- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వర్గీకరణే జీవిత లక్ష్యం కారాదు!

భారతదేశ సామాజిక వ్యవస్థలో కులానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో జగమెరిగిన సత్యం. నేడు ఆధునిక భారతంలో కూడా ప్రభుత్వ విధి విధానాలను ప్రభుత్వ పథకాలను అమలు చేయాలంటే ప్రతి అంశంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా కులం ప్రభావం ఉంటది. ఐతే కులంతో అనాటి నుండి నేటి వరకు అత్యధికంగా లబ్ధి పొందుతున్నది 10% ఉన్న అగ్రకులాలే ఎందుకంటే స్వాతంత్రానంతరం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వంలో మెజార్టీ నాయకులు అగ్రకులాల నాయకులే, కులం మూలంగా అత్యధికంగా వెనుకబాటుకి గురవుతున్నది మాత్రం మెజారిటీగా ఉన్న అణగారిన వర్గాలే..
ఐతే అగ్రవర్ణాలమని చెప్పుకుంటూ స్వాతంత్రం ముందు స్వాతంత్రం తర్వాత కూడా భారతదేశ పాలన వ్యవస్థలో చక్రం తిప్పుతున్నది 10% ఉన్న అగ్రవర్ణాలైతే 90% పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆనాటి నుండి నేటి వరకు పాలితులుగానే ఉంటున్నారు. ఐతే ఎస్సీ కులాల రిజర్వేషన్ ఫలాలు ఆ కులంలోని అన్ని కులాలకు సమ పంపిణీ కావాలనే అంశంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మూడు దశాబ్దాలుగా అనేక మంది నాయకులు ఎస్సీ వర్గీకరణ కావాలని సామాజిక న్యాయం కోసం పోరాటాలు చేస్తున్నారు. వారిలో ప్రధానంగా ఎమ్మార్పీఎస్ వేదికగా మందకృష్ణ మాదిగ ఒకరు.
రాష్ట్రాలే వర్గీకరణ చేసుకోవచ్చని..
ఆనాటి సామాజిక పోరాటాల మూలంగా సామాజిక న్యాయం అమలుకై చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయడం జరిగింది. అయితే కొద్ది కాలానికి ఆ వర్గీకరణ అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో సమపంపిణీ కావడం లేదని సుప్రీంకోర్టు కొట్టి వేయడం జరిగింది. ఇక ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎస్సీ వర్గీకరణకై అనేక సామాజిక పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా గత సంవత్సరం ఆగస్టు 1న సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్, కేంద్ర పార్లమెంట్ చట్టంతో సంబంధం లేకుండా ఆయా రాష్ట్రాలే వర్గీకరణ చేసుకోవచ్చని వెసులుబాటు ఇస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అమలుకై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ని నియమించింది. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌లోని క్రిమిలేయర్ మాత్రమే మినహాయిస్తూ, మిగతా అంశాలు అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తామంటున్న ఎస్సీ వర్గీకరణ 59 కులాలను గుర్తించి మూడు విభాగాలుగా విభజించారు. వాటిలో గ్రూప్-1 కేటగిరిలో సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అత్యంత వెనుకబడిన 15 కులాలని చేర్చి 3.288% జనాభాకి 1% రిజర్వేషన్, గ్రూప్-2 కేటగిరీలో మద్యస్థంగా లబ్ధి పొందిన కులాలుగా 18 సమూహాలని ప్రధానంగా మాదిగ ఇతర ఉప కులాలని చేర్చి 62.48% జనాభాకి 9% రిజర్వేషన్, గ్రూప్-3 కేటగిరీలో మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలుగా 26 సమూహలని ప్రధానంగా మాల ఇతర ఉప కులాలని చేర్చి 33.963% జనాభాకి 5% రిజర్వేషన్‌ను 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయిస్తామని తీర్మానం చేశారు..
బహుజన రాజ్య స్థాపనకై సిద్ధమవుదాం!
అయితే ఈ నూతన వర్గీకరణ ప్రక్రియతో కొందరు విభేదించినా, సమర్ధించినా ఎస్సీల చిరకాల కల నెరవేరబోతున్నందుకు సంతోషిస్తూ, స్వల్ప పొరపాట్లను వెతికి మళ్లీ వర్గీకరణ అంశాన్ని ఇలానే కొనసాగించకుండా ఇక విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందుతూ, తరతరాలుగా రాజ్యాధికారంలో, సంపదలో, భూభాగంలో అన్యాయానికి గురవుతున్నందుకు బహుజన రాజ్యాధికార స్థాపన పోరాటానికై సిద్ధమవుదాం. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అగ్రకులాలు మాల మాదిగలపై చేసిన అనేక దాడుల సంఘటనల్లో ఒకరికొకరు అన్నదమ్ముల వలె కలిసి పోరాడి హక్కులకై, న్యాయం కోసం ఉద్యమించారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బహుజన రాజ్య స్థాపన కోసం కాన్షీరాం వచ్చినప్పుడు వారి ఆలోచనలకి అనుకూలంగా ఎందరో దళిత బహుజన నాయకులు కృషి చేశారు.
రాష్ట్రస్థాయి చట్టాలు సరిపోవు!
ఆయన మరణనంతరం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అణగారిన వర్గాల్లో బహుజన రాజ్యాధికార ఆకాంక్ష బలహీనమైపోయింది. ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడమే జీవితకాల లక్ష్యం అయిపోయింది. ఇదొక్కటే జీవితకాల సమస్య కాదు. ఎస్సీ వర్గీకరణతో రాష్ట్ర స్థాయిలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా, ఉద్యోగాల్లో అవకాశాన్ని దక్కించుకోగలం కానీ కేంద్ర స్థాయి ఉద్యోగాల్లో సమాన వాటాకి రాష్ట్రస్థాయి చట్టాలు సరిపోవు.. కాబట్టి అంతిమంగా పార్లమెంటులో జనాభా ధామాషా ప్రకారం ఆయా కులాల ప్రతినిధులు ఉంటేనే అన్ని సామాజిక వర్గాల వారికి అన్ని రంగాల్లో తమకి పంపిణీ జరుగుతుంది. అప్పుడే ఆయా కులాలకు సామాజిక రాజకీయ ఆర్థిక రంగాల్లో సమన్యాయం జరుగుతదనే వాస్తవాన్ని గ్రహించి ఇకనైనా పరివర్తన చెంది సామాజిక పోరాటాలని రాజ్యాధికార పోరాటం దిశగా మళ్లించి ఆధిపత్య కులాల కబంధ హస్తాల్లో బందీ అయిపోయిన రాజ్యం ఉలిక్కిపడేలా సామా జిక, రాజకీయ పోరాటాలు చేయాల్సిన తక్షణ అవసరం ఉన్నది. దేశంలో మెజారిటీగా ఉన్న మనం ఏకమై బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకోవడమే ముందున్న అంతిమ లక్ష్యమని భావించాలి.
పుల్లెంల గణేష్
95530 41549