ప్రారంభమే కాదు.. పర్యవేక్షణా ముఖ్యమే!

by Ravi |   ( Updated:2024-12-18 00:30:51.0  )
ప్రారంభమే కాదు.. పర్యవేక్షణా ముఖ్యమే!
X

విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలో రూపు దిద్దుకుంటుంది అని మహానుభావులు చెప్పిన మాట అక్షర సత్యం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో, గురుకులాల్లో 'కామన్ డైట్ ' ప్రారంభించడం అభినందనీయం. గతంలో మాదిరి కాకుండా వారంలో ఆరు రోజులు మాంసాహారం, ప్రతి రోజూ గుడ్డు, అరటి పండు, స్నాక్స్ వంటివి జాబితాలో చేర్చడం ద్వారా విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదల అభివృద్ధికి ముందడుగు వేసినట్లే. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ప్రారంభించిన మొదటి రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రి వర్గం సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులతో పాటు సహపంక్తి భోజనాలు చేయటమే కాదు, నిత్యం గురుకులాల్లో విద్యార్థులకు ఏ మేరకు అందుతున్నాయో పర్యవేక్షించడం చాలా ప్రాముఖ్యతతో కూడిన అంశం. వారానికోసారి లేదా నెలకోసారి ఆకస్మిక తనిఖీలతో పాటు పర్యవేక్షించే అధికార యంత్రాంగాన్ని పటిష్టంగా నిర్వహించి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెంచిన డైట్ చార్జీలకూ అనుగుణంగా నాణ్యమైన వంట సరుకులు, పుష్టికరమైన భోజనం సక్రమంగా అందుతున్నాయో లేదో నిత్యం పర్యవేక్షణ చేయడం అతి ముఖ్యం. విద్యార్థులపై ప్రభుత్వం వెచ్చిస్తున్న ఆర్థిక వనరులకు తగిన న్యాయం చేకూరుతుందో లేదో ప్రభుత్వం నిత్యం సంబంధిత అధికారులను ఆదేశించాలి. 'సంసారం పెద్దది - మెడ వట్టిది' అన్న చందాన కాకుండా చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో విద్యార్థులపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు చిగురించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇదే తరహాలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేయాలి . తెలంగాణ విద్యార్థి లోకానికి బంగారు బాటలు వేయాలి.

-ఎమ్ ధనంజీ

96661 09616

Advertisement

Next Story

Most Viewed