రాష్ట్రానికి జీవనాడి... పోలవరం పూర్తయ్యేదెన్నడు?

by Ravi |   ( Updated:2023-08-03 00:15:59.0  )
రాష్ట్రానికి జీవనాడి... పోలవరం పూర్తయ్యేదెన్నడు?
X

రెడ్డొచ్చె మొదలాడరా అన్నట్లుంది పోలవరం నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. జగన్మోహన్ రెడ్డి తొలిసారి పోలవరంపై చేసిన సమీక్షలో డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి అయ్యిందని, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం పనులు మొదలుపెడతామని అధికారులు చెప్పారు. ఆర్ అండ్ ఆర్ పరిహారం ఇచ్చి నిర్వాసితులను తరలిస్తే, సాంకేతిక కారణాల వల్ల ఆపిన అప్పర్ కాఫర్ డ్యామ్ లోని గ్యాప్స్‌ను పూర్తిచేస్తామని, లోయర్ కాఫర్ డ్యామ్ ఎత్తుపెంచుతామని, తరువాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు జరుగుతాయిని అధికారులు స్పష్టంగా చెప్పారు. అధికారులు చెప్పినదానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకుని నిర్మాణం పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థను తొలగిస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.

కేంద్రం వద్దన్నా గుత్తేదారు మార్పు

పోలవరం నిర్మాణంలో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, గుత్తేదారుకు అనుచిత లబ్ధి చేకూరిందని ఆరోపిస్తూ దీనిపై సమగ్ర విచారణ చేసి నివేదిక సమర్పించడం కోసం నిపుణుల కమిటీని నియమించారు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ కమిటీ పోలవరం నిర్మాణంలో చంద్రబాబు చేసుకున్న ఒప్పందాల్లో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని, గుత్తేదారు కంపెనీకి రూ. 2346.85 కోట్లు అదనపు చెల్లింపులు జరిగాయని, చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని 2019 జూలై 23న సిఫార్సు చేసింది. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ కాంట్రాక్ట్ రద్దు చేయాలన్న ముఖ్యమంత్రి జగన్ అభ్యర్థనను ప్రధాన మంత్రి కార్యాలయం నిర్ద్వందంగా తిరస్కరించడమే కాక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కనుగొనని వైరుధ్యాలు, అవకతవకలు కమిటీ రిపోర్టులో ఏమున్నాయని ప్రశ్నించింది. గుత్తేదారును అసంబద్ధంగా తొలగించడం టెండర్ నిబంధనల పూర్తిగా ఉల్లంఘించడమే అని కూడా స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 2019 ఆగస్ట్‌లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు సమర్పించిన నివేదికలో ప్రస్తుత గుత్తేదారు నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ సంతృప్తికరంగా నిర్మాణం చేపడుతోందని, రాష్ట్ర ప్రభుత్వం గుత్తేదారు మార్పునకు తగిన కారణం ఒక్కటి కూడా చూపలేదని, ఈ ప్రయత్నం అసంబద్ధమైనదని, దీనివలన ప్రాజెక్ట్ నిర్మాణం ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొంది.

రివర్స్ టెండర్ మాయ

మునుపటి టెండర్ రద్దు చేసి ' రివర్స్ టెండర్ ' ద్వారా తిరిగి కాంట్రాక్ట్ సంస్థను నియమించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. పోలవరం పనులు ఆపేయడం తగదని, కొత్తగా టెండర్లు పిలిస్తే చాలా సమస్యలు ఎదురవు తాయని, పోలవరం పనుల్లో తగిన పురోగతి ఉన్నందున గుత్తేదారును మార్చవలసిన అవసరం లేదని పిపిఎ అభ్యంతరం తెలిపింది. ప్రస్తుత వర్షాకాలంలో డిజైన్లు ఖరారు చేసుకుంటే ఆ తర్వాత పనులు త్వరగా పూర్తి చేయవచ్చని హితవు పలికింది. రివర్స్ టెండరింగ్ చేస్తే పోలవరం నిర్మాణంలో వచ్చే ఇబ్బందులకు గతంలో పనిచేసిన సంస్థలు సమాధానం చెబుతాయా లేక కొత్తగా వచ్చిన సంస్థలు చెబుతాయా అని కూడా ప్రశ్నించింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, సీడబ్ల్యుసీ, పిపిఏ అభ్యంతరాలను పట్టించుకోకుండా ప్రాజెక్ట్ నిర్మాణం పనులు అర్ధాంతరంగా నిలిపేసి, అక్టోబర్ 2019లో రివర్స్ టెండర్లు నిర్వహించి, నవంబర్ 2019 లో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారికి ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. రివర్స్ టెండర్ పేరిట రూ. 780 కోట్లు ఆదా అయ్యిందని ప్రజలను మభ్య పెట్టి దొడ్డి దారిన ఇసుక రూపంలో మెగా కంపెనీకి 500 కోట్లు కట్టబెట్టారు.

