ప్రమాదకరంగా నూతన క్రిమినల్ చట్టాలు..

by Ravi |   ( Updated:2024-09-26 00:30:30.0  )
ప్రమాదకరంగా నూతన క్రిమినల్ చట్టాలు..
X

ప్రజాస్వామ్యానికి వెన్నెముక కావాల్సిన జర్నలిజం అభద్రతలో చిక్కి అల్లాడే పరిస్థితులు దాపురించాయి.. దేశ అభివృద్ధి, భద్రతకు పొంచి ఉన్న ముప్పును ఇది సూచిస్తుంది. చరిత్ర పొడవునా జర్నలిజంపై హింస పై చేయిగా కొనసాగుతున్నదని రుజువు చేస్తున్నది. నిజాలు నిర్భయంగా రాస్తున్నందుకు ప్రాణాలు పోగొట్టుకుంటున్న పత్రికా విలేఖరుల ఉదంతాలను 400 సంవత్సరాల చరిత్ర మూలాలను పరిశీలించినట్లయితే పత్రికలు ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా నిలవడం కనిపిస్తుంది.

రాబిన్సన్ క్రూసో గ్రంథకర్త. డేనియల్ డిఫొ (1660-1731) పత్రికల స్వేచ్ఛ కోసం పోరాటం సాగించిన తొలి తరం వారిలో ఒకరు. ఆయన తలను చేతులను ఒక చట్రంలో బిగించి ప్రభుత్వం శిక్షించింది. ఈ సంద ర్భంగా భారతదేశంలో షోబుల్లా ఖాన్ నుండి గౌరీ లంకేష్ దాకా సోదాహరణగా చారిత్రక పరిణామాలను పాలమూరు అధ్యయన వేదిక గద్వాల జిల్లా శాఖ ఆధ్వ ర్యంలో జరిగిన సెమినార్‌లో ఎం.ఏ. సత్యనారాయణ రావు చర్చించారు. 'ప్రజాస్వామ్యం -జర్నలిజం' అంశంపై మాంచాల అచ్యుత సత్యనారాయణ రావు, 'నూతన క్రిమినల్ చట్టాలు- దేశ అవసరాలు' అనే అంశంపై ఎం.డి. ఇక్బాల్ పాషా చేసిన ప్రసంగాలు సభికులలో ఆలోచనలు రేకెత్తించాయి.

2024 జూలై 1 నుంచి అమలులోకి వచ్చిన మూడు భారతీయ నూతన క్రిమినల్ చట్టాలు, కోర్టుల్లో లక్షలాదిగా పేరుకు పోయిన పెండింగ్ కేసుల సమస్యను మరింత జటిలం చేసేవిగా ఉన్నాయని ఎండీ. ఇక్బాల్ పాషా పేర్కొన్నారు. ఈ చట్టాలు పౌరులను పాలితుల స్థాయికి దిగజార్చి, బాధ్యతలకే పరిమితం చేసి రాజ్యాంగం కల్పించిన హక్కులను నిర్వీర్యం చేసేవిగా, అణచివేతను తీవ్రం చేసేవిగా, పోలీసులకు అపరిమిత అధికారాలను కట్టబెట్టేవిగా ఉన్నాయి.. ఇది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. విస్తృత చర్చ లేకుండానే అనేక స్థాయిలలో చర్చించామని బుకాయించి ఆదరాబాదరాగా ఎన్నికల క్లిష్ట సమయంలో వర్షాకాల పార్లమెంట్ సెషన్ చివరిరోజు చర్చకు తావు లేకుండా ప్రవేశపెట్టారు. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ భద్రత అంశంపై చర్చ సందర్భంలో ఉభయ సభల నుంచి 146 మంది ప్రతిపక్ష సభ్యులను బహిష్కరించి ఆమోదానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో 2వ బిల్లును ఉపసంహరించుకొని డిసెంబర్ 19న మళ్లీ మూడు చట్టాల రెండో బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోదం జరుపుకొని రాష్ట్రపతి సంతకంతో గజిట్‌లో ప్రచురించి 2024 జులై 1 నుండి అమలులోకి వస్తుందని ఫిబ్రవరి 24న నోటిఫికేషన్ జారీ చేశారు.

చట్టాల రూపకల్పనలో విశాల దృక్పథమే ఉంటే.. విస్తృత, సమగ్ర చర్చ జరగకుండా ప్రతిష్టాత్మకమైన దేశ ముఖ్య చట్టాల అమలులో ఇంత ఆదరాబాదిరి తొందర ఎందుకో అర్థం కాదు. ఆచరణలో వీటి అసలు సారం అర్థమవకపోదు. నిజానికి ఇప్పుడు దేశం ఎదురుకుంటున్న అదుపులేని నిత్యావసరాల ధరలూ, మహిళలపై పెచ్చరిల్లుతున్న హింస, విదేశీ స్వదేశీ కార్పొరేట్ శక్తులకు దేశ వనరుల తరలింపు, లాభదాయక ప్రభుత్వ రంగ సంస్థల అమ్మ కాలూ, నిరుద్యోగం, వ్యవసాయరంగ సంక్షోభం, రైతు ఆత్మహత్యలూ తదితర తక్షణ సవాళ్లకు పరిష్కారాలు వీటి ద్వారా లభించగలవా..? అని సెమినార్‌లో వక్తలు ప్రశ్నించారు.

- మాంచాల అచ్యుత సత్యనారాయణ రావు

94940 52775

Advertisement

Next Story

Most Viewed