- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉన్నది ఉన్నట్టు: 'డబుల్ ఇంజిన్' విపరీత ధోరణి
వన్ నేషన్-వన్ టాక్స్' తో మొదలైన బీజేపీ విధానం వన్ రేషన్, వన్ ఎలక్షన్ లాంటి పలు అంశాలకు విస్తరిస్తున్నది. చివరకు 'వన్ నేషన్- వన్ పార్టీ'గానూ మారుతుందేమో అనే సెటైర్లూ వినిపిస్తున్నాయి. 'డబుల్ ఇంజిన్' అనేది రాజ్యాంగ విరుద్ధమైనది. ఒక ఆకర్షణీయ నినాదంగా కనిపించినా అధికారాన్ని కేంద్రీకరించుకోవడమే దీని వెనక ఉన్న బలమైన ఆకాంక్ష. చివరకు ఇది నియంతృత్వ ధోరణికి దారితీస్తుంది. రాజ్యాంగ స్ఫూర్తి, సహకార సమాఖ్య విధానం, ప్రజాస్వామిక విలువలకు విఘాతం కలిగించేది. కేంద్రంలో బీజేపీకి అధికారం శాశ్వతమేమీ కాదు. 'డబుల్ ఇంజిన్' ఎల్లకాలమూ వర్తించేదీ కాదు.
బీజేపీ ఈ మధ్య 'డబుల్ ఇంజిన్' పాట పాడుతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే రాష్ట్రంలోనూ ఉంటే అభివృద్ధికి ఢోకా ఉండదని పిలుపునిస్తున్నది. ఇటీవల ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఈ నినాదాన్ని బలంగా ప్రజలలోకి తీసుకెళ్లింది. అంతకుముందు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోనూ వినిపించింది. తాజాగా తెలంగాణలో దీన్ని తెరపైకి తెచ్చింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలో 'డబుల్ డెక్కర్' ప్రస్తావనతో బీజేపీని ఆదరించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగంలో 'డబుల్ ఇంజిన్' ప్రస్తావన ఎక్కడా లేకపోయినా ఓటర్ల మైండ్‌ను సెట్ చేస్తున్నది. ప్రలోభాలకు గురి చేస్తున్నది. రాష్ట్రాల సమూహమే యూనియన్ (రిపబ్లిక్) అనే మౌలిక సూత్రానికి భిన్నంగా ఈ నినాదాన్ని జనంలోకి తీసుకెళ్తున్నది. నిజానికి కేంద్రానికి, రాష్ట్రాలకూ మధ్య సంబంధాలు, పరస్పర సహకారానికి రాజ్యాంగంలో స్పష్టమైన విధానమే ఉన్నది. అధికార పార్టీల ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. బీజేపీ 'డబుల్ ఇంజిన్' నినాదం కేంద్రం దయ తలచి సాయం చేస్తే పుచ్చుకోవడమే తప్ప రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధమైన, చట్టపరమైన హక్కులు లేవని హెచ్చరించే ధోరణే. 'మీ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా.. కేంద్రం నుంచి నిధులు రావాలన్నా, సంపూర్ణ సహకారం అందాలన్నా మా పార్టీనే గెలిపించండి. లేకుంటే కష్టమే' అని ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడమే. భవిష్యత్తులో స్థానిక సంస్థలపైనా కన్నేసి 'ట్రిపుల్ ఇంజిన్' అనే స్లోగన్ అందుకున్నా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు.
2014 నుంచే మొదలైన ధోరణి
నిజానికి 2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ ధోరణి మొదలైంది. పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యి పవర్‌లోకి వచ్చిన తర్వాత జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ వైఖరిని ప్రదర్శించింది. 'డబుల్ ఇంజిన్' అనే పదాన్ని వాడకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకే రాష్ట్రంలోనూ పవర్‌ను కట్టబెట్టండి అని పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పిలుపునిచ్చింది. కొన్నిచోట్ల వర్కవుట్ అయిందిగానీ, అన్నిచోట్లా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. పంజాబ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో బెడిసికొట్టింది. పసలేని నినాదంగానే రుజువైంది. ఇప్పుడు తెలంగాణలోనూ ఈ నినాదాన్ని వినిపిస్తున్నది. కేంద్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికీ సంబంధాలు బెడిసికొట్టిన ప్రభావాన్ని చూస్తున్నాం. వడ్ల కొనుగోళ్ళ అంశం మొదలు రిజర్వు బ్యాంకు అప్పులకు అనుమతి వరకు అది స్పష్టంగా కనిపిస్తున్నది. 'రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదువా' తరహాలో కేంద్రంలో అధికారాన్ని తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకుంటున్నది. ఇది ఇక్కడితోనే ఆగుతుందని భావించలేం. భవిష్యత్తులో మరింత ఘర్షణకు, రాజకీయ విద్వేషానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. 'మేం ఇచ్చేవారం, మీరు పుచ్చుకునేవారు' తరహాలో తలొగ్గి ఉండాలంటూ పరోక్షంగా సంకేతమివ్వడమే. దీంతో రణమో, శరణతో తేల్చుకోవడం తెలంగాణ వంతయింది.
