సమాజాన్ని సర్జరీ చేసే పని.. నిరంతరంగా జరగాల్సిందే!

by Ravi |   ( Updated:2024-09-19 01:30:36.0  )
సమాజాన్ని సర్జరీ చేసే పని.. నిరంతరంగా జరగాల్సిందే!
X

ఆర్‌.జి కర్ ఆసుపత్రిలోని అరాచకత్వం దేశం మొత్తం ప్రజల్ని కదిలించింది. ప్రపంచాన్ని కదిలించింది. బాధితురాలి మీద జరిగిన ఘోర హింస సమస్త ప్రజానీకం గుండెల్ని పిండి చేసింది. క్రూరమైన, పాశవికమైన దాడి సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. ఈ నేరానికి శిక్ష పడాల్సిందే. అందులో సందేహం లేదు. అయితే ఈ మొత్తం చర్య వెనుక మనిషి వ్యక్తిగతంగా మాత్రమే కారణం అవుతాడని ఎలా చెప్పగలం? వ్యక్తి కోణం నుండి బయటకు జరిగి, కాస్త సమాజం ఫ్రేమ్‌లో అతికించి చూస్తే, ఆయా వ్యక్తుల వెనుక వ్యవస్థాగత వైఫల్యాలు ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయో అర్థం అవుతుంది.

ఈ కేస్‌లో అరెస్ట్ అయిన నిందితుడు ఒక సైకోగా తెలుస్తోంది. పోర్న్ వీడియోలకు పూర్తిగా బలైపోయాడని తెలుస్తోంది.. ఆ మధ్య ఒక 12వ తరగతి అమ్మాయి ట్యూషన్ నుండి వస్తోంది. పక్కనే అమ్మాయి తల్లి కూడా ఉంది. తన ప్రేమ ప్రపోజల్ని తిరస్కరించిందని ఆ అమ్మాయి మీద అబ్బాయి అత్యంత దారుణంగా కత్తితో ఎటాక్ చేసాడు. రక్తపాతంతో చావు బతుకుల మీద అమ్మాయి రోడ్డు మీద అందరి ఎదురుగా విలవిల్లాడుతోంది. అమెరికాలో అయితే, పిల్లలు మరింత ముందుకు ఎదిగారు. ఏకంగా తుపాకీ తీసుకొని మాస్ షూటింగ్‌కి పాల్పడుతున్నారు. పిల్లల్లో పెరుగుతున్న ఈ అగ్రెసివ్‌‌నెస్‌కి కారణం ఏమిటి?

హింసను ఎంజాయ్‌మెంట్‌గా చేస్తే..

డిజిటల్ ప్రపంచంలో వస్తున్న విపరీతమైన మార్పు పిల్లలలోనూ, యువతలోనూ అనూహ్యమైన ప్రభావం చూపుతోంది. గేమింగ్ పరిశ్రమ ఒకవైపూ, పోర్న్ పరిశ్రమ మరో వైపూ సున్నితమైన మానవతా విలువలని ఛిద్రం చేస్తున్నాయి. పిల్లలు హింసాత్మక వీడియో గేమ్స్ ఆడుతున్నారు. వివిధ రకాల ఆయుధాల వాడకం ఆ గేమ్స్‌లో నడు స్తుంది. గేమ్‌లో నిలదొక్కుకోవాలంటే అవతలి వ్యక్తిని చంపాలి. అవతలి వ్యక్తి మీద విపరీతమైన ఆయుధాలు ప్రయోగించి అవ తలి ప్రత్యర్థిని చంపాలి. అలా చంపుతూ ఉంటేనే వారికి రివార్డ్స్ దొరుకుతుంటాయి. చంపడం అన్నది ఒక పాజిటివ్ లక్షణంగా ఈ వీడియో గేమ్‌లో ఈ అబ్బాయిలు, అమ్మాయిలు చూస్తున్నారు. అంతేకాదు. ఇంగ్లిషులో తిట్లు కూడా నేర్చుకుంటారు. వీలైనంత ఎక్కువ హింసను ఎక్కువ తీవ్రతలో ఎంజాయ్ చేస్తున్నారు. M రేటెడ్ గేమ్స్ (పెద్దవాళ్లు మాత్రమే చట్టపరంగా ఆడగలిగేవి) కూడా టీనేజీ పిల్లలు ఆడడంలో నియంత్రణ కనిపించడం లేదు. గేమింగ్ పరిశ్రమలో కూడా విపరీతంగా లాభాలు ఉండ టం కారణంగా, ఈ గేమ్స్ మొదటికంటే రియలిస్టిక్‌గా ఉండడానికి టెక్నాలజీతో అందంగా ప్యాక్ చేస్తున్నారు. ఆయా దేశాల పిల్లలు వాడే అవాంఛనీయమైన పదాలు, ప్రవర్తన, భాషతో పిల్లలు ప్రభావితం అవుతున్నారు. దీంతో పిల్లలు విద్యాలయాల్లో అగ్రెసివ్‌గా ప్రవర్తిస్తున్నారు. వర్చువల్ ప్రపంచంలో వీరు చూసేదే నిజ జీవితంలో ప్రయోగం చేస్తున్నారు. వీడియో గేమింగ్ పరిశ్రమ సాధారణ పరిశ్రమ కాదు. వేల కోట్ల వ్యాపారం ఇందులో ఉంది. 2022లో 347 బిలియన్ల డాలర్ల వ్యాపారం ఒక్క గేమింగ్ పరిశ్రమ నుండే ఉంది.

