- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆడపిల్లలపై వివక్షను నిర్మూలించాలి
ఒకప్పుడు ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని అనేవారు. రానురాను ఆ మాట ఆడపిల్లాగా మారింది. ఇప్పుడు! అని అనడంలో అది కాస్త ఆవిరి అవుతుంది. ప్రస్తుత సమాజంలో కొంత మంది ఆడపిల్లల పట్ల ఇప్పటికీ వివక్ష చూపుతున్నారు. ఇంకా కొంతమంది లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే చంపేస్తున్నారు. ఇది చాలా అమానవీయం, దురదృష్టకరం, ఇటువంటి రుగ్మతలన్నింటినీ నిర్మూలించడానికి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీని 'జాతీయ బాలికా దినోత్సవం'గా జరుపుతుంది.
దాని ఆవశ్యకత సార్థకం చేసుకొని
ఈ దినోత్సవం సందర్భంగా బాలికల సంరక్షణ, సామాజిక ఎదుగుదల వంటి అంశాలపై అవగాహన కల్పించడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ప్రపంచీకరణ జరిగి లింగవివక్ష విషయంలో కొంత మార్పు వచ్చినప్పటికీ ఇంకా దేశంలో ఎక్కడో ఒకచోట ఆడపిల్లలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. దీనికి నిర్భయ, దిశ లాంటి ఘటనలే ఉదాహరణ. బాలిక పుట్టడంలో వివక్ష, పెంపకంలో వివక్ష, ఉద్యోగ అవకాశాలలొ వివక్ష, చివరికి వివాహ సమయంలోనూ వివక్ష చూపుతున్నారు. ఇప్పటికీ కొందరు బాలిక అంటేనే 'భారంగా' భావిస్తున్నారు. ఇది భవిష్యత్ సమాజానికి ఒక విపత్కర పరిస్థితి. అసలే ఆడపిల్లల జనాభా తక్కువంటే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యులు డబ్బులకు ఆశపడి లింగనిర్ధారణ పరీక్షలు చేసి, ఆడపిల్లలు పుట్టకుండా పరోక్షంగా తల్లిదండ్రులకు సాయపడుతున్నారు. ఇటువంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు ఆ డాక్టర్ లైసెన్స్ రద్దు చేసేలా ప్రభుత్వం కఠినమైన చట్టాలు తేవాలి. ఆడపిల్లలపై విద్యారంగంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. పట్టణాలలో ఇది కాస్త మెరుగ్గా ఉంది. ఇప్పటికీ చాలామంది ఆడపిల్లలను బాలురతో సమానంగా చదివించడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లల సంఖ్య పెరుగుదల, వివక్షను రూపుమాపడానికి ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టినప్పటికీ అవి అంతంతమాత్రంగానే విజయవంతం అవుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 0- 6 సంవత్సరాలలోపు బాలబాలికల వివరాలను పరిశీలిస్తే ప్రతి వెయ్యి మంది బాలురకు 919 మంది బాలికలు జన్మిస్తున్నారు. ఈ సంఖ్య పెంచాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉంది. ప్రస్తుత కాలంలో బాలురతో సమానంగా బాలికలు విజయాలు సాధిస్తున్నారడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి ఉదాహరణ తెలంగాణ రాష్ట్రంలోని బీద కుటుంబంలో జన్మించిన మాలావత్ పూర్ణ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. ఇది వారి పట్టుదలకు ఉదాహరణగా చెప్పవచ్చు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లు నేటి బాలికే రేపటి నాయకురాలు. స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. అందుకే ఆడపిల్లను రక్షించుకుందాం. ఎందుకంటే అమ్మ కోసం, సోదరి కోసం, భార్య కోసం, భవిష్యత్తు కోసం. ఈ సమాజంలో ఉన్న ప్రతి సంస్థ ఈ రోజు బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఈ రోజు ద్వారా ఆడపిల్లల ప్రాముఖ్యత, అవకాశాల కల్పన, అసమానతల నిర్మూలన మొదలగు విషయాలపై అవగాహన కల్పించాలి. ' ఆడపిల్లలను పుట్టనిద్దాం, బ్రతకనిద్దాం, చదువనిద్దాం, ఎదగనిద్దాం' అనే నినాదాన్ని ప్రతి ఒక్కరు అనుసరించినప్పుడే జాతీయ బాలికా దినోత్సవం ఆవశ్యతకు సార్థకం చేసుకున్న వాళ్లమవుతాం.
డా. కోడూరి శ్రీవాణి
9963188743
Also Read...