ఏపీలో అభివృద్ధి నిల్‌, అప్పులు ఫుల్‌

by Ravi |   ( Updated:2023-03-20 18:45:56.0  )
ఏపీలో అభివృద్ధి నిల్‌, అప్పులు ఫుల్‌
X

రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి గత వారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అభివృద్ధి నిల్‌, అప్పులు ఫుల్‌ అన్నట్లుగా ఉంది. కేంద్రం నుండి నిధులు రాబట్టడానికి, విశాఖ ఉక్కును కాపాడడానికి, కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రస్తావన లేదు. ఈ నిధులతో పోలవరం పునరావాసం, వెలిగొండ, హంద్రీనీవా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయ్యే జాడ లేదు. అమరావతి నిర్మాణానికి నిధుల ప్రస్తావన లేదు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికుల రెగ్యులరైజేషన్‌ గురించి ప్రస్తావన లేదు. సీపీఎస్‌ రద్దు, ఉద్యోగుల బకాయిల ప్రస్తావన లేదు. కార్మికులను, ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఈ బడ్జెట్‌ పూర్తిగా విస్మరించింది. అంకెల గారడీతో ప్రజలను మోసం చేయడం, 4 ఏళ్ళ క్రితం చెప్పిన వాటిని పునశ్చరణ చేయడం తప్ప కొత్త పథకాలేవీ ప్రకటించలేదు. మొత్తం బడ్జెట్‌ ప్రజలకు భారంగాను, రాష్ట్ర అభివృద్ధికి విఘాతంగాను ఉంది.

వడ్డీ చెల్లింపులకే సరిపోదు

రూ. 2.79 లక్షల కోట్ల బడ్జెట్‌లో రాష్ట్ర అభివృద్ధికి రూ. 30 వేల కోట్లు మాత్రమే మూలధన వ్యయం పెట్టుబడికి కేటాయించారు. అంటే బడ్జెట్‌లో 10, 12 శాతం కూడా లేదు. గత సంవత్సరం ఇదే మూలధన వ్యయ పెట్టుబడికి రూ.32 వేల కోట్లు కేటాయించారు కానీ ఖర్చు చేసింది రూ.16 వేల కోట్లు మాత్రమే. ఉపాధి కల్పనకు, పారిశ్రామిక అభివృద్ధికి, ఇతర అభివృద్ధికి వెచ్చించింది నామమాత్రమే అని అర్ధం అవుతుంది. ప్రతి ఏటా అప్పులకు రూ.28 వేల కోట్లకుపైగా వడ్డీ చెల్లింపులకే సరిపోతోంది. ఇక అభివృద్ధి ఎక్కడ? గత సంవత్సరంలో పరిశ్రమలద్వారా 24 వేలమందికి ఉపాధి కల్పించామని ప్రభుత్వం బడ్జెట్‌లో చెప్పుకుంటున్నది. ఇది అత్యంత సిగ్గు పడాల్సిన విషయం. చదువుకున్న యువతకు ఉపాధి చూపకుండా కనీసం డీఎస్సీ పరీక్షలు పెడతామని కానీ, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు ఈ బడ్జెట్‌లో లేవు. గతంలో జాబ్‌ క్యాలెండర్‌ వాయిదా వేసినవాటిని పునర్ధురిస్తామని కూడా చెప్పలేదు.

గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం వాటా 10% క్రింద 500 కోట్లైనా కేటాయించాలి. కానీ అటువంటి ప్రతిపాదనలేవీ బడ్జెట్‌లో లేవు. కేటాయించిన నిధులలో కూడా ఎక్కువ భాగం మెటీరియల్‌ కాంపొనెంట్‌కే వెచ్చించి కూలీలు చేసే పనికి కోత పెట్టారు. జగనన్న ఇళ్ళకు ఉపాధి నిధులను మళ్లించారు. గతంలో ప్రకటించిన నవరత్నాల కోసం తప్ప కొత్త రేషన్‌కార్డులు, కొత్త పింఛన్లు మంజూరుకు కేటాయింపులు లేవు. తొలగించిన వేలాది మంది ఒంటరి మహిళలు, వికలాంగుల పింఛన్లు పునరుద్ధరణ చేయలేదు. 6 స్టెప్స్‌ ఫార్ములా చూపి అనాథలకు, ఏ ఆశ్రయం లేనివారికి పెన్షన్లు తగ్గించారు. అమ్మఒడి పథకం 3 లక్షల మందికి కోత పెట్టారు. విద్యాదీవెన, వసతి దీవెనలకు కేటాయింపులు పెరిగిన ధరలకు, ఫీజులకు అనుగుణంగా లేవు. ఉన్నత విద్యకు నిధులు తగినంత లేవు. అమ్మ ఒడికి ఇచ్చినట్లే ఇచ్చి కోతలు పెట్టారు. విద్య, వైద్యం, గ్రామీణ, పట్టణాభివృద్ధి, వ్యవసాయానికి నిధులు తగ్గించారు.

సకల ప్రాజెక్టులూ పెండింగులో...

