బాలల చిత్రాలు కనుమరుగు

by Ravi |   ( Updated:2022-09-03 17:13:18.0  )
బాలల చిత్రాలు కనుమరుగు
X

అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం హైదరాబాద్‌లో టూరింగ్ ఫెస్టివల్‌గానే మిగిలిపోయింది. 'ఉరిమి ఉరిమి మంగళం' మీద పడ్డట్టు కేంద్ర ప్రభుత్వం చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీని తీసుకెళ్లి నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో కలిపేసింది. దీంతో ఆ సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఇకముందు భారతీయ చరిత్ర, సంస్కృతి, జీవన విధానం తెలిపే బాలల చిత్రాలు ఏ మేరకు వస్తాయో తెలీదు. 'తారే జమీన్ పర్'లాంటి కొన్ని సినిమాలూ వస్తున్నాయి. వినోద్ కాంబ్లీ, సమిట్ కక్కాద్ లాంటి వాళ్లు లాభాపేక్ష లేకుండా బాలల సినిమాలు తీస్తున్నారు. ఓటీటీలలో వస్తున్న సిరీస్‌లలో పిల్లల కోసం వస్తున్నవి మనదైనవేవీ లేకపోవడం విషాదం.

సెలవులు వచ్చాయంటే చాలు గతంలో పిల్లలు ఇంటి బయట సిర్రగోనే, బొంగురాలు, చార్పత్తా , పతంగీలు, ఇంటిలోనయితే అష్టాచెమ్మా, పచ్చీసు ఇట్లా ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో ఆటలు ఆడేది. కాలక్రమంలో అవన్నీ పోయాయి. ఈ రోజు అంతా వేగం. ఇవ్వాలున్నది రేపుండే అవకాశం లేదు. 40 అడుగుల యాంటెన్నాలు, కేబుల్ టీవీలు అన్నీ పాతబడిపోయి, స్మార్ట్ ఫోన్, యూట్యూబ్, ఓటీటీ యుగం నడుస్తున్నది. పిల్లలు పెద్దలు అంతా చూడడమే. కొంచెం సమయమో, సెలవో దొరికితే చాలు పిల్లలు ఫోన్లతోనే కాలం గడిపేస్తున్నారు.యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, హాట్‌స్టార్, సోనీ, అమెజాన్ ప్రైం ఇట్లా అనేక స్ట్రీమింగ్ వీడియోలని చూస్తున్నారు.

ఒక గణాంకం ప్రకారం ఒక్క యూట్యూబ్‌లోనే గంటకు 30 వేల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. ఇక మిగతా చానల్స్ సంగతి చెప్పనే అక్కరలేదు. ఇన్ని వీడియోలు అరచేతిలో అందుబాటులోకి వచ్చినప్పుడు పిల్లలు వాటిలో ఏం చూస్తున్నారు? వాళ్ల మీద వాటి ప్రభావం ఎట్లా ఉంటుంది? ఎప్పుడయినా, ఎవరమైనా గమస్తున్నామా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. హింస, అమానవీయ, అశ్లీల వీడియోలకు అంతే లేదు. బాలలను ఇట్లా ఆన్లైన్ కంటెంట్‌కి వదిలేయడమేనా? వారి భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం పెద్దలకు లేదా? పెద్దలుగా మనమేం చేస్తున్నాం? అని ప్రశ్నించుకుంటే ఒకింత ఆందోళన, మరింత ఆవేదన కలుగుతుంది.

మాటలు బాగా చెబుతాం

ఈ మాటలు కొంచెం నిష్టూరం అనిపించినా మనం బాలల కోసం ఏమీ చేయం. మాట్లాడుతాం. భావిభారత పౌరులంటాం. భవిష్యత్ జాతి నిర్మాతలంటాం. మరెన్నో మాటలు చెబుతాం. బాలలకేమి కావాలో, మనమేం చేయాలో చూడం, చేయం. బాలలని 'నియంత్రణ' పేర పోలీసింగ్ చేస్తాం. విలువల పేర భారీ ఉపన్యాసాలిస్తాం. అంతే. సాంకేతికంగా జరుగుతున్న అభివృద్ది ఆధునికత నేపథ్యంలో ఆన్లైన్‌ని ఎట్లా అదుపు చేస్తాం అనిపించవచ్చు. చెడును చూడకుండా అదుపు చేయలేనప్పుడు, మంచి చూసే అవకాశాన్ని మనం కల్పించాలి కదా? ఏది మంచి అన్నది పిల్లలకు తెలియజేయాలి కదా? మంచి వీడియోలు, సినిమాలు అందుబాటులోకి తేవాలి కదా? ఆ దిశలో ఏమయినా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే జవాబు నిరాశాజనకంగానే ఉంది.

