- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చిట్‌ఫండ్ సంస్థల ఆగడాలెన్నో...
ఇటీవల పత్రికల్లో తరచుగా వస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థల వ్యవహారం మధ్యతరగతి కుటుంబీకులను, ముఖ్యంగా చిరు ఉద్యోగులను కలవరానికి గురి చేస్తోంది. ఎందుకంటే ఈ వర్గాలకు సంబంధించిన వ్యక్తులే ముఖ్యంగా చిట్‌ఫండ్ సంస్థల్లో సభ్యులుగా చేరుతున్నారు, నష్టపోతున్నారు. మన రాష్ట్రంలో 60 ఏళ్ల క్రితం ప్రారంభమైన మార్గదర్శి సంస్థ ఇప్పటి వరకు తమ సంస్థ ద్వారా 50 లక్షల మంది సభ్యులకు చెల్లించిన మొత్తం 5 లక్షల కోట్లని స్వయాన ఆ సంస్థ ఎండీ వెల్లడించిన విషయం పలువురిని దిగ్భ్రాంతి పరుస్తోంది. ఎందుకంటే ఒక్క మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థనే ఇన్ని లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు నడిపింది అంటే దేశంలో ఇదే రంగంలో వున్న అసంఖ్యాకమైన రిజిస్టర్డు, అన్‌రిజిస్టర్డు చిట్‌ఫండ్ సంస్థలన్నీ కలిపి ఎన్ని లక్షల కోట్ల చిట్టీల వ్యాపారం చేస్తున్నట్లు? ఈ మొత్తం డబ్బు ఎవరిది? చిట్‌ఫండ్ సంస్థల్లో సభ్యులుగా చేరి ప్రతి నెల క్రమం తప్పకుండా చెల్లిస్తున్న వారిదే కదా! ఈ డబ్బును చిట్‌ఫండ్ సంస్థలు ఏం చేస్తున్నవి? ఎటు తరలిస్తున్నవి?
మార్గదర్శికి చట్టాలు వర్తించవట
రాష్ట్రంలో వున్న చిట్‌ఫండ్ సంస్థలు అన్నింటిలోకెల్లా పెద్దది మార్గదర్శి. ఈ సంస్థ తమ వద్ద చిట్టీ ఎత్తుకున్న వారికి అధిక వడ్డీ ఆశ చూపి వారి చిట్టీ డబ్బులను డిపాజిట్స్ రూపంలో తీసుకుని ఆ డబ్బును తమ ఇతర వ్యాపార సంస్థల్లో పెట్టుబడిగా పెట్టి గత మూడు దశాబ్దాల నుండి వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుందన్నది ఈ సంస్థపై వస్తున్న ప్రధాన ఆరోపణ. మార్గదర్శి సంస్థ తమ ఇతర వ్యాపార సంస్థల్లో పెట్టుబడిగా పెడుతున్న ఈ డబ్బంతా మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ సభ్యులది. దాని నిర్వాహకులది ఎంత మాత్రం కాదు. సభ్యుల నుండి డిపాజిట్స్ రూపంలో తీసుకున్న డబ్బును తమ ఇతర వ్యాపార సంస్థలకు పెట్టుబడిగా తరలించడం ఆర్థిక నేరంగా పరిగణించబడుతుంది అని 1982 చిట్‌ఫండ్ యాక్ట్‌తో పాటు 1999లో వచ్చిన చట్టాలు చెప్తున్నా ఈ సంస్థ యథేచ్ఛగా ఈ చట్టాలను ఉల్లంఘిస్తుంది. తాజాగా ఏపీ సీఐడీ విచారణ సందర్భంగా ఈ సంస్థ ఎండీ తమ మార్గదర్శి సంస్థకు ఈ చిట్‌ఫండ్ యాక్ట్ చట్టాలు వర్తించవని చెప్పారు. మరి ఏ చట్టాలు వర్తిస్తాయి?