ఇరిగేషన్‌కు గత సంవత్సరం రూ. 10,540 కోట్లు కేటాయిస్తే రివైజ్డ్‌లో రూ.1600 కోట్లు కోత విధించారు. ఈ సంవత్సరం కేవలం రూ. 1500 కోట్లు పెంచినట్లు చూపారు. 30 వేల కోట్లు ఖర్చు చేస్తే తప్ప ఆఖరి దశలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావు. పోలవరం 79 శాతం డ్యాం నిర్మాణం పూర్తయిందని చెప్పారు. పునరావాసం 22 శాతం మందికి కూడా పూర్తి కాలేదు. పునరావాసాన్ని మినహాయించి డ్యామ్‌ గురించి చెప్పడం అంటే గిరిజనులను గోదాట్లో ముంచడమే. అలాగే వెలిగొండ మొదటి సొరంగంకు నీళ్ళు ఇంతవరకు విడుదల చేయలేదు. అక్కడ పునరావాసం పూర్తికాలేదు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు అన్నీ పెండింగులో ఉన్నాయి. 100, 150 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యేవి కూడా నిధులు కేటాయించలేదు. రాయలసీమలో హంద్రీనీవా క్రింద చెరువులు నింపేందుకు ఈ బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు చూపలేదు. డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని చెప్పడం సీమ ప్రజలను మోసం చేయడమే. గత 4 సంవత్సరాల్లో సంవత్సరానికి రూ.45 వేల కోట్లు అప్పులు చేస్తే ఈ సంవత్సరం రూ.56 వేల కోట్లకు పెరిగింది. అప్పులు పెరగడమంటే ప్రజల మీద అదనపు భారాలు వేసే ప్రమాదం ఉంది. ఈ బడ్జెట్‌లో పన్నుల భారం 24శాతం పెరిగింది.

సమ్మిట్ సరే.. పరిశ్రమలెక్కడ?

విశాఖ పారిశ్రామిక సమ్మిట్‌కు 48 దేశాల నుండి పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారని 6 లక్షల ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు రాబోతున్నాయని గొప్పగా ప్రకటించారు. కానీ ఎక్కడా ఏ పరిశ్రమలు రాబోతున్నాయో చెప్పకుండా ఇలాంటి కబుర్లతో రాష్ట్రంలోఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి ఎలా కల్పిస్తారు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు కనీసం 25 శాతం నిధులు కేటాయించాలి. కానీ కేటాయించిన నిధులలో కూడా సగానికి సగం కోతలు పడుతున్నాయి. గత సంవత్సరం రూ. 20 వేల కోట్లు కేటాయించారు. మొత్తం సాధారణ పథకాలకు మళ్ళించారు. 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారని ఆర్థిక మంత్రి ఒకవైపు ప్రకటిస్తూ వ్యవసాయ రంగానికి గత సంవత్సర కేటాయింపుల్లో రూ.920 కోట్లు కోత కోశారు. కనీసం 10 శాతం కూడా కేటాయించకపోవడం శోచనీయం. రైతు భరోసా కింద ఒక్కో రైతుకు రూ.13,500 ఇచ్చే మొత్తం 5 ఏళ్ళ నుండి అదే కొనసాగుతోంది. పొలంబడి పేరుతో 26 శాతం ఖర్చు తగ్గించామని చెబుతున్న మాట బోగస్‌.

రైతుకు రోజురోజుకూ ఖర్చు పెరుగుతున్నది. గిట్టుబాటు ధరలు రాక కౌలు రైతులు పెద్దసంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కౌలు రైతులకు చట్టం గాని, సహాయం గాని ఈ బడ్జెట్‌లో ప్రస్తావన లేదు. కౌలు రైతులకు రుణం, ప్రభుత్వ సహాయం, నష్టపరిహారం గ్యారెంటీ చేయకుండా వ్యవసాయం అభివృద్ధి అవ్వదు. రైతు భరోసా కేంద్రాలు రైతులు, మిల్లర్లకు మధ్యవర్తులుగా తప్ప గిట్టుబాటు ధర గ్యారెంటీ చేసే సంస్థలుగా లేవు. రైతు భరోసా క్రింద రైతులకు రూ.25 వేలు ఇవ్వాలి.

ఈ బడ్జెట్‌ అభివృద్ధి రహిత బడ్జెట్‌. రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి ఏమాత్రం తోడ్పడేదిగా లేదు. సుపరిపాలన అని ప్రభుత్వం చెప్పుకుంటున్నది కేవలం ఉత్త మాటలే. రాష్ట్రంలో అవినీతి, నిరంకుశత్వం పెరిగాయి. ప్రజలకు ఏమీ చేయకపోగా వారి సమస్యలపై అడిగేందుకు కూడా వీలు లేకుండా జివో నం.1 తెచ్చి అణచివేత కార్యక్రమం తీసుకుంది. నిరంకుశత్వం ఎప్పుడూ లేనంతగా పెరిగింది. కాబట్టి సుస్థిరాభివృద్ధి, సుపరిపాలన అనేది కేవలం ఆకర్షణ కోసం తప్ప ఆచరణలో దానికి విరుద్ధంగా వుంది.

మేకల రవి కుమార్

82474 79824

Advertisement

Next Story

Most Viewed