భయం గుప్పిట్లో ఏపీ ప్రజలు..

by Ravi |   ( Updated:2023-08-02 00:45:47.0  )
భయం గుప్పిట్లో ఏపీ ప్రజలు..
X

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అవడంతో శాంతి భద్రతలు అదుపుతప్పాయని ప్రజలు భావిస్తున్నారు. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి వాడుకోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించినట్లుంది. ప్రతిపక్ష నేతలకు, పార్లమెంట్, శాసనసభ్యులకే రక్షణ కరువైంది. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? వినుకొండ, తాడిపత్రి, కొండేపి, మాచర్ల, నరసరావుపేట, కుప్పం, గన్నవరంలో తదితర ప్రాంతాల్లో ప్రతిపక్ష నేతలపై వైసీపీ మూకలు దాడులకు దిగినా పోలీసులు చోద్యం చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నిరంకుశత్వంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. కక్ష సాధింపులు, పగ, ప్రతీకారాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి పాలన చేస్తున్నారు. రజాకార్లు కూడా ఇంతటి నిర్బంధాలను కొనసాగించలేదు. ఫాసిస్టులను, నాజీలను గుర్తుకుతెస్తున్నారు.

ఎన్నో నేరాలు..

ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై 1,22,000 నేరాలు జరిగాయి. గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే 2019-2021 మధ్య రాష్ట్రంలో బాలికల అపహరణ 53 శాతం పెరిగింది. మహిళలపై జరిగిన నేరాలు, అఘాయిత్యాలు 43.45 శాతం పెరిగాయి. 8 గంటలకు ఒక అత్యాచారం, ప్రతి 12 గంటలకు ఒక కిడ్నాప్, ప్రతి గంటకు ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులు, ప్రతి మూడు గంటలకు ఒక హత్య, వారానికి సగటున నలుగురు ఎస్సీ, ఎస్టీ మహిళలపై అత్యాచారం, రోజుకు 9 మంది బాలికలు, 24 మంది మహిళలు అదృశ్యమవుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 22,278 మంది మహిళలు, 7,918 మంది బాలికలు అదృశ్యమయ్యారని కేంద్ర మంత్రి రాజ్యసభలో వెల్లడించడం వీటికి అద్దం పడుతున్నాయి. ఈ వాస్తవాలు వెల్లడించిన పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు ముప్పేట దాడిచేసి తప్పుడు కేసులు పెట్టించారు. వాలంటీర్ల వేధింపుల ఘటనలు 4,320. అధికారికంగా నమోదుకానివి 36 వేల ఘటనలు ఉన్నాయి. వీటిపై ముఖ్యమంత్రికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగిన ఘటనలు 6,604, సైబర్ నేరాలు 5,660. గృహహింస ఘటనలు 15,065. సామూహిక అత్యాచారాలు 44. యాసిడ్ దాడులు 9. హత్యలు 991. స్థానిక సంస్థల్లో మహిళలపై జరిగిన వేధింపులు 442 ఉన్నాయి.

చరిత్రహీనంగా.. పోలీసు వ్యవస్థ

రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న వరుస అఘాయిత్యాలు, సంఘటనలు చూస్తే శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయనేది అర్థమవుతోంది. ఏలూరు జిల్లా కే ఆర్ పురం ఐటీడీఏ పరిధిలో నాలుగో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని దారుణంగా హత్యచేశారు. ఒంగోలులో ఓ బాలికను ఇంట్లో బంధించి 15 రోజుల పాటు అత్యాచారం చేశారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సంగపేటలో నందం సువర్ణ అనే దళిత మహిళను హత్య చేశారు. కొవ్వూరు మండలం పశివేదలలో ఈరుగల శ్రీనివాస్ అనే వ్యవసాయ కూలీ హత్యకు గురయ్యాడు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండల పరిధిలోని రాయలసీమ థర్మల్ ప్లాంట్ లో పనిచేస్తున్న ఉద్యోగిని రాడ్లతో బాది దారుణంగా హత్య చేశారు. గత నెలలో విశాఖ జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఎంపీ భార్య, కొడుకు, ఆడిటర్ లను కిడ్నాప్ చేశారు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన సంఘటన 48 గంటల వరకు పోలీసులకు తెలియలేదు. ఈ కిడ్నాప్ గురించి డీజీపీ ఇచ్చిన వివరణను చూసి ప్రజలు నవ్వుకున్నారు. పోలీసులే భక్షక భటులై సొంత పార్టీ పార్లమెంట్ సభ్యులను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసి తప్పుడు కేసులు పెట్టారు. రాజధాని ప్రాంతంలో రాళ్లు, చెప్పులతో దాడిచేస్తే ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఆనాటి డీజీపీ సెలవిచ్చారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తూ.. ముఖ్యమంత్రి పైశాచితక విధానాలు గుడ్డిగా అమలుచేయడం ద్వారా పోలీసు వ్యవస్థ చరిత్రహీనంగా మిగిలిపోతుంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు చట్టాన్ని సమాధి చేస్తున్నారు. దీనివల్ల పోలీసు వ్యవస్థకే మాయని మచ్చలా మిగిలిపోనుంది.

