- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వజ్రసంకల్పి సినిమా వజ్రోత్సవం
అందానికి పోత పోస్తే.. ఎన్టీఆర్‌లా ఉంటుంది. కళ్లకు మాటలొస్తే.. అవి తారకరాముడి నేత్రాలై వికసిస్తాయి. స్వరానికి గాంభీర్యం అద్దితే అది రామారావు కంఠమై ప్రతిధ్వనిస్తుంది. నిబద్ధతకు నిలువుటద్దం చేయిస్తే.. నందమూరి ప్రతిబింబమై కనిపిస్తుంది. నటనకు కిరీటం చేయిస్తే.. ఆయన వేసిన పాత్రల్లా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సింహాసనం వేసుకుని కూర్చుంటుంది. విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌమగా తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని ముద్ర వేసుకున్న నందమూరి తారక రామారావు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటితో 75 ఏళ్లు అవుతోంది. ఆయన నటించిన తొలి చిత్రం ‘మన దేశం’ 1949 నవంబర్ 24వ తేదీన ఆ చిత్రం విడుదలైంది. సినీ, రంగంలో మకుటం లేని మహారాజుగా ఎన్టీఆర్ చిత్ర రంగంలోకి వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా వజ్రోత్సవాలను రేపటి నుంచి నిర్వహిస్తున్నారు.
మనదేశం చిత్రంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రతో సినీ నటునిగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఎన్టీఆర్. పాత్ర చిన్నదైనా నటుడిగా ఎంతో ప్రభావం చూపారు. 'మనదేశం' తర్వాత ఎన్టీఆర్ వెనుదిరిగి చూసుకోలేదు. షావుకారు, పల్లెటూరి పిల్ల, పాతాళ భైరవి, మల్లీశ్వరి వంటి సినిమాలతో అనతికాలంలోనే అగ్రకథానాయకుడిగా ఎదిగారు. తన అసాధారణ నటనతో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక అనే తేడా లేకుండా అన్ని రకాల చిత్రాలు చేస్తూ నటసార్వభౌముడు అనిపించుకున్నారు. తెలుగు ప్రజల ఆరాధ్యదైవంగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు.. సీనియర్ దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ ‘మనదేశం’ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగయ్య, నారాయణరావు, కృష్ణవేణి కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ రచయిత శరత్ బాబు రాసిన ‘విప్రదాస్’ నవల ఆధారంగా దీనిని రూపొందించారు. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ తెరంగేట్రం చేశారు.
పాత్రలో పరకాయ ప్రవేశం!
అది 'మనదేశం' సినిమా చిత్రీకరణ సమయం. ఎన్టీఆర్‌కు తొలి చిత్రమది. ఇందులో ఆయనది పోలీస్ అధికారి పాత్ర. సన్నివేశం ప్రకారం లాఠీఛార్జ్ చేయాలి. లైటింగ్.. కెమెరా.. యాక్షన్.. అని వినపడగానే రామారావు పాత్రలో లీన మయ్యారు. జూనియర్ ఆర్టిస్టులను నిజంగానే చితకబాదేశారు. దర్శకుడు పిలిచి కొట్టకూడదు.. కొట్టినట్టు నటిస్తే చాలని చెబితే... 'పోలీసులు అలానే బాదుతారు సార్' అని అమాయకంగా జవాబిచ్చారట ఎన్టీఆర్. తర్వాత 'పాతాళ భైరవి' అత్యధిక వసూళ్లు సాధించి, ఎన్టీఆర్‌ను తొలిసారి కమర్షియల్ స్టార్‌ను చేసింది. జానపద చిత్రాల్లో సాటి ఎవరూ లేరనేంతగా ఎదిగిన ఆయన ఒక్కో పాత్రలో ఒదిగిపోతూ వచ్చారు.
పాత్రలో జీవించడమే..