వారే హింస కోరుకుంటున్నట్టు..

జుగుప్సాకరమైన పోర్న్ ప్రపంచంలోకి వస్తే, అమ్మాయిలని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే తమపై అత్యాచారం చేయమని అమ్మాయిలే కోరుతున్నట్టు గ్లోరీపై చేసే పోర్న్ ప్రపంచం ఇప్పుడు, ప్రజల, యువత చేతి వేళ్ల మీద ఉంది. 'అమ్మాయిల మీద లైంగిక హింస ఇలా సరైనదే. అమ్మాయిలు ఇలానే కోరుకుంటున్నారు' అన్నట్టు తప్పుడు విలువలు ఈ ప్రపంచం అందిస్తుంది. లైంగిక తృప్తి అనేది హింసతో వస్తుందనీ, అవతలి మహిళను ఎంతగా హింసిస్తే అంత గా ఆనందం వస్తుందనీ తప్పుడు విలువల్ని ఈ పోర్న్ ప్రపంచం అందిస్తుంది. దంపతుల మధ్య ఉండాల్సిన ప్రేమపూర్వకమైన, సున్నితమైన, అత్యంత సహజమైన లైంగిక సంబంధం బదులు వర్చువల్ ప్రపంచం అందుకు భిన్నంగా లైంగిక సంబంధాలలో హింసను గ్లోరిఫై చేస్తోంది. అదే సరైనది అని నమ్మేంతగా బ్రెయిన్ వాష్ చేస్తోంది. పోర్న్ ప్రపంచానికి బానిసగా మారిన భర్తల చేతుల్లో ఎంతమంది స్త్రీలు నిశ్శబ్దంగా నలిగిపోతున్నారో? అందుకు బలైన యువత వాస్తవ జీవితంలోకి వచ్చేటప్పుడు వాస్తవ జీవితానికి, వర్చువల్ జీవితానికి మధ్య తేడా మరిచిపోయి వారు మరింత మానసిక రోగులుగా మిగులుతున్నారు. సున్నితత్వం పోయి కర్కశత్వం పెరుగుతోంది. ఇదంతా వ్యవస్థాగతమైన వైఫల్యం కాదంటామా?

అంతర్జాలం చేతివేళ్లలో..

ప్రపంచీకరణ పవనాల రాకతో ఈ రుగ్మత మరింత పెరిగింది. 1990ల నుండి మన దేశం విదేశీ పెట్టుబడులకు స్వాగత గీతం పలికింది. ఆర్థిక సరళీకరణలతో పెట్టుబడులతో పాటు, విదేశాల టెక్నాలజీ కూడా అడుగుపెట్టింది. డిజిటల్ టెక్నాలజీతోపాటు సాఫ్ట్‌వేర్ రంగం అభివృద్ధితో సేవల్లో ఎన్నో ప్రయోజనాలు ప్రజలు పొందారు. ఇదో ప్లస్ పాయింట్. ఉదయాన్నే బ్యాంకుల తలుపు తట్టకుండానే మొబైల్‌నే బ్యాంకుగా మార్చేసుకొని ఆర్థిక లావాదేవీలను నిరాటంకంగా చేసుకోగలుగుతున్నాం. జియో ఉచిత సేవల తో అంతర్జాలం కొత్త ప్రపంచం నేడు ప్రజల చేతుల్లోకి వచ్చింది. ఎక్కడో ఆడుకున్న వీడియో గేమ్స్ నేడు మొబైల్‌లోకి వచ్చాయి. ఎక్కడో ఉన్న నీలి చిత్రాలు నేడు చేతి వేళ్ల మధ్య ఉన్న మొబైల్‌లోకి ప్రవేశించాయి. మూడు దశాబ్దాలలోనే మొత్తం సంస్కృతి, సామాజిక వ్యవస్థ తారుమారు అయింది. కొత్త జనరేషన్‌నీ విపరీతంగా ప్రభావితం చేసింది. సందిగ్ధంలో పడేసింది. తల్లిదండ్రులు కూడా నిస్సహాయంగా మిగలడం బాధాకరం.

చట్టం పని చట్టం చేసినా..

ఇలా చూస్తే అటు గేమింగ్ పరిశ్రమ, ఇటు పోర్న్ పరిశ్రమ వ్యాపార ప్రపంచంలో విపరీతమైన లాభాలను సంపాదిస్తూ వారి ప్రపంచాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లేలా చేసుకుంటూ మన దేశ ప్రజల యువతని, పిల్లల్ని వధ్య శిల మీదకు పంపించేస్తున్నారు. కాబట్టి ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు నిందితుడికి శిక్ష వేయమనడం అన్నది ఒకానొక డిమాండ్. అయితే, చట్టం దగ్గర మాత్రమే ఆగిపోతే సమాజంలో మార్పు రాదు. అనారోగ్యకరమైన సమాజం మాత్రమే నేరస్తులను సృష్టిస్తుంది. ఈ సమాజాన్ని ఆరోగ్యకరంగా మార్చాల్సిన అవసరం ఉంది. అప్పుడే నేరస్తులు కూడా తగ్గుతారు. చట్టం పని చట్టం చేసుకోనిద్దాం. కానీ దాని పక్కనే సమాజాన్ని సర్జరీ చేసే పని నిరంతరంగా జరగాల్సిందే.

కేశవ్

ఆర్థిక, సామాజిక విశ్లేషకులు

98313 14213

Advertisement

Next Story

Most Viewed