అమూల్యమైన సమయం వృధా

2019 మే నాటికి మిగిలిన ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం మట్టి పనిని 2020 మే నాటికి పూర్తి చేయాలని పిపిఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినా జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, ప్రాజెక్ట్ నిర్మాణంలో అనుభవ లేమితో ఆలస్యం చేసిన గుత్తేదారు సంస్థ నిర్వాకం వల్ల, 2020 ఆగస్ట్‌లో గోదావరి భారీ వరదల వలన ఎగువ కాఫర్ డ్యాం వద్ద రెండు చోట్ల గోదావరి నదీ గర్భం పెద్ద ఎత్తున కోసుకుపోయింది, టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డయాఫ్రం వాల్ దెబ్బతింది నిర్మాణం శరవేగంగా సాగుతున్న దశలో కాంట్రాక్ట్ కంపెనీని మారిస్తే పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందని కేంద్రం వారించినా వినకుండా గుత్తేదారును మార్చడం కోసం జరిగిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియ వలన పోలవరం నిర్మాణంలో అమూల్యమైన 6 నెలల సమయం పూర్తిగా వృధా అయ్యింది. ఆ తరువాత కూడా పనులు వేగంగా సాగలేదు. మొత్తం ఎగువ కాఫర్ డ్యాం పని 73.94 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనిలో నవయుగ వారు 2019 మే నాటికి, ఆరు నెలల్లోనే 38.12 లక్షల క్యూబిక్ మీటర్ల పని చేశారు. కాబట్టి మిగిలిన 38.12 లక్షల క్యూబిక్ మీటర్ల పని కూడా ఆరు నెలల్లోనే పూర్తి చేయవచ్చు. వరదల వల్ల కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తి చేయడమే ముఖ్యమైన నేపథ్యంలో దాని మీద దృష్టి సారించి ఇంకా ఎక్కువ యంత్రాలను ఉపయోగిస్తే అంతకన్నా తక్కువ సమయంలో కూడా చేయవచ్చు. దిగువ కాఫర్ డ్యాంలో మిగిలి ఉన్న మట్టి పని కూడా 25.46 లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే. 2019 నవంబరు నుండి 2020 ఏప్రిల్‌లో కరోనా ఉధృతి పెరిగే వరకు ఉన్న ఆరు నెలల సమయంలోనైనా ఎగువ కాఫర్ డ్యాం గ్యాపుల్లో మిగిలి ఉన్న పని, దిగువ కాఫర్ డ్యాం పని పూర్తి చేసి ఉంటే ఈ విధ్వసం వాటిల్లే అవకాశం లేని మాట వాస్తవం. కొత్త టెండర్లు అనర్థదాయకం అని పిపిఎ చెప్పినా వినకుండా, పనులు ఆపేసి, దాదాపు 15 నెలలు కాలహరణం చేసి, సమయం ఉన్నా కాఫర్ డ్యాంలు పూర్తి చేయకపోవడం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, గుత్తేదారు వైఫల్యమే. పోలవరం అథారిటీ, హైదరాబాద్ ఐఐటీ (థర్డ్ పార్టీ) కూడా పోలవరం వైఫల్యాలకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ తీరే కారణమని తేల్చి చెప్పాయి.

కమిటీ సిఫార్సులు బేఖాతరు

నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా రివర్స్ టెండర్‌కు వెళ్లి పోలవరం నిర్మాణంలో ఇంతటి విధ్వంసాన్ని సృష్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆశ్చర్యంగా నిపుణుల కమిటీ సిఫార్సులను బుట్ట దాఖలు చేసింది. రాజ్య సభలో 2019 డిసెంబర్ 2న తేదీన వైకాపా ఎంపీ విజయ సాయి రెడ్డి పోలవరంలో రూ.2346.85 కోట్లు అదనపు చెల్లింపులు జరిగాయని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సులపై తీసుకుంటున్న చర్యల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా .. నిపుణుల కమిటీ అభిప్రాయాలు ప్రాథమికమైనవని, పైన పేర్కొన్న చెల్లింపుల విషయంలో ఎలాంటి విధానపరమైన లేదా నియమాల ఉల్లంఘనలు జరగలేదని, అన్ని నిర్ణయాలు 'కాంపిటెంట్ అథారిటీ' అనుమతితోనే జరిగాయని .. రాష్ట్ర ప్రభుత్వం 2019 నవంబర్ 13న కేంద్రానికి లేఖ రాసిందని కేంద్ర సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా సమాధానం ఇచ్చారు. అంటే నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా పాత టెండర్ రద్దు చేసి, రివర్స్ టెండర్లు పిలిచి గుత్తేదారుని మార్చి, 2019 నవంబర్ 13న అదే నిపుణుల కమిటీ సిఫార్సులను బుట్ట దాఖలు చేశారంటే అర్థం ఏమిటి?

పోలవరానికి 'జె' గ్రహణం

కేవలం తన స్వార్థ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల సాధన కోసం, అస్మదీయులకు ప్రయోజనం చేకూర్చడం కోసం నిపుణుల కమిటీ ముసుగులో జగన్మోహన్ రెడ్డి ఆడించిన నాటకం ఫలితంగా ప్రాజెక్టులో జరిగిన విధ్వంసం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం నిర్మాణం ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియని దౌర్భాగ్యపు పరిస్థితి దాపురించింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో కేంద్రం వద్దన్నా ఎందుకు ప్రయోగాలు చేశారో, ఏం సాధించారో ప్రజలకు సమాధానం చెప్పాలి. 'చంద్ర కాంతిలో' వడివడిగా నిర్మాణం కొనసాగిన పోలవరం ప్రస్తుత దారుణ పరిస్థితికి అసలు కారణం 'జె' గ్రహణమే.

లింగమనేని శివరామ ప్రసాద్

79813 20543

Advertisement

Next Story