- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓటింగ్ సరళిలో మార్పు..
తెలంగాణ ఉద్యమ నేపథ్యం ప్రజల చైత్యన్య స్ఫూర్తిని పెంచడంతో పాటు ప్రజల ఆలోచనా దృక్పథాన్ని మార్చింది.. తెలుగు రాష్ట్రాల్లో సహజంగా ప్రతి పది సంవత్సరాలకు వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత ప్రజా ఉద్యమాలుగా మారి ఓటు చైతన్యంగా మారుతోంది. ఓటింగ్ అనేది వ్యక్తిగత ప్రాధాన్యతలను సామూహిక తీర్పులలోకి చేర్చడానికి ఒక పద్ధతి. ఓటింగ్ అనేది ఒక నిర్దిష్ట రాజకీయ అభ్యర్థి లేదా కొన్ని సామాజిక ఆందోళనల పట్ల ప్రజలు తమ అభిమతాన్ని వ్యక్తీకరించడానికి ఒక మార్గం అయినప్పటికీ, ఓటరుగా ఒక వ్యక్తి విచక్షణాధికారం అయినప్పటికీ, ఓటింగ్‌కు ముందు జరిగే కార్యాచరణ, రాజకీయ పార్టీలకు, దాని నాయకులకు ఛానెలైజ్ చేయడానికి ముఖ్యమైన దశ.
స్వతంత్ర ఓటింగ్‌కే మొగ్గు..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ ప్రజల చైతన్య స్ఫూర్తిపై సమూహాలైన కుల సంఘాలు, మేధోపరమైన సమూహం, పౌర సమాజం, యువజన సంఘాల ప్రభావం బలీయంగా ఉండేది. ఈ సమూహాల ఉమ్మడి లక్ష్యాలు సమాజ ఆలోచన స్థాయిలో మార్పును సాధ్యం చేస్తూ ఓటింగ్ సరళిని ప్రభావితం చేసేవి. కానీ ప్రత్యక్ష లబ్ధిదారుల బదిలీ (డీబీటీ) పథకాలు ఓటరును సమూహ ఓటింగ్ సరళి నుండి స్వతంత్ర ఓటింగ్ సరళి వైపుగా మార్చాయి. తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, పెన్షన్లు వంటి కార్యక్రమాలలో పారదర్శకత అంశాలున్నా, ఓటరును అవి స్వతంత్ర నిర్ణయం తీసుకొనేలాగా మార్చాయి. ఫలితంగా క్షేత్ర స్థాయిలో ఓటరుపై కుల, యువజన, రాజకీయ, గ్రామ స్థాయి సంఘాల ప్రభావం క్రమంగా తగ్గింది. ఒక కులం కానీ, ఒక వర్గం కానీ గుంప గుత్తగా ఓట్లు వేసే ధోరణి మారింది. సమూహంగా గ్రామం, కుల సంఘాల అజమాయిషీ ఒక వ్యక్తిపై క్రమంగా తగ్గింది. అంతేకాకుండా గెలిచిన రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపే నాయకులు, ఓటర్లు ఉన్న పరిస్థితుల్లో ఒక పార్టీకి చెందిన సాంప్రదాయ నాయకులు, సాంప్రదాయ ఓటర్లు కనబడే పరిస్థితి ప్రస్తుతం కనబడట్లేదు. ఈ ధోరణికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాజకీయ పార్టీలు తమ సైద్ధాంతిక పునాదుల మీద కాకుండా పార్టీ అభ్యర్థి గెలుపునే ప్రామాణికంగా తీసుకోవడమే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, ఇతర వామపక్ష రాజకీయ పార్టీల మధ్య కక్షపూరిత(ఫ్యాక్షన్) రాజకీయాలు ఉండడం గమనించాము. నాయకుల మధ్య మాత్రమే కాకుండా ప్రజల మధ్యలో కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన ఓటర్లుగా బాహాబాహీకి దిగుతూ స్పష్టమైన రాజకీయ వర్గ పోరు ఎక్కువగా కనిపించేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో సమాజంలో కొంత కక్షపూరిత రాజకీయాలు మందగించడం జరిగింది. బై పోల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కొంత మేరకు వర్గ పక్షపాతంతో కూడిన కక్షపూరిత రాజకీయాలను ప్రోత్సాహించినా, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలపై సరి అయిన చర్యలు తీసుకోలేకపోవడం వల్ల ప్రజల్లో అనుమానాలకు దారి తీసి ఆ పార్టీ మనుగడకే కొంత ప్రశ్నార్థకంగా మారింది.
పోల్ మేనేజ్మెంటే ముఖ్యం
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మీ వంటి సంక్షేమ పథకాలు బీఅర్ఎస్ పార్టీకి లాభం కంటే నష్టాన్ని ఎక్కువ కలుగజేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉండటం కారణంగా లబ్ధిదారులు ఎంపిక తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల, లబ్ధి పొందని దళితులలో అధికార పార్టీపై అసహనంతో స్పష్టమైన వ్యతిరేక వర్గంగా మారారు. గృహ లక్ష్మి, బీసీ బంధు పథకాల ద్వారా లబ్ధి పొందని వర్గాలు కూడా అధికార పార్టీ మీద వ్యతిరేకతతో ఒక వర్గంగా మారారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా గత పదేళ్లుగా సంస్థాగతంగా క్షేత్ర స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయలేదు. ప్రజల్లో వ్యక్తమవుతున్న బీఆర్ఎస్ పార్టీపై, ప్రభుత్వంపై వ్యతిరేకతను సరి అయిన పద్ధతిలో ఉపయోగించుకునే పోల్ మేనేజ్మెంట్ నిపుణులైన క్షేత్ర స్థాయి రాజకీయ నాయకత్వం లేకపోవడం కాంగ్రెస్ పార్టీలో కొంత లోటుగా కనిపించింది. టీడీపీ, వామపక్ష పార్టీల నాయకుల మాదిరిగా తమ పార్టీ మేనిఫెస్టోను, విధానాలను ఓటర్లకు వివరించే పద్దతిలో కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయి నాయకత్వం ఓటర్లకు అర్థం చేయించలేకపోయారు దీనివల్ల కొంతవరకు అధికార పార్టీకి మళ్ళీ అవకాశం కల్పించే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతపరంగా బలమైన కేడర్ నిర్మించుకుంటూ తాము ఎంచుకున్న నియోజవర్గాలలో ఆశించిన మేరకు ఓటు బ్యాంక్‌ని సొంతం చేసుకోగలిగింది. అంతిమంగా అధికార పార్టీపై ప్రజల నుండి వ్యక్తమవుతున్న అసంతృప్తిని రాజకీయ పార్టీలు సరైన రీతిలో పోల్ మేనేజ్‌మెంట్ చేసినప్పుడు, స్వతంత్ర వ్యక్తిగత ఓటింగ్ సరళి నుండి సమూహ ఓటింగ్ సరళి వైపు ప్రజల ఆలోచన స్థాయిని మళ్లించినపుడే అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించడం ప్రతిపక్షాలకు సాధ్యం అవుతుంది.
డా. జి. వంశీధర్
పోల్ మేనేజ్‌మెంట్ స్ట్రాటెజిస్ట్
97018 11602