'డబుల్ ఇంజిన్' ఒక మిథ్య
బీజేపీ వల్లిస్తున్న 'డబుల్ ఇంజిన్' నినాదం శాస్త్రీయమే అయితే ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ప్రగతిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా ఎందుకు లేవు? ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ఎందుకు అందడంలేదు? ఉత్తరప్రదేశ్ నుంచి ఉపాధిని వెతుక్కుంటూ తమిళనాడు, తెలంగాణ లాంటి రాష్ట్రాలకు పేద కార్మికులు ఎందుకు వలస వస్తున్నారు? తెలంగాణలో పనిచేస్తున్న లక్షలాది మంది ఇతర రాష్ట్రాల కార్మికులలో ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే ఎక్కువ. గత ఐదేండ్లుగా కేంద్రంలో, ఆ రాష్ట్రంలో పవర్‌లో ఉన్నది బీజేపీయే. 'డబుల్ ఇంజిన్' అభివృద్ధి, సంక్షేమం నిజమే అయితే ఆ పేదలు ఉపాధిని వెతుక్కుంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? 'డబుల్ ఇంజిన్' ఒక డొల్ల నినాదమే. బీజేపీ పాలిత రాష్ట్రాలను చూస్తే ఇది స్పష్టమవుతుంది. ఆ మాటకొస్తే అనేక అంశాలలో ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో ప్రగతి బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే మెరుగ్గా ఉన్నది. సంక్షేమ పథకాల అమలు, సబ్సిడీలు, విద్య, వైద్యం, విద్యుత్ లాంటివి ఇందుకు ఉదాహరణలు. ఉప్పుడు బియ్యం కోసం ఇతర రాష్ట్రాల మీద ఆధారపడిన తమిళనాడు ఇప్పుడు స్వయంసమృద్ధిని సాధించింది. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వమే ఎనిమిదేండ్లుగా పవర్‌లో ఉన్నా విద్యుత్ సంక్షోభంతో పరిశ్రమలకు 'పవర్ హాలీ డే' ప్రకటించక తప్పలేదు. 'కర్ర ఉన్నోడిదే పెత్తనం' తరహాలో అధికార బలంతో హైదరాబాద్‌కు మంజూరైన ఆర్బిట్రేషన్ సెంటర్, ఆయుష్ రీసెర్చి సెంటర్‌లాంటివాటిని గుజరాత్‌కు పంపించేసింది. రాష్ట్రాల ఆకాంక్షలను నీరుగారుస్తూ ప్రగతికి ప్రతిబంధకాలు కల్పిస్తూ ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నది.