మార్గదర్శినే కాదు ఏ చిట్‌ఫండ్ సంస్థ కూడా చిట్‌ఫండ్ యాక్ట్‌కు అతీతం కావు. చట్టం అన్ని సంస్థలకు సమానంగా వర్తిస్తుంది. మొదటి నుండి మార్గదర్శి చిట్‌ఫండ్ యాక్ట్ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ తమ వ్యాపారాన్ని విస్తృత పరుచుకుంటున్నది. మార్గదర్శి వ్యవహారశైలి అది తన మదుపరుల డబ్బుతో కొనసాగిస్తున్న అక్రమ వ్యాపారాలను గత కొంత కాలంగా నిశితంగా గమనిస్తూ వచ్చిన కొందరు ఆశాపరులు సొంతంగా చిట్‌ఫండ్స్ సంస్థలు స్థాపించి మదుపరుల డబ్బును రియల్ ఎస్టేట్ రంగాలకు యథేచ్ఛగా తరలించి ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల వరంగల్ జిల్లా కేంద్రంగా నడుస్తున్న కొన్ని చిట్‌ఫండ్ కంపెనీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మార్గదర్శి అడుగు జాడల్లో నడుస్తున్న ఈ చిట్‌ఫండ్ సంస్థల వ్యవహారాన్ని కూడా ఓ సారి పరిశీలిద్దాం.
వరంగల్ చిట్‌ఫండ్స్ దగా
వరంగల్ జిల్లాలో ఉన్నన్ని చిట్‌ఫండ్ సంస్థలు తెలంగాణలో ఏ జిల్లాలో కూడా లేవు. ఇక్కడ అక్షర, కనకదుర్గ, శుభనందిని, అచల, భవితశ్రీ లాంటి పెక్కు చిట్‌ఫండ్ సంస్థలున్నాయి. వీటిలో అక్షర పెద్దది. ఈ చిట్‌ఫండ్ సంస్థలు చాలా వరకు తమ చిట్‌ఫండ్ సంస్థలో సభ్యులుగా చేరిన వారి డబ్బులతో వరంగల్‌కున్న ప్రధాన జాతీయ రహదారుల ఇరువైపుల భూములు కొని ప్లాటింగ్ చేసిన్రు. తమ సంస్థల్లో చిట్టి ఎత్తుకున్న ఐదారు నెలలు గడిచినా డబ్బులు చెల్లించకుండా తమ వద్ద ప్రస్తుతానికి సరిపోను డబ్బులు లేవని వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని లేదంటే తమ వెంచర్లలోని ప్లాట్లను మార్కెట్ రేటుకు రెట్టింపు రేటుతో అంటగడుతున్నారు. ఈ మధ్య కాలంలో చిట్టీ ఎత్తుకున్న ఓ వ్యక్తి తనకు ప్లాట్ అవసరం లేదని తను చెల్లించిన చిట్టీ డబ్బు తనకు చెల్లిస్తే చాలని తనను చిట్టీలో చేర్పించిన ఏజెంటును నిలదీయగా ఆ ఏజెంట్ ఆ వ్యక్తిపై పెట్రోల్ పోసి తగులబెట్టిండు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో పలువురిని కలవరానికి గురి చేసింది. దీనికి అప్పుడు కమిషనర్ చర్యలు తీసుకున్నా,
కొంతమంది రాజకీయ పార్టీల నాయకుల అండతో యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తూ తమ అక్రమాలను సాగిస్తున్నరు. అయితే ఇక్కడ నడుస్తున్న చిట్‌ఫండ్ సంస్థలన్నింటిలో అక్షర పెద్దది. దీని యజమాని కపిల్ చిట్‌ఫండ్ సంస్థలో పనిచేసి ఆ అనుభవంతో అక్షర చిట్‌ఫండ్ సంస్థను అట్టహాసంగా ప్రారంభించి దాని బ్రాంచ్ ఆఫీసులను హైదరాబాద్‌లో కూడా తెరిచి పెద్ద సంఖ్యలో సభ్యులను తమ చిట్‌ఫండ్ సంస్థలో చేర్పించి ఎవ్వరికి తెలుపకుండా హైదరాబాదులోని తమ బ్రాంచ్ ఆఫీసులన్నిటినీ క్రమంగా మూసివేస్తుంది. దీనితో దీని సభ్యులకు ముఖ్యంగా చిట్టి ఎత్తుకున్న వారికి ఐదారు నెలల నుండి ఎవరిని ఎక్కడ కలిసి తమ గోడు వినిపించుకోవాలో అర్థం కాని దయనీయ పరిస్థితి ఏర్పడింది.
