంది. ఇందు గురించి మహాభారతంలో ఒక కథ ఉంది. ఒక మహిళకు ఒక కొడుకు. అతడు పసివాడు. ఆటలకు పోయినాడు. పాము కరిచింది. మరణించాడు. ఆమె తన కొడుకు శవాన్ని పెట్టుకొని ఏడుస్తున్నది. ఇంటి పక్కన ఉన్నవాడు పామును చంపుతానని కర్ర పట్టుకొని వచ్చాడు. తన కొడుకు కర్మ వలన చచ్చాడు. పాము దోషం కాదు చంపవద్దన్నది.

పాము అక్కడికి వచ్చింది. 'తల్లీ, నా తప్పేమీ లేదు. నేను నిమిత్తమాత్రురాలను మృత్యువు మాటు వేసింది' అని వెళ్లిపోయింది. 'మృత్యువు అక్కడికి వచ్చింది. 'తల్లీ, నాదేమీ తప్పు లేదు నేనూ నిమిత్తమాత్రురాలనే, యముడు ఆదేశించాడు' అని వెళ్లిపోయింది. యముడు అక్కడకు చేరుకుని 'నా తప్పూ ఏమియునూ లేదు. నేనూ నిమిత్తమాత్రుడనే, కాలానికి అధీనుడను, కాలం ఆదేశించింది. నేను ఆచరించాను' అని వెళ్లిపోయాడు. కాలం అక్కడికి వచ్చింది. 'తల్లీ! నాదేమీ తప్పులేదు నేను నిమిత్తమాత్రురాలను, కర్మవశిని, కర్మ ఆదేశించింది. నేను ఆచరించాను' అన్నది. 'కర్మ' రాలేదు. ఎంచేతంటే అది మనిషి చేతిలోనిది. మానవుని భవిష్యత్తు దాని చేతిలో ఉంది. ఉంటుంది. మనిషి మీదా, మనిషి పని మీదా అంత నమ్మకం మనవాళ్లకు. 'స్వధర్మే నిధనం శ్రేయః'అనేది గీతా వాక్యం. ఆశ-దురాశనిరాశల మధ్యనే జీవిత వృక్షానికి ఆశ చివురు లాంటిది. చివురు వేయని చెట్టు. ఆశలేని జీవితం నిలవడం దుర్లభం. చివరి శ్వాస వరకూ ఆశ వదలడు నరుడు. దురాశ, నిరాశ జీవిత వృక్షానికి చెదలు లాంటివి. అవి జీవితాన్ని కుంగదీయడానికి పనికి వస్తాయి.

ఫలితం ఆశించకుండా

''కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన, మాకర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోత్స్య కర్మణి‌-భగవద్గీత 2-47'' పని చేయడమే నీ కర్తవ్యం. ఫలమును ఆశించకు ఫలితానికి కారణ భూతుడవు కావద్దు. అట్లని పని చేయకుండా ఉండరాదు. ఇది వేదాంతం కాదు. మనిషికి నిత్యావసరం. మానవతకు మహిత మార్గం. ఇది వైరాగ్యం కాదు. పాప పుణ్యాల కథ కాదు. ఇది జీవిత సత్యం. ఏమీ ఆశించక చేస్తే వచ్చిన ఫలితం ఆనందం కలిగిస్తుంది. ఫలితానికి నీవే హేతువు అనుకుంటే గర్వం కలుగుతుంది. అట్లా అని పని మానరాదు. ఎంచేతంటే పనియే జీవితం. భగవద్గీత గీతోపనిషత్తుగా కూడా ప్రసిద్ధి చెందినది. వేదోజ్ఞానసారమైన ఈ భగవద్గీత వేద వాఙ్మయము నందలి ముఖ్యమైన ఉపనిషత్తులతో ఒకటై యున్నది.

(నేడు గీతా జయంతి)


కొలనుపాక కుమారస్వామి

వరంగల్, 9963720669

Advertisement

Next Story

Most Viewed