తెలంగాణలోనూ అదే పెడ ధోరణి
కేంద్రంలోని బీజేపీ మాత్రమే కాదు. తెలంగాణలోని టీఆర్ఎస్ కూడా అదే భావజాలంతో ఉన్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తే నిధుల విడుదలకు ఢోకా ఉండదంటూ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ ప్రచారం చేశారు. ప్రజలలో అభద్రతా భావాన్ని క్రియేట్ చేశారు. 'మీ పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందాలంటే, సౌకర్యాలు మెరుగుపడాలంటే ప్రతిపక్షాలతో సాధ్యం కాదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. ఆ పార్టీని గెలిపిస్తే నిధులు వరదలా వచ్చేస్తాయి. మీ గ్రామాలలో అభివృద్ధికి ఢోకా ఉండదు' అంటూ ప్రచారం చేశారు. రాష్ట్రం దయ తలిచి ఇస్తేనే నిధులు వస్తాయి. అభివృద్ధి జరుగుతుంది. లేదంటే కుదరదు అని ప్రజలను హెచ్చరించారు. అసెంబ్లీ వేదికగానే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పలువురు 'మా నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడంలేదు. సమస్యలు తిష్ట వేశాయి. పరిష్కారానికి నోచుకోవడంలేదు" అంటూ మొరపెట్టుకున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు వాదనా ఇదే. రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ 'డబుల్ ఇంజన్' అనే పదాన్ని వాడకపోయినా అదే ధోరణిలో ప్రవర్తిస్తున్నది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే పలు సందర్భాలలో 'రాష్ట్ర అవసరాలకు, ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నాం. అంశాలవారీగా మద్దతు ఇస్తున్నాం. ఘర్షణ పడితే నిధులు రావనే ఉద్దేశంతోనే స్నేహాన్ని కొనసాగిస్తున్నాం' అనే అర్థంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రాల చట్టబద్ధమైన హక్కులు, సహకార సమాఖ్య స్ఫూర్తి, రాజ్యాంగం కల్పించిన అధికారాలు కేసీఆర్‌కు తెలియందేమీ కాదు. అయినా రాష్ట్ర, రాజకీయ ప్రయోజనాల కోసం రాజీ పడ్డారు.
కర్రపెత్తనం కోసమే 'వన్ నేషన్' స్లోగన్
రాజ్యాంగం కేంద్రానికి, రాష్ట్రాలకు ఉండే అధికారాలపై స్పష్టమైన నిర్వచనమే ఇచ్చింది. అధికారం రుచి మరిగిన బీజేపీ తన స్థానాన్ని పదిలం, పటిష్టం చేసుకోడానికి తహతహలాడుతున్నది. రాష్ట్రాల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నది. కొన్ని పార్టీల నేతలు ఇటీవల 'రాష్ట్రాలను కేంద్రం మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చింది..' అని వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్రాల వ్యాట్ హక్కులను హరిస్తూ 'వన్ నేషన్-వన్ టాక్స్' పేరుతో జీఎస్టీని తెచ్చింది. రాష్ట్రాలూ వాటి అవసరాలు, రాజకీయ సంబంధాలతో 'జీ హుజూర్..' అంటూ మద్దతు పలికాయి. కేంద్రం తన ఆర్థిక వనరులకు మార్గాన్ని సుస్థిరం చేసుకున్నది.
గతంలో ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ వచ్చేసింది. పేరుకు టీమ్ ఇండియా అని చెప్తున్నా రాష్ట్రాల భాగస్వామ్యం నామమాత్రమైంది. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల విషయంలోనూ రాష్ట్రాలతో సంబంధం లేకుండా మొత్తం వ్యవహారాన్ని తన అజమాయిషీలో పెట్టుకోవాలనుకుంటున్నది. ఉమ్మడి జాబితాలోని అంశాలు ఒక్కటొక్కటిగా రాష్ట్రాల పరిధి నుంచి చేజారిపోతున్నాయి. అందుకే కేసీఆర్ ఈ మధ్య "గ్రామీణ ఉపాధి హామీ కూలీ కార్మికుల వేతనాలను కూడా కేంద్రమే ఇస్తుందంట. ఇదేనా కేంద్రం చేయాల్సిన పని.." అంటూ తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.
చివరకు మిగిలేది?
'వన్ నేషన్-వన్ టాక్స్' తో మొదలైన బీజేపీ విధానం వన్ రేషన్, వన్ ఎలక్షన్ లాంటి పలు అంశాలకు విస్తరిస్తున్నది. చివరకు 'వన్ నేషన్- వన్ పార్టీ'గానూ మారుతుందేమో అనే సెటైర్లూ వినిపిస్తున్నాయి. 'డబుల్ ఇంజిన్' అనేది రాజ్యాంగ విరుద్ధమైనది. ఒక ఆకర్షణీయ నినాదంగా కనిపించినా అధికారాన్ని కేంద్రీకరించుకోవడమే దీని వెనక ఉన్న బలమైన ఆకాంక్ష. చివరకు ఇది నియంతృత్వ ధోరణికి దారితీస్తుంది. రాజ్యాంగ స్ఫూర్తి, సహకార సమాఖ్య విధానం, ప్రజాస్వామిక విలువలకు విఘాతం కలిగించేది. కేంద్రంలో బీజేపీకి అధికారం శాశ్వతమేమీ కాదు. 'డబుల్ ఇంజిన్' ఎల్లకాలమూ వర్తించేదీ కాదు.
ఎన్. విశ్వనాథ్
99714 82403