- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాట తప్పడంలో... మీకు మీరే సాటి!
1300 మందిపైగా అమర యువకుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ఉద్యమాన్ని అహింసా ఉద్యమంగా మలిచిన అపర గాంధీగా అర్బకుల చేత కీర్తించ బడినవాడా. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ ఉద్దారకా.. నీకు నమో వాకములు. రూపాయలతో ఓటర్లను కూలీలుగా లోబర్చుకోవచ్చునని కొత్త రాజకీయ రణనీతి సరికొత్త భాష్యాలు బోధించిన రాజనీతిజ్ఞుడవు. ప్రతి పథకంలో ఓట్లను ఏరుకునేందుకు పథక రచన చేసిన దురందరుడవు.. వ్యవసాయ రంగంలో అంతవరకు ఉన్న అన్ని సబ్సిడీలను ఎత్తేసి కళ్ళు చెదిరిపోయే రైతు బంధును రూపకల్పన చేసిన రైతు కష్టాలు తెలిసి కన్నీళ్లు తుడిచిన పరిపాలన దక్షుడవు. కోటి ఎకరాలకు నీళ్లు పారించిన, నీటి యజమాన్యం తెలిసిన నీరటి కానివి. నీవే ముఖ్యమంత్రివి, ఇంజనీరువు, ప్రాజెక్టు డిజైన్ చేసే రూపకర్తవు.. రైతుబిడ్డా నీవు ఎంత బతికి చెడ్డా. పూలు అమ్మిన చోట కట్టలమ్మే దుస్థితి రావడం సత్య హరిశ్చంద్రుని తిప్పలకు చిహ్నం.
రాజశ్రీ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారికి,
మీరు ప్రజల మేలు కోరి రథయాత్ర చేస్తున్న సందర్భంగా ప్రజలు నాతో రాయించుకున్న సన్మాన పత్రం ఏమనగా! తెలంగాణ ఉద్దారకుడా! తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా తెరాసను 2001లో ఏర్పాటు చేసిన మీ రాజనీతి నైపుణ్యం, అజరామరమైన రాజకీయ కళా కౌశల్యం ఎన్నదగినది. 1300 మంది పైగా అమర యువకుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ఉద్యమాన్ని అహింసా ఉద్యమంగా మలిచిన అపర గాంధీగా అర్బకుల చేత కీర్తించ బడినవాడా. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ ఉద్దారకా.. నీకు నమో వాకములు.
దీన జన దళిత బాంధవుడా!
2014లో తెలంగాణ రాష్ట్రంలో దళితుడినే తొలి ముఖ్యమంత్రిని చేసి తాను ప్రభుత్వానికి కావలి శునకంలా ఉంటానని బీరాలు పలికి తీరా ఒడ్డెక్కిన తర్వాత దళిత ప్రజలకు తెడ్డు చూపిన వాడా! దీన జనులను పూచిక పుల్లల్లా పరిగణించిన నాయకుడవీవు. రూపాయలతో ఓటర్లను కూలీలుగా లోబర్చుకోవచ్చునని కొత్త రాజకీయ రణనీతి సరికొత్త భాష్యాలు బోధించిన రాజనీతిజ్ఞుడవు. ప్రతి పథకంలో ఓట్లను ఏరుకునేందుకు పథక రచనచేసిన దురందరుడవు.. దళిత జన క్షేమప్రదాత. ఆడి తప్పడంలో నీకు నీవే సాటి నీకెవరు లేరు పోటీ. నీకివే వేనవేల (తి)రస్కార నమస్కారాలు.
నిస్వార్థ ప్రజా పక్షపాతీ!
మియా బీబీ సోలెడు బియ్యం నుంచి అడ్డెడు బియ్యం ఉడికే కుటుంబ సభ్యుల వరకూ ఎప్పటికప్పుడు మీరు చూపిన మీ నిస్వార్థ అవినీతి రహిత ప్రస్థానం అజరారమం. జాగృతి పేరున బిడ్డను, భగీరథ పేరున కొడుకును, కాకతీయ. నీటి ప్రాజెక్టుల పేరున మేనల్లుడిని, రాజ్యసభ సభ్యునిగా సంతోషంను రాజకీయాల్లో ప్రమోట్ చేసిన మీరు అతి అతి గొప్ప నాయకులు. మీరు కుటుంబ సభ్యులకు అతీతంగా నడిపిన మంత్రాంగం అమోఘం. అజేయం. ద్వంద ప్రమాణాలకు పుట్టినిల్లుగా మార్చిన మీ పాలనకు మా జేజేలు.
ధరణీ పుత్రా!
