- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంగడి సరుకులుగా..చిన్నారులు!
భారతదేశవ్యాప్తంగా తప్పిపోయిన లేదా కిడ్నాప్ అయిన పిల్లల సంఖ్య దినదినం క్రమంగా పెరుగుతోంది. ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలు, పక్క దుకాణంలో చాకొలేట్ కొనుక్కోవడానికి వెళ్లిన పిల్లలు తిరిగి మళ్లీ ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నివాస ప్రాంతంలో వెతకడం, ఆవేదనతో పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. పలు సందర్భాల్లో పిల్లల ఆచూకీ దొరకడం లేదు. ఇలా పిల్లలు తప్పిపోయిన సందర్భాల్లో తిరిగి వెతికి గుర్తించడంతో ఆయా కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పిల్లల్ని దొంగిలించే ముఠాల చేతిలో చిక్కిన బాలలు దొరకడం అరుదుగా జరుగుతున్నది. బాలల అక్రమ రవాణా (చిల్డ్రన్ ట్రాఫికింగ్) వ్యవస్థ వేళ్లూనుకొని బలపడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అక్రమ రవాణా విష వలయంలో చిక్కిన పిల్లల జీవితాలు ఛిద్రం కావడం తప్పనిసరి అని తెలుసుకోవాలి.
ఆచూకీ దొరికిన వారిది 34 శాతమే!
కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం 2018 నుంచి జూన్ 2023 వరకు దేశవ్యాప్తంగా 2,75,125 మంది బాలలు తప్పిపోయారని పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. నేడు భారతంలో గంటకు ఎనిమిది పిల్లలు తప్పిపోతున్నారు. వీరిలో 62,237 మంది బాలురు, 2,12,825 మంది బాలికలు ఉన్నారు. పోలీసు యంత్రాంగం, పౌర సమాజం చొరవతో తప్పిపోయిన పిల్లల్లో 2,40,502 మంది బాలలు దొరికినప్పటికీ 34,623 మంది ఇప్పటికీ దొరకలేదు. వాడల్లో ఆడుకుంటున్న పిల్లల్ని చాకచక్యంగా దొంగిలించే ముఠాలు వారిని అక్రమ రవాణా చేసి సుదూర ప్రాంత పట్టణాల్లో వెట్టిచాకిరి లేదా వ్యభిచార వృత్తిలోకి బలవంతంగా దించడం నమ్మలేని నిజం అని తెలుస్తున్నది.
సాధారణంగా రోడ్ల వెంట నిద్రించే కూలీలు, స్లమ్స్, పేదల నివాస స్థలాల నుంచి పిల్లల్ని దొంగలించడం అధికంగా జరుగుతున్నది. ఢిల్లీ, కలకత్తా, ముంబాయి లాంటి పట్టణాలకు చెందిన సంతానంతో లేని తల్లితండ్రులకు అమ్మడం కూడా ఒక మంచి ఆదాయంగా అక్రమార్కులు ఎంచుకోవడం విచారకరం. దేశంలో దొంగిలించిన పిల్లల్ని చీకటి వ్యాపార సంస్థలకు గరిష్టంగా రూ. 2 - 5 లక్షల ధర వరకు కూడా అమ్మడం జరుగుతున్నది. ఎంపీలో 61,102 మంది పిల్లలు(అందులో 49,024 బాలికలు), పశ్చిమ బెంగాల్‌లో 49,129 మంది (41,808 బాలికలు), కర్నాటకలో 27,528 మంది (18,893 బాలికలు), గుజరాత్‌లో 20,081 మంది (16,432 బాలికలు), ఢిల్లీలో 22,964 మంది పిల్లలు (15,363 బాలికలు) తప్పిపోయారని గణాంకాలు తెలుపుతున్నాయి. 2022 లో 11,717 మంది బాలలు తప్పిపోయారని, అందులో 34 శాతం అనగా 3,974 మంది మాత్రమే దొరికారని, ఇప్పటికీ 7,698 మంది ఆచూకీ దొరకలేదని తేలింది. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన భారత ప్రభుత్వం ‘జువెనైల్ జస్టిస్ ఆక్ట్ (బాలల న్యాయ చట్టం), 2015’ తీసుకువచ్చినప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించకపోవడం విచారకరం.
లాభసాటి వ్యాపారంగా మారి..
ఒకప్పుడు పట్టణ పిల్లల్ని మాత్రమే దొంగిలించే దుర్మార్గులు నేడు గ్రామీణ పిల్లల్ని కూడా దొంగిలించే స్థాయికి దిగజారడం ప్రమాదకర పరిస్థితులకు అద్దం పడుతున్నది. బిక్షాటన వృత్తి ఓ ఆదాయ పరిశ్రమగా వెలిసింది. దొంగిలించిన లేదా కిడ్నాప్ చేసిన పిల్లల్ని మహానగరాల్లో బిక్షాటన గ్రూపులకు అమ్మడం, ఆ పిల్లల్ని దేవాలయాలు/ బస్ కూడళ్లు/ రైల్వే స్టేషన్లు/ ప్రధాన మార్కెట్ ఏరియాల్లో భిక్షాటనకు వినియోగించడం కూడా లాభసాటి వ్యాపారం అవుతున్నది. బెంగాల్‌లోకి కొన్ని గ్రామాల నిరుపేద కుటుంబాలు పిల్లల్ని అమ్మడానికి కూడా వెనకాడడం లేదు. భారతదేశంలో దాదాపు 15 లక్షల మంది భిక్షగాళ్లు ఉన్నట్లు అంచనా. భిక్షాటన చేసే వారి సంఖ్య పశ్చిమ బెంగాల్, యూపీల్లో అధికంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల అక్రమ రవాణా వ్యాపారం 150 బిలియన్ డాలర్లకు చేరిందని అంచనా వేశారు. అంతర్జాతీయ చీకటి వ్యాపార సామ్రాజ్యాల్లో దొంగిలించిన పిల్లల్ని 15 - 25 లక్షల డాలర్లకు కూడా అమ్మడం జరుగుతున్నట్లు తేలింది.
నేటి బాలలే రేపటి పౌరులు. బాల్యం ఓ అపురూప జీవన దశ. పిల్లల బాల్యాన్ని నిర్లక్ష్యం చేసిన సమాజం భవిష్యత్ అంధకారమే. బాలల్ని పువ్వుల్లో పెట్టుకుని పెంచాలి. బాలల భద్రత, సంక్షేమం ప్రభుత్వాల ప్రాధాన్యం కావాలి. బాలలు తప్పిపోవడం లేదా కిడ్నాపింగ్‌కు గురికావడం ప్రభుత్వాల, పౌర సమాజ నిర్లక్ష్యమే. బాలల పరిరక్షణకు పటిష్ట చట్టాలు, అక్రమ రవాణా చేసిన వారికి కఠిన శిక్షలు అమలు పరచాలి. నేటి భారత పిల్లల భద్రతకు గొడుగు పట్టాలి. చిన్నారుల జీవితాలను ఆదిలోనే తుంచక, సుగంధ భరితంగా వికసింపజేయాలి. పిల్లల్లో దేవుడిని చూడాలి. అక్రమార్కుల చేతులను ఆదిలోనే నిర్ధయగా నరికి వేయాలి.
డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
99497 00037