ఎంత స్టార్‌డమ్ వచ్చినా ఆయన ఎప్పుడూ ఇలాంటి చిత్రాలే చేస్తానని కూర్చోలేదు. నటుడిగా తనకు సవాల్ విసిరే పాత్రలను అలవోకగా అంగీకరించి చేసేవారు. 'రాజు-పేద' సినిమాలో పూర్తి డీగ్లామర్ పాత్రలో.. చిరిగిపోయిన బట్టలు, చింపిరి జుట్టుతో పోలిగాడుగా జీవించారు. 'భువన సుందరి కథ'లో కురూపిలా కనిపించి, తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేశారు. కెరీర్ బాగా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు 'కలిసుంటే కలదు సుఖం'లో అవిటివాడిగా నటించి అభిమానులను మెప్పించారు. 'చిరంజీవులు' చిత్రంలో అంధుడిగా.. 'ఆత్మ బంధువు'లో అమాయకుడిగా... ఇలా ఆయన వేయని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు. 'శ్రీ మద్ విరాటపర్వం', 'నర్తనశాల' సినిమాల్లో బృహన్నల పాత్రను ఏ జంకూ లేకుండా చేసి అఖిలాండ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యువకుడిగా, అందాల రాముడిగా, అప్పటి అమ్మాయిల గుండెల్లో కొలువైన ఎన్టీఆర్ 'బడిపంతులు' సినిమాలో వయసు మళ్లిన పాత్ర చేయమంటే అంగీకరిస్తారో లేదోనని నిర్మాతలు భయపడ్డారు. కానీ కథ విన్న వెంటనే అంగీకరించారు. భర్తగా, తండ్రిగా, తాతగా ఈ చిత్రంలో ఆయన కనపరిచిన పరిపక్వమైన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
తిరస్కరించిన వారే.. గుండెల్లో గుడి కట్టారు
కృష్ణుడి పాత్ర అంటే మనసులో మెదిలేది ఎన్టీఆర్ రూపమే. కానీ 'ఇద్దరు పెళ్లాలు' సినిమాలోని ఓ పాటలో ఆయన తొలిసారి కృష్ణుడి పాత్ర వేస్తే ప్రేక్షకులు తిరస్కరించారు. 'సొంత ఊరు' చిత్రంలో కృష్ణుడిగా కనిపిస్తే థియేటర్‌లో నానా అల్లరి చేశారు. అందుకే ఆయన 'మాయబజార్'లో శ్రీకృష్ణుడి పాత్ర ధరించడానికి తొలుత ధైర్యం చేయలేకపోయారు. తర్వాత ఆయన పౌరాణిక పాత్రల్లోని ఔచిత్యాన్ని అర్థం చేసుకున్నారు. అందుకు తగ్గట్లు తనను తాను మలచుకున్నారు. వెండితెరపై రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా నిజంగా ఆయా దేవుళ్లే దిగివచ్చినట్లు చేశారు. ఎన్టీఆర్ సినీ ప్రస్థానంలో మాయాబజార్ ఒక అద్భుతం.. 'మాయాబజార్' చిత్రీకరణ సమయంలో శ్రీ కృష్ణుడి వేషం వేసుకొని మెల్లగా స్టూడియోలోని ఫ్లోర్‌కు నడుచుకుంటూ వచ్చారు. దేవుడే వచ్చినట్లనిపించి చాలా మంది ఆయనకు పాదాభివందనం చేశారంటే ఆయన పాత్రకు ఎంతలా ప్రాణం పోశారో అర్థమవుతుంది.
ఆకలి విలువ తెలిసి..
రైతు కుటుంబం నుంచి వచ్చిన రామారావుకు ఆకలి విలువ బాగా తెలుసు. 'పల్లెటూరి పిల్ల' షూటింగ్ సమయంలో ఆయన దగ్గర డబ్బు ఉండేది కాదు. అందుకే టీ తాగి రోజు గడిపేవారు. ఒక్కోసారి పస్తులుండేవారు. ఆకలి బాధ ఎరిగిన ఆయన 1952లో రాయలసీమ కరవులో ప్రజల ఇబ్బందులను చూసి చలించిపోయారు. రాష్ట్రమంతా తిరిగి వీధుల్లో 'కరువు రోజు లు' నాటకం ప్రదర్శించారు. నాటకం మధ్యలో స్వయంగా ప్రజల వద్దకు జోలె పట్టుకొని వెళ్లారు. అలా నెల రోజుల పర్యటనలో సేకరించిన సాయాన్ని రాయలసీమ కరువు నివారణ నిధికి అందజేసి మనసున్నవాడయ్యారు. కరవు కోరల్లో అల్లా డిన బాధితులకు నిజమైన దేవుడయ్యారు. ఆయన 33ఏళ్ల సినిమా కెరీర్‌లో 298 సినిమాలు చేశారు. సినీరంగం వదిలేసి, రాజకీయాల్లోకి వెళ్లాక తన కళాతృష్ణను తీర్చుకొనేందుకు మరో 4 సినిమాలు చేశారు. మొత్తం 302 సినిమాల్లో ఆయన చేసినన్ని విభిన్న సినిమాలు, వేసినన్ని వైవిధ్యమైన పాత్రలు, నట, దర్శక, నిర్మాతగా పండించినన్ని ప్రయోగాలు న భూతో న భవిష్యతి. ప్రేక్షక ప్రపంచానికి తారక రామారావు ఓ ఆరాధ్య దైవం, తెలుగు సినీ వజ్రోత్సవ చరిత్రలో ఆయనో సువర్ణాధ్యాయం, సాంఘికం, పౌరాణికం, చారిత్రకం, జానపదం ఏదైనా తనకు నటనే ప్రాణప్రదం. ఆకర్షించే ఆహార్యం, ఆకట్టుకునే అభినయం, అలరించే గళం.. వెరసి తెలుగు సినిమాకు రామారావు ఓ వరం.
(నేటి నుంచి ఎన్టీఆర్ సినీ జీవిత వజ్రోత్సవాలు..)
- వాడవల్లి శ్రీధర్
99898 55445