ప్రధాన స్రవంతి సినిమా నిర్మాతలు, మీడియా కేవలం లాభాల మాటే వింటాయి. పిల్లల సినిమాలు, సీరియళ్లు అంటే చాలు 'మార్కెట్ ఉండదు. లాభాలు రావు' అంటారు. అందుకే తెలుగు సహా పిల్లల కంటెంట్ పైన దృష్టి పెట్టిన భారతీయ భాషలు అరుదు. ఇక ప్రభుత్వ రంగంలో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ యాక్టివ్‌గా ఉన్నప్పుడు, కేదార్‌శర్మ, భీమసేన్, జయాబచ్చన్, సాయి పరంజపే, గుల్జార్ తదితరులు దానితో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. పోత్లీ బాబా, జంగల్ బుక్, ముజ్సే దోస్తీ కరోగే, లావణ్య ప్రీతీ ఇట్లా ఎన్నో సినిమాలు వచ్చాయి.

నాటి నుంచి నేటి దాకా

భారత తొలి ప్రధాని నెహ్రూ ఆలోచనల మేరకు, ఎస్‌కే పాటిల్ కమిటీ సూచనల ప్రకారం 1955లో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఏర్పాటైంది. బాలల కోసం సినిమాలు నిర్మించడం, నిర్మాతలకు ఆర్థికంగా సహాయం చేయడం, రెండేండ్లకోసారి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన కర్తవ్యాలు. అందులో భాగంగానే సొసైటీ దేశంలోని వివిధ నగరాలలో 1979 నుంచి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నది. 1995లో మొదటిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించారు. 1999లో మరోసారి నిర్వహించారు. అనంతరం బాలల చిత్రోత్సవాలకు ఒక శాశ్వత వేదిక ఉండాలని భావించి హైదరాబాద్‌ని ప్రతిపాదించారు. అప్పటి ప్రభుత్వం ఇతోధిక సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. రాష్ట్రంలో నిర్మించే బాలల చిత్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తే నగదు బహుమతులు ఇస్తామని ప్రకటించింది.

సొసైటీకి భూమి ఇస్తామని, అందులో శాశ్వత కార్యాలయం, ప్రత్యేక థియేటర్లు నిర్మించుకోవాలని సూచించింది. అవేవీ సాకారం కాలేదు. భూమి ఇచ్చారు స్వాధీనం చేయలేదు. తెలంగాణా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదేమీ జరగలేదు. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం హైదరాబాద్‌లో టూరింగ్ ఫెస్టివల్‌గానే మిగిలిపోయింది. 'ఉరిమి ఉరిమి మంగళం' మీద పడ్డట్టు కేంద్ర ప్రభుత్వం చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీని తీసుకెళ్లి నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో కలిపేసింది. దీంతో ఆ సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఇకముందు భారతీయ చరిత్ర, సంస్కృతి, జీవన విధానం తెలిపే బాలల చిత్రాలు ఏ మేరకు వస్తాయో తెలీదు. 'తారే జమీన్ పర్'లాంటి కొన్ని సినిమాలూ వస్తున్నాయి. వినోద్ కాంబ్లీ, సమిట్ కక్కాద్ లాంటి వాళ్లు లాభాపేక్ష లేకుండా బాలల సినిమాలు తీస్తున్నారు. ఓటీటీలలో వస్తున్న సిరీస్‌లలో పిల్లల కోసం వస్తున్నవి మనదైనవేవీ లేకపోవడం విషాదం.

కరీంనగర్‌లోనూ

కరీంనగర్ ఫిలిం సొసైటీ 1980లో మొదటిసారి బాలల కోసం చిత్రోత్సవం నిర్వహించింది. 20 సంవత్సారాలపాటు ప్రతి నవంబర్‌లో ఈ ఉత్సవాలు జరిగాయి. అప్పటి కలెక్టర్లు కేఎస్ శర్మ, ఆర్.చంద్రశేఖర్, టీఎస్ అప్పారావు, సుమితాదావ్రా, సి.పార్థసారథి, దానకిశోర్ తదితరులు ఇతోధికంగా సహకరించారు. 1987లో గ్రామీణ బాలల కోసం చొప్పదండి, తాటిపల్లి, కొండాపూర్, మల్లాపూర్, పెంబట్ల తదితర గ్రామాలలో పిల్లల సినిమాలు ప్రదర్శించారు. హైదరాబాద్‌లో ఎం. వేదకుమార్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. నల్లగొండ, వేములవాడ, సిరిసిల్ల లాంటి అనేక ప్రాంతాలలో విరివిగా సినిమాలను ప్రదర్శించారు. కల్యాణం శ్రీనివాస్‌లాంటి వారిచేత పిల్లలకు యానిమేషన్‌లో శిక్షణ కూడా ఇప్పించారు. ఇప్పుడవన్నీ గత ఖ్యాతిగా మిగిలిపోయాయి. పిల్లల కోసం పనిచేసేవారు అరుదుగా కనిపిస్తారు. కాలం ముగిసిపోక ముందే పిల్లలకు అర్థవంతమైన వినోదాన్నీ, అవసరమైన విజ్ఞాన్నీ, విలువల్నీ అందించే వీడియోలనీ, సినిమాలనీ రూపొందించాల్సి వుంది.

-వారాల ఆనంద్

9440 501281

Advertisement

Next Story

Most Viewed