మాతృభాషను.. చేజారనీయవద్దు

by Ravi |   ( Updated:2024-01-07 00:45:56.0  )
మాతృభాషను.. చేజారనీయవద్దు
X

మన తెలుగు భాష పలికితే 72,000 న్యూరాన్లు స్పందిస్తాయట. ప్రపంచంలో ఉన్న వందలాది భాషలలో మన తెలుగుది 15వ స్థానం ఉంది. ఇలాంటి ఉన్నత భాషకు మనమే బాటలు వేసుకోవాలి కదా. గిడుగు రామ్మూర్తి గారు చెప్పినట్లుగా మన భాష పుస్తక భాషగా, ముస్తక భాషగా సులభతరం కావాలి. మన మాతృభాష జన భాష గా మారి నిత్యం ఆదరించబడాలి.

ఈనాటి కాలంలో మనం తరచుగా వింటున్న మాటలు.. ‘మా బాబుకు తెలుగు రాయడం చదవడం రాదండి’ అంటూ గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రులు... ‘మా పాపకు తెలుగు ట్యూషన్ పెట్టిస్తున్నాము’ అని చెబుతూ మురిసిపోయే అమ్మానాన్నలు మనకు కనిపిస్తూ ఉంటారు. ఈనాటి కాలంలో మాతృభాషలో మాట్లాడటం అనాగరికంగా మారిపోయే ప్రమాదం ఉంది. భాషపై పొంచి ఉన్న ఈ పెను ప్రమాదం నివారించవలసిన తరుణోపాయం ఉపాధ్యాయుల బోధనలో తల్లిదండ్రుల ఆవరణలో ఉన్నది. అందుకు రావలసిన తక్షణ కర్తవ్యం, అమ్మ భాష అమృత భాషగా భాసిల్లాలంటే పిల్లవానికి భాషకు ఒక శ్రావ్యమైన బంధాన్ని తొలినాటి నుండే కల్పించాలి. ఈ భాష సరళ భాషగా రూపొందాలి.

ఉపాధ్యాయులే భాషగా మారాలి..

భాషకు ఆదిమూలం ఇల్లు, ఇంట్లో మనం మన భాషను మాట్లాడుతూ, మన భాష గొప్పతనం చెప్పగలిగితేనే విద్యార్థి అంతరాంతరాలలో భాషకు పట్టం కట్టే స్పృహ మొదలవుతుంది. అలాగే ఉపాధ్యాయులు సైతం తగిన రీతిలో భాష మార్దవాన్ని శ్రావ్యంగా మురిపించే కథలతో, పద్యాలు, కవితలతో రక్తి గీతాలు జానపద గేయాలు, నీతి కథలు నిండారించిన భాషకు సొగసులు దిద్దాలి. తద్వారా అది నుండే విద్యార్థికి భాషపై మక్కువ, వాత్సల్యం, గౌరవం పెరిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నవి. అలాగే మాతృభాషా మాధుర్యం, గొప్పతనం మన భాషా సాహిత్యంలో పొందుపరచాలి. ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ చదువు వరకు ఈ భాష వాత్సల్యాన్ని పెంపొందించే విధంగా చోటు కల్పించాలి.

మన పాఠ్యాంశాలలో భాషలో గల పద్య చమత్కారాలు పద గంభీరం, భాషా సౌందర్యం, ప్రకృతి వర్ణనలు, అలనాటి ప్రసిద్ధ కవులు, ప్రాచీన రచనలు, సాహిత్యంలో గల సొబగులతో, ఎత్తుగడలు చోటు చేసుకోవాలి. ఒకే పద్యం ఒకలా చదివితే ఒకర్ధం. మరోలా చదివితే మరో అర్థం వచ్చే విధంగా అనేక అనేక చమత్కారాలను ఉపాధ్యాయులు వెలుగులోకి తేవాలి. ఒక పద్యం కుడివైపు చదివితే ఒక అర్థం. ఎడమవైపు నుంచి అదే పద్యాన్ని చదివితే మరొక రూపంగా మారే భాషా చమక్కులు మన పాఠ్యాంశాల్లో చేర్చాలి. అప్పుడే భాష వశీకరణమై మన పెదవులపై కదులుతుంది. పాఠ్యాంశాలలో పూర్వకవుల గ్రంథాలలో ప్రతిబింబించే మాధుర్యం సంస్కృతి తెలిపే విధంగా మన భాషా మూలాలు మరిచిపోని విధంగా మాతృభాషను ఉపాధ్యాయులు బోధించాలి. అందుకు ఉపాధ్యాయులు ముందుగా సుశిక్షితులు కావాలి. తామే భాషగా మారాలి. అలాగే విద్యా విధానంలో ఆంగ్లం అగ్రభాగ విధానాన్ని కొనసాగిస్తూనే, తప్పనిసరిగా శిశు తరగతి నుండి అక్షరాలు నేర్పడం, రాయడం లాంటివి పాఠశాలల్లో చోటు కల్పించాలి.

ఆంగ్ల ముసుగు తొలగించాలి..

ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న చైనా లాంటి అనేక దేశాలు తమ దేశ భాషనే కొనసాగిస్తూ పాఠ్యాంశాలలో చేర్చడం వల్ల స్వాభిమానం, స్వదేశీ అభిమానం ఉన్నత స్థాయిలో ఉంటుంది. పాలకులు పాఠ్యాంశాలలో చేతులు పెట్టకుండా, విజ్ఞులు పండితులతో మాతృభాష పాఠ్యపుస్తకాల తయారు చేస్తే భాష విధ్వంసం కాదు. ఈ పరిణితి పాలకుల నుండే రావాలి.. భాష బలహీనమైతే బంధాలు బలహీనము చెందుతాయి. మన భాష మన మూలధనంగా ఉండాలి. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు నిత్యం మన ఇంట్లో, మన బడిలో మన భాషలో పలకాలి. మన భాషలో ఉన్న అమృతమైన హృదయాన్ని శ్వాసించి, ఆవరించి ఉన్న ఆంగ్ల ముసుగును తొలగించవలసిన అవసరం భాషాభిమానులందరిది. భాషపై ఎక్కువ వాత్సల్యం మన పాలకుల మస్తిష్కంలో నిక్షిప్తం కావాలి. అది రాబోయే తరం విద్యార్థులకు బంగారు బాట కావాలి. భాష తెలుసుకోవడం నేర్చుకోవడం కఠినం కారాదు. అందుకై ముఖ్యంగా సరళమైన సహజమైన ఆధునిక బోధనా పద్ధతుల్లోని క్రీడా పద్ధతి ద్వారా అడుతూ పాడుతూ నాట్యం చేస్తూ సహజ ప్రవృత్తిగా పోషణ రూపాంతరం చెందించి, మాతృభాష పసితనం నుండే విద్యార్థుల వంచన చేరాలి. తద్వారా వారిలో మనోవికాసం పెరుగుతుంది. మన మాతృ భాష దిగ్వజమవ్వకపోయినా పరవాలేదు గాని, దిగజారి పోవద్దు 'చేజారనీ వద్దు' అని వేడుకుంటూ పాలకులు మన పాఠ్యాంశాలలో మన మాతృ భాషకు సరైన స్థానం కల్పించాలని విజ్ఞాపన చేస్తున్నా..

(అంతర్జాతీయ తెలుగు మహాసభల సందర్భంగా)

-శేషం వేంకటాచార్యులు

హైదరాబాద్

9949591937

Advertisement

Next Story

Most Viewed