ఈ జిల్లా కేంద్రంగా నడుస్తున్న చిట్‌ఫండ్ సంస్థల యజమానులంతా తమ చిట్‌ఫండ్ సంస్థల్లోని సభ్యుల డబ్బును రియల్ ఎస్టేట్ రంగానికి తరలించి అక్రమంగా వందల కోట్ల రూపాయలకు పడగెత్తి విలాసవంతమైన జీవితాలు నడుపుతుంటే వీళ్ల చిట్టీల్లో సభ్యులుగా చేరిన వారు మాత్రం చిట్‌ఫండ్ ఆఫీసుల, రిజిస్టార్ ఆఫ్ చిట్‌ఫండ్ ఆఫీసుల, పోలీస్ స్టేషన్ల, కోర్టుల చుట్టూ తిరుగుతున్నరు. ఇక్కడ చిట్‌ఫండ్ సంస్థల బాధితులంతా వేలల్లోనే ఉంటరు. వీరికి న్యాయం చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులందరిది.
లక్షల కోట్ల లావాదేవీలు
దేశంలో నేడు కొన్ని వేల రిజిస్టర్డు చిట్‌ఫండ్ సంస్థలుంటే అసంఖ్యాకమైన అన్‌రిజిస్టర్డు చిట్‌ఫండ్ సంస్థలున్నాయి. వీళ్ల వ్యాపార లావాదేవీలు లక్షల కోట్లలో ఉంటాయి. వీటిలో సభ్యులు రెండు మూడు కోట్ల వరకు ఉంటారని అనధికార అంచనా. దేశ వ్యాప్తంగా పుట్టుకొచ్చిన ఈ చిట్‌ఫండ్ సంస్థల వ్యాపారాన్ని నియంత్రించే చట్టాలు చాలా వచ్చినయి. మన రాష్ట్రంలో 1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొన్ని చట్టాలు చేసింది. ఆ పిదప కేంద్రప్రభుత్వం 1982లో దేశంలోని చిట్‌ఫండ్ సంస్థలన్నిటికి వర్తించే కొన్ని చట్టాలను చేసింది. ఈ చట్టం ప్రకారం చిట్‌ఫండ్ సంస్థలు తమ సంస్థల డబ్బులను వేరే వ్యాపార రంగాలకు పెట్టుబడులుగా తరలించడం నేరం. చిట్‌ఫండ్ నిర్వాహకుడు పబ్లిక్ మనీ మ్యానేజింగ్ వ్యక్తి మాత్రమే అతనికి చిట్‌ఫండ్ డబ్బులను వేరే రంగాలకు తరలించే అధికారం లేదని పేర్కొంటున్నాయి. చివరగా 1999లో వచ్చిన డిపాజిట్ దారుల హక్కుల పరిరక్షణ చట్టం డిపాజిట్ దారుల డబ్బును వేరే రంగాలకు తరలించడం నేరం అని పేర్కొంటుంది. చట్టాలు ఎన్ని వచ్చినా దేశంలోని చిట్‌ఫండ్ సంస్థల ఆగడాలను నియంత్రించలేక పోతున్నయి. దేశంలో ఏ ఆరోపణలు ఎదుర్కోని చిట్‌ఫండ్ సంస్థ మచ్చుకు ఒక్కటి అంటే ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు.
వీటి నిర్వాహకులు ప్రజల డబ్బుతో తమ వ్యాపారాలను పెంపొందించుకుని కోట్లకు పడగలెత్తితే వీటిలో సభ్యులుగా చేరిన దిగువ, మధ్య తరగతి వ్యక్తులు, ఉద్యోగస్థులు మాత్రం చట్టబద్ధంగా తమకు రావల్సిన తమ డబ్బు కోసం న్యాయస్థానాల, పోలీస్ స్టేషన్ల, సంభందిత ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ బాధితులకు న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత ఈ అధికారులది. వీళ్లు సకాలంలో సరైన రీతిలో స్పందించి బాధితులకు న్యాయం చేకూరుస్తారని ఆశిద్దాం.
-ప్రొఫెసర్ జి.లక్ష్మణ్
ఉస్మానియా యూనివర్సిటీ
9849136104
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672