సమస్యలు గాలికొదిలి... తిట్ల దండకమా?

by Ravi |   ( Updated:2024-11-22 01:00:41.0  )
సమస్యలు గాలికొదిలి... తిట్ల దండకమా?
X

ప్రస్తుతం ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు వాడుతున్న భాష చాలా అభ్యంతరకరంగా, అసభ్యంగా కూడా ఉంటుంది. వ్యక్తి దూషణ తారా స్థాయికి చేరి హౌలా, సంసారం చేసేటోడు, మైండ్ దొబ్బింది, మగాడివైతే వంటి అనేక పదాలను బహిరంగ సభలలో సైతం వాడడంతో ఈ అంశం ప్రత్యేక చర్చనీయాశంగా మారింది. నాయకులకు ప్రజలు గమనిస్తున్నారు అన్న ఇంగితం ఉన్నట్లు కానరావడం లేదు.

నాయకులు ప్రజల మౌలిక సమస్యలను, సమగ్రంగా చర్చించి పరిష్కారం చూపేందుకు ఇచ్చే సమయం కన్నా, ఒకరిలో మరొకరు తప్పులు వెతికేందుకు, పరస్పర నిందారోపణలకే పరిమితమై విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. ప్రజల సమస్యలను సమిష్టిగా చర్చించి, పరిష్కరించుకోవాలనే కనీస ఆలోచన చేయడం లేదు. ఒకరిపై ఒకరు అభ్యంతరకర, అనుచిత పదబంధాలను ఉపయోగిస్తున్నారు. అందుకేనేమో పార్లమెంటరీ, అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అనే రెండు పదాలు ఇటీవల చర్చనీయాంశంగా ముందుకొచ్చాయి. పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలలో ఎటువంటి భాష ఉపయోగించాలనే దానికోసమే ఈ పదాలు పుట్టుకొచ్చాయి. ఇవి ప్రత్యేకమైన భాషలు కానప్పటికీ, చట్టసభలలో ప్రజా ప్రతినిధులు ఒకరినొకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే సభా సంప్రదాయాలను గుర్తుకు తెచ్చేందుకు ఇవి వాడకంలోకి వచ్చాయి.

జనం వెయ్యికళ్లతో గమనిస్తారు..!

పాలకులకు ఎన్నికల్లో గెలుపు వినమ్రతను, విజ్ఞతను పెంచాలి. అహంభావాన్ని ప్రదర్శించేవిగా ఉండకూడదు. అధికారం తాత్కాలికం, అశాశ్వతం. పార్లమెంట్, అసెంబ్లీ వంటి చట్టసభలలో, బహిరంగ సభలలో భాషను అదుపులో ఉంచుకొని పొదుపుగా మాట్లాడాలి. అగౌరవాన్ని కలిగించే విధంగా సభ్యులతో ప్రవర్తించరాదు. మెజారిటీ బలం ఉందని, మాటలు అదుపు తప్పితే, ప్రజలు బుద్ధి జీవులు.. వెయ్యి కళ్లతో గమనిస్తుంటారని మరువరాదు. మన తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు.. వారు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికార పగ్గాలు చేపడతారు. అలాంటప్పుడు వారి ప్రవర్తన ఆదర్శంగా ఉండాలి. రాగద్వేషాలకు అతీతంగా ప్రజలందరిని చూడగలగాలి. చట్టబద్ధమైన పరిపాలన సాగించాలి. ఎన్నికల సమయంలో తప్ప, గెలిచిన తరువాత ప్రజలందరికీ నాయకుడినని గుర్తుంచుకొని మసలుకోవాలి. హుందాగా, పెద్దరికంతో మెలగాలి. నాయకుడు మొదటగా తాను ప్రజలకు సేవకుడని గుర్తుంచుకోవాలి. అడ్డగోలు పెత్తనం చేయ రాదు. అంతఃకరణ శుద్ధితో ప్రవర్తించాలి. ప్రతిదీ చట్టానికి లోబడి, రాజ్యాంగం మీద గౌరవంతో నడుచుకోవాలి. ప్రజా బాహుళ్యాలలో వాడే భాష, హావభావ ప్రదర్శన అందరూ పరిశీలిస్తారననే ఇంగిత జ్ఞానం ఉండాలి. సభ్య సమాజం ఏవగించుకునే పదాలను ఉపయోగించకూడదు.

నిందారోపణలతో కాలాపహరణం!

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజలు నమ్మకంతో ఇచ్చినా అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలి. అసెంబ్లీలో, బహిరంగ సభలు, సమావేశాలలో వాడే భాష మరింత ఆకర్షణీయంగా ఉండాలి. ప్రధానంగా చట్ట సభలలో (అసెంబ్లీ, పార్లమెంటు) ప్రజా ప్రతినిధులు జరిపే చర్చలను ప్రజలు, మేధావులు మీడియా ప్రతినిధులు పరిశీలిస్తుంటారు. ప్రజోపయోగమైనటువంటి, ప్రజామోదమైన సమస్యల పైన సమూలంగా, సమగ్రంగా చర్చించి ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్ తరాలకు, నాయకత్వం ఎలా ఉండాలో తెలియజెప్పేలా చర్చలు చేయాలి. పరస్పర నిందారోపణలతో కాలాపహరణం చేయడమంటే, ప్రజాధనం వృధా చేయడమే. నువ్వు చేశావు కాబట్టి నేను చేస్తున్నా అనేది వితండ వాదన. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం మనం వేటినైతే సమస్యలుగా భావించామో, అధికారంలోకి వచ్చాక వాటిని తిరిగి రాకుండా చూసుకోవాలి. 'భలే గుందిరా మన అసెంబ్లీ ఆటోడు ఇటు కుసుండు, ఇటోడు అటుకుసుండు.. వీని నోట వాని మాట, వాని నోట వీని మాట ప్రజలందరి నోట మట్టి గడ్డల మూట' అనే గద్దర్ పాట సారాంశం పునరావృతం కారాదు.

- రమణాచారి

99898 63039

Advertisement

Next Story

Most Viewed