వారికి పాలించే అర్హత లేదంటారా?

by Ravi |   ( Updated:2022-09-03 14:49:49.0  )
వారికి పాలించే అర్హత లేదంటారా?
X

తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా పాల్గొన్నది బడుగు బలహీనవర్గాలవారే. అయినప్పటికీ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినా మంత్రి పదవులలోనూ బడుగు, బలహీన, దళిత, గిరిజనవర్గాల ప్రజాప్రతినిధులకు సామాజికంగా అవకాశాలు కల్పించింది లేదు. వారు ఏ పార్టీలో అయినా ఆధిపత్య నాయకత్వంలో ఉంటూ వారిని భుజాన మోసే పరిస్థితి ఉంది. ఇప్పటికి అయినా దళితులు, గిరిజనులు, బీసీలు, ముస్లింలు, మైనారిటీలు రాజకీయ రంగంలో సమానత్వం కోసం చైతన్యవంతంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

త నెలలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తన సామాజికవర్గం గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రెడ్లు వ్యవసాయం వదలొద్దని, రాజ్యాధికారం రెడ్ల చేతులలోనే ఉంచుకోవాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి ఆయన మాటలలో తప్పులేదు. బహుశా ఆ జాతి నాయకుడిగా ఆయనకు ఖచ్చితంగా తన సామాజికవర్గం పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. రెడ్లు ఎక్కడున్నా రాజకీయాలలో ఉండాలని ఆయన అన్న మాటల వెనుక ఉన్న అంతరంగాన్ని దళితులు, గిరిజనులు బీసీలు, మైనారిటీలు, అణగారినవర్గాల ప్రజలు పసిగట్టగలగాలి. నూటికి 85 శాతం ఉన్న బలహీనవర్గాల ప్రజలకు ఇప్పటికీ సరైన బతుకుదెరువు లేదు. ఆధునిక టెక్నాలజీతో కులవృత్తులు అంతరించిపోయి గల్ఫ్ దేశాల బాట పట్టి పొట్టపోసుకుంటున్నారు. అన్ని సామాజికవర్గాలలోనూ కనీసం ఎకరం భూమి లేని వారు ఉన్నారు.

రాజకీయ అణచివేత

తెలంగాణ మంత్రివర్గంలో రెడ్డిలదే పై చేయిగా ఉంది. శాసనసభలో దాదాపు 50 మందికి పైగా రెడ్డిలు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. దళితులు, బహుజన వర్గాల మీద ప్రేమను ఒలకబోసే మాటలు కేవలం పెదాలు పలికేవే. నిజంగా బహుజనుల మీద వారికి రాజకీయంగా నిజమైన ప్రేమ లేదు. రెడ్డి సమాజం ఏ పార్టీలో ఉన్న పెత్తనం చెలాయించాలని, అధ్యక్షులుగా ఉండాలని కోరుకోవడం అంటే, పరోక్షంగా రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా ఎదగాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాటి మద్రాసు నుంచి విడిపోయి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు బహుజనవర్గాలకు ముఖ్యమంత్రి పీఠం దక్కలేదు.

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలకు చేరుకుంటుండగా రాజకీయ పార్టీలు బహుజనవర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యాయనే చెప్పవచ్చు. బహుజనవర్గాలవారిని అధికారం లేని మంత్రులుగా, ప్రభుత్వ విప్‌లుగానే ఉంచుతున్నారు. ఎప్పుడో 1960లో దామోదరం సంజీవయ్య రెండు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు దాదాపు 85 శాతానికి పైగా ఉంటారు. అయినప్పటికీ వీరిని కేవలం రాజకీయ జెండాలు మోయించుకునే కూలీలుగా అగ్రవర్ణ నాయకులు భావిస్తున్నారు. వాటిని మనం గ్రహించకపోవడం అతి పెద్ద తప్పుగానే భావించాలి.

వారు సంఘటితం కావాలి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు 17 మంది ముఖ్యమంత్రులుగా పని చేశారు. ఇందులో ఎక్కువశాతం ఆధిపత్య కులాలవారే. బహుజనవర్గాలు రాజకీయాలలో కొనసాగుతున్నప్పటికీ వారికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నారు. వారంటే చిన్నచూపు తత్వంతోనే ఉంటున్నారు. ఇప్పటికీ ఆ వర్గాలవారు ఉన్నతంగా ఎదగడానికి శతవిధాల కృషి చేసిన నాయకుడు ఎవరూ లేరు. కేవలం 20 శాతం ఉన్న ఆధిపత్య కులాలవారు పెత్తనం చెలాయించి, వారే అన్ని పదవులు అనుభవిస్తున్నారు. ఇదే తరతరాలుగా కొనసాగుతోంది.

తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా పాల్గొన్నది బడుగు బలహీనవర్గాలవారే. అయినప్పటికీ, రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినా మంత్రి పదవులలోనూ బడుగు, బలహీన, దళిత, గిరిజనవర్గాల ప్రజాప్రతినిధులకు సామాజికంగా అవకాశాలు కల్పించింది లేదు. వారు ఏ పార్టీలో అయినా ఆధిపత్య నాయకత్వంలో ఉంటూ వారిని భుజాన మోసే పరిస్థితి ఉంది. ఇప్పటికి అయినా దళితులు, గిరిజనులు, బీసీలు, ముస్లింలు, మైనారిటీలు రాజకీయ రంగంలో సమానత్వం కోసం చైతన్యవంతంగా అడుగులు వేయాలి. 'రెడ్డిల వద్ద భూములు ఉండాలి. భూములు ఉంటే సంపద ఉంటది. సంపద ఉంటే రాజకీయం చేయవచ్చని' రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. బహుశా అది ఆయనకు తన వర్గం పట్ల ఉన్న ప్రేమ కావచ్చు. దానిని తప్పు పట్టనవసరం లేదు‌. ఆ మాటల ఆంతర్యాన్ని దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీసీ సమాజం అర్థం చేసుకొని సంఘటితం కావాలి.

సంపత్ గడ్డం

దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు

కామారెడ్డి, 78933 03516

Advertisement

Next Story

Most Viewed