అవినీతి లేకుండా భూముల రికార్డులు ఉండాలని మీరు ప్రవేశపెట్టిన 'ధరణి' ఈ ధరాతలానికే తలమానికం. మీరు భూమి పుత్రునిగా చూపిన దీక్షాదక్షతలకు నైపుణ్యానికి గీటురాయి. మీ రక్తంలోనే మోసం లేదు. మీ ఆలోచనలలో నక్కజిత్తుల ఎత్తులు లేవు. ఒకరి భూములు ఒకనికి రైతు పాసు పుస్తకాలు జారీ చేయడంలో మీరు సందేహం లేకుండా నిమిత్తమాత్రులు. కానీ ముందు శాఖాహారుల ఇల్లు వెనుక పూర్తి వెజిటేరియన్ ఇల్లు మధ్యన కోడి పెట్ట మాయమై పోవడంలో మీ యొక్క మీ వారసుల యొక్క ప్రమేయం ఏమాత్రం లేదు. ఈ విషయంలో మిమ్మల్ని తప్పు పడితే పట్టిన వారు పురుగుల పడి నిక్కముగా చస్తారు. నీకు ఎదురు లేదు రైతుబిడ్డా నీవు ఎంత బతికి చెడ్డా. పూలు అమ్మిన చోట కట్టలమ్మే దుస్థితి రావడం సత్య హరిశ్చంద్రుని తిప్పలకు చిహ్నం.
రైతు బాంధవుడా!
వ్యవసాయ రంగంలో అంతవరకు ఉన్న అన్ని సబ్సిడీలను ఎత్తేసి కళ్ళు చెదిరిపోయే రైతు బంధును రూపకల్పన చేసిన రైతు కష్టాలు తెలిసి కన్నీళ్లు తుడిచిన పరిపాలన దక్షుడవు. కౌలు రైతులను పట్టాదారులను ఓనర్లుగా కిరాయిదారులుగా కొత్త నిర్వచనం చెప్పిన దళపతి ధరాపతీ. తెలంగాణలో 8000 మంది పైగా కౌలు రైతులు చనిపోయినా నీకు చీమ మాత్రమైనా కుట్టని క్షమా ధర్మము తప్పని నీతి నిజాయితీ ఇడువని శిబి చక్రవర్తివి నీవు. తర తమ భదములు లేని గుడిని గుడి లింగాన్ని కాజేసే చతురుడవు. 72 వేల కోట్లు అర్హతానర్హతా చూపక పంచిపెట్టిన దానకర్ణుడవు. సకల కళా వల్లభుడా, నీ కళా కౌశలానికి సాష్టాంగ ప్రణామాలు.
నిస్వార్థ రుషీ!
కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ ప్రజెంటేషన్‌లో కోటి ఎకరాలకు నీళ్లు పారించిన, నీటి యజమాన్యం తెలిసిన నీరటి కానివి. నీవే ముఖ్యమంత్రివి, ఇంజనీరువు, ప్రాజెక్టు డిజైన్ చేసే రూపకర్తవు... ఒకటా రెండా ఎన్నని చెప్పేది, నీ లీలలు సకల రూప సారములు. తెలంగాణ పునర్ నిర్మాణంలో సమస్తం నువ్వే. నువ్వే పాహిమాం. రక్షమాం.
బంగారు తెలంగాణ నిర్మాతా!
బంగారు తెలంగాణ అని నువ్వు చెప్పితే నిజమే అనుకున్నం. దగ్గర దగ్గర 10 సంవత్సరాలుగా ఎప్పుడు తెలంగాణ బంగారం అవుతుందో అని ఎదురుచూసినం. నాకిప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలనిపిస్తుంది. నా ఆత్మీయ మిత్రుని తమ్ముడు వాళ్ళ అక్క మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును చూసి ఒక రోజు అంతా నీరు పట్టి నల్లగా అయిపోయింది అవుసుల అతని దగ్గర మెరిసేలా కడిగించి తీసుకొస్తానని తీసుకపోయాడు. సాయంత్రం వరకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ గొలుసులోని తళతళ మెరుపును గమనించి వాళ్ళ అక్కకి అనుమానం వచ్చి చూపిస్తే అది రోల్డ్ గోల్డ్ అని తేలిపోయింది. అగో గట్లనే, కెసిఆర్ మీ పాలనలో స్వర్ణం ఎంత ఉందో కేటు ఎంత కలిసిందో లేదు తెలంగాణ మొత్తమే కాకి బంగారం అయిందో, అప్పు ఏందో అంశం ఏందో కుండబద్దలు కొట్టినట్టు మీరు చెప్తే వినాలని ఉంది దొరా! గంతే
మీరు సమస్త శక్తులను కూడా తీసుకొని శక్తియుక్తులను ఉపయోగించి ఎంతో చేసినప్పటికీ ఇమానం తప్పక బరాబరి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏడ కూసుండ పెట్టాలనో అక్కడనే కూసో పెట్టిండ్రు. అయినా మీరు ప్రజల (కుటుంబం) కొరకు ప్రజల(కుటుంబం) చేత, ప్రజల (కుటుంబం) యొక్క క్షేమం కొరకు రథ యాత్ర చేస్తున్న మీ యశస్సు సూర్యచంద్రులు ఉన్నంతవరకు దేదీప్యమానంగా వెలగాలని మీ కరకమలములకు సమర్పించుకుంటున్న సన్మాన పత్రం ఇది.
(కేసీఆర్ రథయాత్ర ప్రారంభ సందర్భంగా)
ఇట్లు
తెలంగాణ తరఫు రాసిన వారు
జూకంటి జగన్నాథం, కవి, రచయిత
94410 78095