ఈ మధ్య కాలంలో జరిగిన నేరాలు-ఘోరాలు రాష్ట్ర ప్రజలను షాక్ కు గురిచేశాయి. తన అక్కను అల్లరి చేయొద్దని ప్రశ్నించిన పదవ తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్‌ను పట్టపగలే పెట్రోల్ పోసి తగులబెడితే శాంతిభద్రతలు ఉన్నట్లా? అధికార పార్టీ ఎమ్మెల్సీ దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేశారు. ప్రకాశం జిల్లాలో దళిత మహిళ హనుమాయమ్మను ట్రాక్టర్‌తో గుద్ది తొక్కించి చంపితే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్లా లేనట్లా? నెల్లూరులో టాబ్లెట్ల కోసం మెడికల్ షాప్‌కు వెళ్తున్న మహిళను అందరూ చూస్తుండగా లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేస్తే శాంతి భద్రతలు సజావుగా ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదంగా లేదా? చిత్తూరు పోలీసు స్టేషన్‌లో సాక్షాత్తు పోలీసు జీపును దొంగలిస్తే, ఆ విషయం ఆరు గంటల వరకు పోలీసులకు తెలియదంటే డీజీపీ దీనిపై ఏం సమాధానం చెబుతారు?

దూషణలకు దిగితే.. ప్రమోషనా?

సీఎం సొంత నియోజకవర్గమైన పులివెందులలో దళిత వృద్ధుడిని అధికార పార్టీ దుండగులు కర్రలతో అందరూ చూస్తుండగా కొట్టి చంపారు. ఈ విషయం ముఖ్యమంత్రికి తెలిసినా మౌనంగా ఉండటం దేనికి సంకేతం? అనంతపురంలో తుమ్మల వంశీ అనే వ్యాపారి తన భూమిని అధికార పార్టీ పెద్దలు కబ్జా చేశారని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. నందికొట్కూరులో ఒక ముసలమ్మ పీక కోసి హంతకులు నిర్భయంగా బయటికి వెళ్లి యథేచ్ఛగా తిరుగుతున్నారు. తాడిపత్రిలో నిద్రపోతున్న వ్యక్తులపై పెట్రోల్ పోసి తగలబెడితే శాంతి భద్రతలు ఉన్నట్లా? మద్యం, ఇసుక అక్రమాలను ప్రశ్నించిన వారిని కిరాతకంగా చంపేశారు. ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించిన వరప్రసాద్ అనే యువకుడిని పోలీస్ స్టేషన్లోనే గుండు కొట్టి అవమానించారు.

జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై జోగి రమేష్ అల్లరి మూకలతో దాడి చేశారు. అదేవిధంగా నిత్యం ప్రతిపక్షనేతలపై వ్యక్తిగత దూషణలకు దిగడంతో మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. టీడీపీ నాయకులు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేసిన వ్యక్తికి మాచర్ల మున్సిపల్ ఛైర్మన్‌గా పదోన్నతి కల్పించారు. నాలుగేళ్లలో ప్రతిపక్షాలకు చెందిన 72 మంది కార్యకర్తలను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. వేలాది మంది నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై 250కు పైగా అక్రమ కేసులు నమోదు చేసి కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడ్డారు. లోకేష్‌పై అక్రమంగా 20 కేసులు నమోదు చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తును అడ్డుకుంటూ సీబీఐ అధికారులపైన కేసులు పెట్టారు. పోలీసులే హంతకులకు రక్షణగా ఉంటూ వారిని కాపాడుతున్నారని సాక్షాత్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

వాస్తవాలను ప్రజలకు తెలియపరచొద్దా?

అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ 2021-22 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన నివేదిక విడుదల చేసింది. ఏయే దేశాల్లో మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నారో అనే అంశంపై ప్రతి ఏడాది ఒక నివేదికను విడుదల చేస్తుంది. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పాలన ఉంది ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను ఎలా హరిస్తున్నారనే అంశాలను ఈ నివేదికలో ప్రత్యేకంగా పొందుపర్చారు. పాలకపక్షం పోలీసు వ్యవస్థను ఎలా దుర్వినియోగం చేస్తున్నదీ, వారి ద్వారా ప్రతిపక్షాలను, ప్రశ్నించే వారిని, మీడియాను ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నది ఇందులో ప్రస్తావించారు. ముఖ్యంగా దళితులు, మహిళలపై జరుగుతున్న దాడులు పొందుపర్చారు.

ప్రభుత్వ వైఫల్యాలను మీడియా ప్రశ్నించకుండా చేసేందుకు జీవో నెం.2430 తెచ్చారు. వాస్తవాలను ప్రజలకు తెలియపరచడం కూడా తప్పే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో జీవో నెం.1 తెచ్చి ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. శాంతిభద్రతలను అదుపుచేయడంపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి. పోలీసులు అధికార పక్షానికి దాసోహం మాని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి. పాలకపక్షం చేతిలో పోలీసు వ్యవస్థ కీలుబొమ్మగా మారరాదు. ఈ రాజకీయ చదరంగంలో పోలీసులు పావులుగా మారితే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదు. కాబట్టి చిత్తశుద్ధితో శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

మన్నవ సుబ్బారావు

గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్

99497 77727

Advertisement

Next Story